నిజామాబాద్

జూన్ నాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పథకాన్ని విజయవంతం చేసి అర్హులైన నిరుపేదలకు లబ్ధి చేకూరుస్తామని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో మంత్రులు సమీక్ష జరిపారు. సంబంధిత శాఖల అధికారులతో పాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, హౌసింగ్ శాఖ చీఫ్ సెక్రటరీ చిత్రారాంచంద్రన్, కలెక్టర్ యోగితారాణా, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ పనులను త్వరితగతిన చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక, విద్యుత్ వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వచ్చే జూన్ నెలాఖరు నాటికి మొదటి విడత నిర్మాణాలను పూర్తి చేయాలని, మార్చి మాసం వరకు బేస్‌మెంట్ దశ దాటాల్సిందేనని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు రానివ్వబోమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భరోసా కల్పించారు. మొత్తం ఐదు విడతల్లో వారికి బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలు పూర్తి కాగానే 20శాతం, స్లాబ్ లెవల్‌కు చేరిన వెంటనే మరో 20శాతం, ఫినిషింగ్ పనులకు సంబంధించి 20శాతం, చివరి దశ పూర్తయిన వెంటనే మిగతా మొత్తం బిల్లులు అందజేస్తామని తెలిపారు. ఇలా ఒక్కో ఇంటి నిర్మాణానికి గాను 5.40 లక్షల రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని అన్నారు. అయితే అధికారులు నిర్ధారించిన స్థలాల్లోనే డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులను ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చినందున త్వరితగతిన వీటిని చేపట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాకు మొదటి విడతలో 4990 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే 80శాతం మేర ఆన్‌లైన్ టెండర్లు పూర్తయ్యాయని, మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయని అన్నారు. తొలివిడత నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, రెండవ విడత పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్ కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని అసంతృప్తిని వెళ్లగక్కారు. స్థల సేకరణతో పాటు ఇసుక కేటాయింపుల విషయమై కలెక్టర్ అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, అలాంటప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు ఎలా సాగుతాయన్నారు. అయితే తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల విషయంలో కొంత పట్టువిడుపు ధోరణిని అవలంభించాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడకుండా సమన్వయంతో పని చేయాలని, అయితే ఈ నెపంతో ఎవరైనా ఇసుకను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే బాధ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, జె.సి రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, డిఆర్‌ఓ పద్మాకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హామీకి కట్టుబడకపోతే ఆమరణ దీక్షకు
తెయు ఒప్పంద అధ్యాపకులు
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 25: కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి తమను పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో ఆమరణ దీక్షకు పూనుకుంటామని తెలంగాణ యూనివర్శిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వి.దత్తహరి పేర్కొన్నారు. తెయులో ఒప్పంద అధ్యాపకులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దత్తహరి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గడిచిన 12రోజుల నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన ఫలితంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి స్పందించి ఆదివారం చర్చలకు ఆహ్వానించారని అన్నారు. ఈ చర్చల్లో తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు. తాము గొంతెమ్మ కోర్కెలేవీ కోరడం లేదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమ సమస్యల పట్ల స్పందించని పక్షంలో సోమవారం నాటి నుండి ఏకంగా ఆమరణ దీక్షలు చేపడతామని అన్నారు. రిలే దీక్షలో కాంట్రాక్ట్ అధ్యాపకులు జి.రవి, శ్రీనివాస్, గోపిరాజ్, బిఆర్.నేత, గంగాకిషన్, నాగేశ్వర్‌రావు, శరత్, స్వామిరావు, జ్యోత్స్న, పద్మ, శే్వత, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పేదల పెన్నిధి సిఎం కెసిఆర్
ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, ఫిబ్రవరి 25: పేద ప్రజల సంక్షేమం కోసమే సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, పేదల పెన్నిధి అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సిఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దీంట్లో భాగంగా గొల్ల కుర్మల సంక్షేమం కోసం గొర్రెల యూనిట్లను సబ్సిడీపై అందించడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయన్నారు. అలాగే కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని 10 మంది రోగులు సిఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 3లక్షల 4వేల రూపాయల చెక్కులను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, మదుసుధన్‌రావు, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, గెరిగంటి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి
* ఎంపి బి.బి పాటిల్ హామీ
పిట్లం, ఫిబ్రవరి 25: హనుమాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ అన్నారు. శనివారం మండలంలోని ఎన్‌పల్లిలోని హనుమాన్ మందిరంలో నిర్వహించి శివరాత్రి ఉత్సవాలకు ఎంపి బి.బి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌పల్లిలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి, భక్తుల సౌకర్యార్థం అవసరమయ్యే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాజరాజేశ్వర ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు.

మఠం అభివృద్ధికి కృషి చేస్తా
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
పిట్లం, ఫిబ్రవరి 25: పిట్లం మఠం అభివృద్ధికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామంలో గల శ్రీమహాతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కల్యాణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురు మఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలని, ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. భక్తులు గురువుల ప్రవచనాలు విని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉపకారం చేయడానికి తగిన శక్తి లేని వారు అపకారం చేయకుండా ఉంటే చాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం భక్తులు డప్పు వాయిద్యాలతో పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, సర్పంచ్ నారాయణనాయక్, భక్తులు మల్లయ్యపటేల్, బస్వారాజ్‌దేశాయ్, సంగప్ప, సుధాకర్‌రెడ్డి, వీరేశం పటేల్, తదితరులు పాల్గొన్నారు.

టిఎన్జీఓల బైక్‌ర్యాలీ
కంఠేశ్వర్, ఫిబ్రవరి 25: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సిపిఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 2న పార్లమెంట్‌ను ముట్టడిస్తున్నందున, శనివారం నగరంలో టిఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2004లో నూతన పెన్షన్ విధానాన్ని తీసుకవచ్చిందని, దీని నిరసిస్తూ మార్చి 2వ తేదీన పార్లమెంట్‌ను ముట్టడిచేందుకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పెన్షన్లు ఇస్తారని, అసలు వీరికి ఏవిధంగా పెన్షన్లు ఇస్తారో చెప్పాలన్నారు. నూతన పెన్షన్ విధానం వల్ల టిఎన్జీఓస్ నష్టపోతారని ఆయన అన్నారు. అందుకే పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితిని 5లక్షలకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జీతాలకు సరిపడా నిధులు ఇవ్వాలన్నారు. ఈ బైక్ ర్యాలీ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి తిలక్‌రోడ్, బస్టాండ్, ఆర్‌పి రోడ్, గాంధీచౌక్, నెహ్రూపార్క్ మీదుగా టిఎన్జీఓల భవన్‌కు చేరుకుంది. ఈ ర్యాలీలో టిఎన్జీఓల ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

బాకీ డబ్బులు ఇవ్వలేదని ఇద్దరిపై రాళ్లతో దాడి
వినాయక్‌నగర్, ఫిబ్రవరి 25: నగరంలోని త్రీటౌన్ పరిధిలో నర్సింలు అనే వ్యక్తి అప్పుగా ఇచ్చిన 100రూపాయల ఇవ్వకపోవడంతో ఆగ్రహించి, అప్పు తీసుకున్న వ్యక్తిపై రాళ్లతో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. త్రీటౌన్ ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రైల్వే కమాన్ సమీపంలో నివాసం ఉండే నర్సింలు అనే వ్యక్తి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న లింగు నర్సింగ్ అనే వ్యక్తికి గత కొన్ని నెలల క్రితం 100రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. నెలలు గడుస్తున్నా నర్సింగ్ తీసుకున్న డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఇదే క్రమంలో శనివారం రైల్వే కమాన్ సమీపంలో నర్సింలుకు, నర్సింగ్ కనిపించడంతో డబ్బులు ఇవ్వాలని అడుగడం జరిగిందని, దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగిపోవడంతో నర్సింలు రాళ్లతో దాడి చేశాడని ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. ఈ దాడిలో నర్సింగ్‌తో పాటు అతని స్నేహితుడైన సుధాకర్‌కు కూడా గాయాలయ్యాయని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. సుధాకర్ అల్లుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

ఎడ్లబండ్ల ఊరేగింపు
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 25: మండలంలోని తాడూర్ గ్రామ శివారులోని త్రిలింగేశ్వర ఆలయం చుట్టు శనివారం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. స్థానిక ఎస్‌ఐ సీతారాములు ఎడ్లబండ్ల ఊరేగింపు సంఘటన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఊషమ్మసంజీవులు, తాండూ ర్ సర్పంచ్ రాజమణిరాజుదాస్, తహశీల్దార్ మంత్రునాయక్, ఎంపిడిఓ రమేశ్‌నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాల్గవ విడత నీరు విడుదల
నిజాంసాగర్, ఫిబ్రవరి 25: నిజాంసాగర్ ప్రాజెక్ట్ హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రంకు అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ గేట్ల ద్వారా నాల్గవ విడత నీరును విడుదల చేశావ

15 రోజుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు టెండర్లు పూర్తి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డి
ఆర్మూర్, ఫిబ్రవరి 25: రాబోయే 15 రోజుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో ఆయన ఎమ్మెల్యేతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర పనుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నందున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల టెండర్ల ప్రక్రియ కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమని అన్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారని అన్నారు. రాబోయే 15 రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇసుకను ఉచితంగా అందిస్తామని, సిమెంట్‌ను తక్కువ ధరకు సరఫరా చేస్తామని, కాంట్రాక్టర్ల ఇఎండి డిపాజిట్‌ను రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గించేందుకు యత్నిస్తున్నామని అన్నారు. తద్వారా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర సిఎం చంద్రబాబుకు తొత్తుగా మారిన తెలంగాణ టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. ఎసిబికి పట్టుబడినా రేవంత్‌రెడ్డి వైఖరి మారలేదన్నారు. తమిళనాడులో శశికళ ఏ విధంగా జైలుకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయిందో అలాగే తెలంగాణలో కూడా త్వరలో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని, ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను రేవంత్‌రెడ్డి కోల్పోతాడని అన్నారు. చంద్రబాబు వద్ద నుంచి డబ్బులను తెచ్చి ఖర్చు పెడుతూ రాజకీయాలను బ్రస్టు పట్టిస్తున్నాడని, ఒక నీతి, జ్ఞానం లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. బలహీనవర్గాల ఇళ్లను ఇతరులకు కేటాయించారని టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆరోపణలు చేయడం కాదని, నిరూపించాలని ఆయన రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. ఆరోపణలను నిరూపించకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు.
సిద్ధులగుట్ట అభివృద్ధికి కోటి ఇస్తా
ఆర్మూర్‌లోని పవిత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై దేవాలయాల నిర్మాణాలు, అభివృద్ధి పనులకు కోటి రూపాయలు మంజూరు చేస్తానని, ఇవి చాలకుంటే మరో 50 లక్షలు ఇస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంకల్పించినట్లుగా దేవాలయాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సిద్ధులగుట్టపై దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన టిడిపి నేత రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, మంత్రులను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పోతు నర్సయ్య, వైస్ ఎంపిపి ఇట్టెడి బాజన్న, జడ్పీటిసి సభ్యుడు సాందన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్‌సింగ్ బబ్లూ, తదితరులు పాల్గొన్నారు.

రబీలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, ఫిబ్రవరి 25: ప్రస్తుత రబీ సీజన్‌లో ఎక్కడా ఎకరం పంట కూడా ఎండిపోనివ్వకుండా ప్రతి గుంటకు సాగునీటిని సమకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా కల్పించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుత రబీలో 2.10లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. తద్వారా సుమారు వేయి కోట్ల రూపాయల విలువ చేసే పంట చేతికందనుందని అన్నారు. ఇలాంటి తరుణంలో రైతులు పంటలు నష్టపోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 9.103టిఎంసిల నీరు అందుబాటులో ఉందని, దీనిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ ఏ ఒక్క గుంట భూమిలోనూ పంటలు ఎండిపోకుండా చూస్తామన్నారు. రబీలో మొత్తం ఆరు విడతలుగా సాగునీటిని అందించాలని నిర్ణయించుకుని, ఇప్పటికే మూడు విడతలుగా సాగునీటి సరఫరా పూర్తయ్యిందని, ప్రస్తుతం నాల్గవ విడత నీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 నుండి మార్చి 7వ తేదీ వరకు 4వ విడత, తిరిగి మార్చి 14 నుండి 24వరకు ఐదవ విడతగా, చివరి తడి మార్చి 31 నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ రైతులకు అవసరమైన పక్షంలో 7వ విడతగా ఏప్రిల్ 10 నుండి 16వ తేదీ వరకు నీటిని అందిస్తామన్నారు. జిల్లాలో 82 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, వీటి కింద మరో 218 సబ్ డిస్ట్రిబ్యూటరీలు, ఇతర చిన్నవి కలుపుకుని మొత్తం 700 వరకు ఉన్నాయని తెలిపారు. నీటిని విడుదల చేసే సమయంలో ఎక్కడ కూడా దారి మళ్లించకుండా, వృధా కాకుండా చివరి ఆయకట్టు వరకు చేరేందుకు గాను డిస్ట్రిబ్యూటరీల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీకి పగలు ఒక విఆర్‌ఓ, రాత్రి సమయంలో ఒక విఆర్‌ఓ నిఘాను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. సబ్ డిస్ట్రిబ్యూటరీల వద్ద విఆర్‌ఓలను ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ సిబ్బందితో కలిసి సమన్వయంతో నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. తాను కూడా స్వయంగా డిస్ట్రిబ్యూటరీల వెంట తిరుగుతూ నీటి సరఫరాను పరిశీలిస్తానని మంత్రి పోచారం పేర్కొన్నారు. ఈ విషయంలో తహశీల్దార్లు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిస్ట్రిబ్యూటరీల వద్ద విధులు అప్పగించిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లను తనకు అందించాలని అధికారులకు సూచించారు. ప్రతి విడతలోనూ 1700 క్యూసెక్కుల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నీరు వృధా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ కింద రైతుల నుండి 200 రూపాయల చొప్పున నీటి తీరువా వసూలు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలకు అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలన్నారు. కాగా, మిషన్ కాకతీయ మూడవ విడతలో జిల్లాలోని 270 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి పోచారం తెలిపారు. సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్ యోగితారాణా, సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్, జె.సి రవీందర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, డిఆర్‌ఓ పద్మాకర్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.