నిజామాబాద్

రబీ పంటలకు సరిపడా విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 13: సమృద్ధిగా వర్షాలు కురిసి పరిస్థితులు అనుకూలించడంతో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు ఎంతో ఉత్సాహంగా పంటల సాగును చేపడుతుండగా, విద్యుత్ సరఫరా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ట్రాన్స్‌కో అధికారులు పూర్తి భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సేద్యపు రంగానికి 9గంటల పాటు నిరాటంకంగా విద్యుత్ అందిస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి సంశయానికి లోనుకావాల్సిన అవసరం లేదని ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు 11మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని సోమవారం ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరు నాటి నుండి పంటలకు ఎక్కువ మేర సాగునీటి ఆవశ్యకత ఉండడంతో విద్యుత్ వినియోగం డిమాండ్ 12 నుండి 13 మిలియన్ యూనిట్లకు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. తదనుగుణంగానే విద్యుత్ అవసరాలు తీర్చేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని వ్యవసాయ రంగానికి కరెంటు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఇదివరకు విద్యుత్ వినియోగానికి, కోటా కేటాయింపులకు మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండేదని, ఫలితంగా కరెంటు కోతలు అనివార్యమయ్యేవని అన్నారు. ప్రస్తుతం వినియోగాన్ని బేరీజు వేస్తూ ఎన్‌పిడిసిఎల్ ఉమ్మడి జిల్లా అవసరానికి సరిపడా విద్యుత్‌ను కేటాయిస్తోందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేయి మెగావాట్ల వరకు ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందని, మార్చి, ఏప్రిల్ మాసాల్లో 1500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేలా సన్నద్ధమైనందున మునుముందు కూడా సేద్యపు రంగానికి కరెంటు సమస్య తలెత్తబోదని ఎస్‌ఇ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సేద్యానికి తొమ్మిది గంటలు నిరాటంకంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించడంతో వ్యవసాయ పంపుసెట్లనే నమ్ముకుని ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని రైతులు పెద్దఎత్తున పంటల సాగు చేపట్టారు. మెజార్టీ రైతులు వరి పంట సాగు వైపే మొగ్గు చూపారు. గతేడాది వరుస వర్షాభావం వల్ల రబీలో దాదాపుగా యాభై శాతానికి పైచిలుకు విస్తీర్ణంలో పంటలు సాగు చేయలేకపోయారు. భూగర్భ జలాలు అడుగంటిన దృష్ట్యా బోరుబావులు కలిగి ఉన్న రైతులు కూడా పంటలు పండించేందుకు సాగునీరు అందుబాటులో లేక మిన్నకుండిపోయారు. అందుకు భిన్నంగా ఈసారి ఆశించిన రీతిలో వర్షాలు కురిసి భూగర్భజలాలు గణనీయంగా వృద్ధి చెందడంతో వట్టిపోయిన బోరుబావులన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. దీంతో ప్రస్తుత రబీలో దాదాపు 2లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో లక్ష హెక్టార్ల వరకు వరి పంట సాగయ్యే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 85శాతం వరకు వరి నాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అత్యధికంగా 2.30లక్షల పైచిలుకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు మినహా చెప్పుకోదగ్గ రీతిలో ప్రధాన జలాశయాలేవీ లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు పూర్తిగా వ్యవసాయ పంపుసెట్లనే నమ్ముకుని సేద్యం సాగిస్తున్నారు. అధికారికంగానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 2.10లక్షల వరకు ఉండగా, అనధికారికంగా మరో 20వేల పైచిలుకు విద్యుత్ పంపుసెట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇలా పూర్తిగా బోరుబావులనే నమ్ముకుని ముందుకెళ్తున్న రైతులకు విద్యుత్ సరఫరా ఇప్పటివరకైతే పూర్తి ఉపశమనానే్న కల్పిస్తోందని చెప్పవచ్చు. సీజన్ ఆరంభ దశనే కొనసాగుతుండడం వల్ల ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు. మునుముందు మాత్రం సాగునీటి ఆవశ్యకత మరింతగా పెరుగనుండడంతో అందుకు అనుగుణంగానే త్రీఫేజ్ కరెంటు సరఫరా అందుతుందా? అని రైతులు ఒకింత సంశయానికి లోనవుతున్నారు. అయితే వచ్చే మరో రెండు మాసాల పాటు కూడా వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, రబీ పంటలు చేతికందే ఏప్రిల్ మాసం వరకు కూడా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా విద్యుత్‌ను అందిస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రభాకర్ భరోసా కల్పించారు.

తండ్రిని చంపిన కుమారుల అరెస్ట్
* డిఎస్పీ నర్సింహ
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13: ఆస్తికోసం కన్నతండ్రినే బండరాయితోకొట్టి, కాల్చి చంపి కడతేర్చిన కసాయి కుమారులను పట్టుకుని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ కొత్తపల్లినర్సింహ సోమవారం తెలిపారు. డిఎస్పీ కథనం ప్రకారం డివిజన్ పరిధిలోని లింగంపేట్ మండలం షెట్‌పల్లిగ్రామానికి చెందిన ముదం పోషయ్య (65)కు ముగ్గురు కుమారులు. ఈనెల 3వ తేదిన తన తండ్రి ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని, 8వ తేదీన కుమారులు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వారు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న లింగంపేట్ పోలీసులు, ఎల్లారెడ్డి సిఐ సుధాకర్ పూర్తిస్థాయిలోకేసును విచారణ చేయగా, ముగ్గురు కుమారులు చెప్పిన సమాధానం బట్టిచూస్తే కుమారులే హత్యచేసినట్లు అనుమానించి, వారిని విచారించగా అసలు నిజాన్ని చెప్పారు. పెద్దకుమారుడు ముదం సాయులు, నడిపి కుమారుడు ముదం ఆశయ్య తండ్రిని పొలం వద్ద కర్రతోనెత్తిన కొట్టి చంపి, షెట్పల్లి అడవిప్రాంతంలో సైకిల్‌పై తీసుకు వెళ్లి కిరోసిన్ పోసి కాల్చివేసినట్లు నిజం ఒప్పుకున్నారు. తన తండ్రికి 15 ఎకరాల ప్రభుత్వ పట్ట్భామి ఉందని, ఆ భూమిని ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చి వారి పేరున రిజస్ట్రేషన్ చేయకుండా, ఈభూమిపై క్రాప్‌లోన్‌లు తీసుకుంటున్నారని కుమారులు ఆరోపించారు. తండ్రిని చంపివేస్తేనే భూమి తమపేరున వస్తుందన్న దుర్బుద్దితో, ఫిబ్రవరి 3వ తేదిన పొలానికి కాపలాకు వెళ్లిన తండ్రిని అక్కడే కర్రలతోకొట్టి చంపి, షెట్‌పల్లిఅటవీప్రాంతంలోదాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో తీసుకు వెళ్లి కాల్చి వేసినట్లు నిజం ఒప్పుకున్నారు. ఈమేరకు నిందితులు ముదం సాయులు, ముదం ఆశయ్యలను సోమవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ వివరించారు. విలేఖరుల సమావేశంలో ఎల్లారెడ్డి సిఐ సుధాకర్, లింగంపేట్ ఎఎస్‌ఐ కుమార రాజ, కానిస్టేబుల్ రాంమోహన్ తదితరులు ఉన్నారు.

అక్రమ సంబంధమే విఆర్‌ఓ హత్యకు కారణం
బాన్సువాడ డిఎస్పీ నర్సింహారావు
బీర్కూర్, ఫిబ్రవరి 13: అక్రమ సంబంధమే విఆర్‌ఓ హత్యకు కారణమని బాన్సువాడ డిఎస్పీ ఎవిఆర్ నర్సింహారావు తెలిపారు. సోమవారం బీర్కూర్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చూపుతూ ఆయన వివరాలను వెల్లడించారు. బాల్గొండ మండలం సుబ్రియాల్ గ్రామానికి చెందిన రాములు గత యేడాదిన్నర క్రితం బీర్కూర్-2 విఆర్‌ఓగా విధుల్లో చేరారు. తిమ్మాపూర్ విఆర్‌ఎ సంగెం లత, బీర్కూర్ సహకార సంఘం పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్‌లు కలిసి రాములును హత్య చేశారన్నారు. భర్తను వదిలేసిన లతకు విఆర్‌ఓ రాములుతో చనువు ఏర్పడింది. అంతకంటే ముందు లతకు సయ్యద్ హుస్సేన్‌తో అక్రమం సంబంధం ఉందన్నారు. ఈనెల 8వ తేదీన లత ఇంట్లో హుస్సేన్ ఉన్న సమయంలో విఆర్‌ఓ రాములు అక్కడికి వచ్చాడు. లతకు హుస్సేన్‌కు ఉన్న సంబంధం బయట పడడంతో రాములు హుస్సేన్‌తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో లత, హుస్సేన్‌లు కలిసి రొట్టెల కర్ర, పట్టుకర్‌లతో రాములు తలపై బాది హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా రాములు మృతదేహాన్ని గడికింద గల్లీలోని ఓ పెంటకుప్పలో పడేశారు. హుస్సేన్ గ్రామం నుండి పారిపోగా లత తనకు ఏమి తెలియనట్లు ఉంది. పెంటకుప్పలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న పోలీసులు డ్వాగ్ స్వాడ్ రాణితో తనిఖీలు చేపట్టారు. పెంటకుప్ప నుండి డాగ్‌స్వాడ్ లత ఇంటికి వెళ్లగా అక్కడి పడి ఉన్న రక్తం మరుకలను పోలీసులు గుర్తించారు. దీంతో లతను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న హుస్సేన్‌ను సోమవారం పోతంగల్ బస్టాండ్ సమీపంలో పట్టుకొని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు హుస్సేన్, లతలపై హత్య కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం కోర్టులో నిందితులను హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రాజుభరత్‌రెడ్డి, ఎఎస్‌ఐలు మజీద్‌ఖాన్, విఠల్, సిబ్బంది ఉన్నారు.