నిజామాబాద్

హరహర మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాలన్నీ శుక్రవారం శివ నామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఎటుచూసినా ఆలయాల వద్ద బారులు తీరిన భక్తజనమే కనిపించారు. హరహర మహాదేవా శంభోశంకరా అంటూ భోళానాథుడిని స్తుతిస్తూ భక్తులు నిశిపూజలు, రుద్రహోమాలు జరిపించారు. రాత్రంతా జాగరణ చేసి శివరాత్రి పర్వదినం సందర్భంగా లయకారుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రాముఖ్యతనిచ్చారు. ప్రతిఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో అట్టహాసంగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండుమూడు రోజుల నుండే నగరంలోని అన్ని ప్రముఖ ఆలయాలను రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరించగా, శుక్రవారం సాయంత్రం నుండి అవి దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రజలను భక్తిపారవశ్యంలో ఒలలాడేలా చేశాయి. శివునికి ప్రీతికరమైన పత్రి, గోగుపూలను, పుష్పాలను సమకూర్చుకుని చిన్నా,పెద్దా, ఆడ, మగ అన్న తేడాలేకుండా భక్తులు ఆలయాలకేగి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధానంగా కంఠేశ్వర్ ప్రాంతంలోని నీలకంఠుని ఆలయంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తుల తాకిడి కనిపించింది. ఉదయం ఏడు గంటల సమయానికే భక్తుల క్యూ ఆలయం బయట దాదాపు అరకిలోమీటరు దూరం వరకు నిలిచిఉంది. భక్తుల సౌకర్యార్ధం ఆలయ నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేయగా, పలువురు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండే ఆలయ పూజారి సుభాష్ పంతులు నేతృత్వంలో స్వామి వారికి అభిషేకాలు ప్రారంభించారు. అర్ధరాత్రి లింగోద్భవ నిశిపూజకు ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రద్ధానంద్‌గంజ్‌లోని ఉమామహేశ్వరాలయం, అహ్మదీబజార్‌లోని శంభునిగుడి, నందిగుట్టలోని శివాలయాలను వేలాది సంఖ్యలో భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. నందిగుట్ట వద్ద రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల సందర్భంగా జాతర వెలసింది. దేవి థియేటర్ సమీపంలోని ఆలయం వద్ద కూడా భక్తులు బారులుతీరారు. శివరాత్రి పర్వదిన వేడుకల్లో అత్యంత ప్రాధాన్యమైనది జాగరణ పర్వమే అయినందున, భక్తులు జాగరణ చేసేందుకు వీలుగా ఆలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. వేదబ్రాహ్మణులు పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తూ శివరాత్రి పర్వదిన వేడుక ప్రాముఖ్యాన్ని భక్తులకు వివరించారు. అన్ని సినిమా థియేటర్లలో అర్ధరాత్రి అనంతరం ఆటలను శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి పెద్ద సంఖ్యలోనే భక్తులు తరలివెళ్లారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తే శుభం చేకూరుతుందని, తెలిసో తెలియకో చేసిన పాపాలకు నిష్కృతి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు బాసర పుణ్యక్షేత్రం సందర్శనానికి ప్రాముఖ్యతనిచ్చారు. ఇక వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరుని సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు వందలాది మంది తమ పిల్లాపాపలను వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లారు. భక్తుల సౌకర్యార్ధం నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా 70కి పైగా బస్సు సర్వీసులను వేములవాడకు నడిపించినప్పటికీ, విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పలేదు. పరిస్థితిని గమనించిన కొంతమంది ప్రైవేట్ వాహనాలను అద్దెకు మాట్లాడుకుని వేములవాడకు వెళ్లారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించి పూజాదికాల కోసం అవసరమైన పత్రి, గోగుపూలు వంటి వాటిని పరిసర గ్రామాల ప్రజలు నగరానికి తీసుకువచ్చి ఉదయం వేళలో ముఖ్య కూడళ్ల వద్ద విక్రయించారు. కాగా, ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 24: కాకతీయుల కాలంలో నిర్మించిన త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని తాండూర్ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున గల త్రిలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే తన సతీమణి మంజులరెడ్డితో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్రిలింగేశ్వర ఆలయానికి మంచి చరిత్ర ఉందని, ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, సంజీవులు, రాజుదాస్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆలయాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి ఉపవాస దీక్షలను భక్తులు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వేళలో వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.