నిజామాబాద్

ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియెట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా ఇంటర్ అధికారి డి.ఒడ్డెన్న, డిఇఓ రాజేష్, ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమై పరీక్షల కోసం చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పరీక్షా కేంద్రంలోనూ విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వేసవి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉన్నందున తప్పనిసరిగా తాగునీటి వసతి ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్సకు అవసరమైన చర్యలు చేపడుతూ మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగించాలని, కరెంటు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. వెలుతురు సక్రమంగా లేని పరీక్షా గదులను గుర్తించి విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయించాలని సూచించారు. ఆర్టీసీ అధికారులను సంప్రదించి పరీక్షా వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులను నడిపించేలా ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరపాలని, తద్వారా విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చొరవ చూపాలన్నారు. కాగా, ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా బాధ్యులను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్చి 1 నుండి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. అయితే 9వ తేదీన జరగాల్సిన పరీక్ష 19వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్ పరీక్షలకు 39,295 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకానున్నారని, వీరి కోసం 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా, కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు హాల్ టిక్కెట్లు ఇవ్వబోమంటూ విద్యార్థులకు షరతులు విధిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ రీతిలో వ్యవహరించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఐఓ ఒడ్డెన్నను ఆదేశించారు. విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో సంబంధిత ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారని, ఈ విషయమై విద్యార్థులకు తెలియజేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు అందించనప్పటికీ, విద్యార్థులు నేరుగా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు రాయవచ్చని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుండి 30వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 24,461 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 132 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఇంటర్‌తో పాటు ఎస్సెస్సీ పరీక్షల్లోనూ చూచిరాత, మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణం నడుమ, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ సజావుగా పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రజా సంక్షేమంపై చర్చించకపోవడం సిగ్గుచేటు
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల

ఇందూర్, ఫిబ్రవరి 27: ఇటీవల ప్రగతి భవన్ సమావేశంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంక్షేమం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించకపోవడం సిగ్గుచేటని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మంత్రుల సమక్షంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై చర్చించకుండా, అనుచరుల వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంపైనే దృష్టి సారించడం శోచనీయమన్నారు. నవీపేట, మాక్లూర్ మండలాల్లో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయా వాగుల నుండి అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కొరఢా ఝుళిపిస్తే, పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీ నాయకుల అండదండలతోనే మాక్లూర్, నవీపేట, రెంజల్ మండలాల్లో అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. అక్రమ ఇసుక రవాణా వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి, రైతుల బోరుబావుల్లో నీటిమట్టం తగ్గడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ, రైతులకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, వారి గురించి సమావేశంలో చర్చించకపోవడం సరికాదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 116కోట్ల రూపాయలు విడుదల చేయగా, అందులో 75కోట్లు రైతులకు సంబంధించిన ఇన్‌ఫుట్ సబ్సిడీ డబ్బులు ఉన్నాయని అన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నుండి రైతుల ఖాతాల్లోకి నయాపైసా జమ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మరోవైపు బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్‌పై ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని తెరిపించి రైతులను, కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రెంజల్ మండలం తాడ్‌బిలోలి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లలో సుమారు 25లక్షల రూపాయల విలువ చేసే కాపర్ వైర్లు చోరీకి గురైనా, ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇక బోధన్ నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యుడి అండదండలతో దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. రెంజల్ తహశీల్ కార్యాలయాన్ని ఆనుకుని రెవెన్యూ శాఖకు సంబంధించిన స్థలంలో దర్గా నిర్మాణం చేపడుతున్నా, అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా, రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని యెండల లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా, రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి గుగులోత్ సుగుణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు న్యావనంది గోపాల్, మండల అధ్యక్షుడు బొడిగెల అంజాగౌడ్, బిజెవైఎం నాయకుడు సతీష్‌గౌడ్, ఎబివిపి నాయకుడు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.