నిజామాబాద్

అధికార పార్టీ నేతలకు మింగుడు పడని కలెక్టర్ వైఖరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 2: జిల్లా యంత్రాంగం పనితీరును గాడిలో పెడుతూ, పాలనా వ్యవహారాల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వ్యవహారశైలి అధికార పార్టీ నేతలకు ఎంతమాత్రం మింగుడుపడడం లేదని తెలిసింది. తమ సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ నిక్కచ్చిగా తేల్చి చెబుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కీలక సమావేశాలను అవకాశంగా మల్చుకుని కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ముప్పేట దాడికి దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. జిల్లా కలెక్టర్‌గా యోగితారాణా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. అయితే మొదటి నుండి కూడా ఆమె వైఖరి పట్ల అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యేలు సందర్భం వచ్చిన ప్రతిసారి అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఇదివరకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులందరి సమక్షంలోనే జడ్పీ చైర్మన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ తమ అక్కసును వెళ్లగక్కారు. పనులు పక్కాగా, నాణ్యతతో చేపట్టేందుకు వీలుగా థర్డ్ పార్టీ తనిఖీలు జరిపించాలనే కలెక్టర్ నిర్ణయాన్ని జడ్పీ సమావేశం వేదికగా ఆక్షేపిస్తూ, ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి చేశారు. తమ నియోజకవర్గ నిధులతో చేపట్టే పనులపై మీ పెత్తనం ఏమిటంటూ బాహాటంగానే ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. అయితే పనులు నాణ్యతతో, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నదే తన అభిమతమని కలెక్టర్ తేల్చి చెప్పారు. అప్పట్లోనే ఈ వివాదానికి సంబంధించిన పంచాయతీ సిఎం పేషీ వరకు వెళ్లగా, సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్‌తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచించినట్టు తెలిసింది. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదని తాజాగా డబుల్ బెడ్‌రూమ్‌లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మరోమారు తేటతెల్లమైంది. ఇటీవలే మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు రెండు పడక గదుల నిర్మాణ పథకంపై ప్రగతిభవన్‌లో సమీక్ష జరుపగా, సమావేశంలో పాల్గొన్న బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, జీవన్‌రెడ్డిలు కలెక్టర్ యోగితారాణా వైఖరిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇసుక రవాణాపై అనేక ఆంక్షలు విధిస్తున్నారని, ఫలితంగా అభివృద్ధి పనులు ముందుకు సాగలేకపోతున్నాయని, దీనికి క్షేత్ర స్థాయి అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ వారిని సస్పెండ్ చేస్తున్నారని, ఇలా అయితే డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణాలు చేపట్టడం కూడా ఎలా సాధ్యమవుతుందంటూ కలెక్టర్ తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వ పనులు కొనసాగాలంటే నిబంధనల విషయంలో కొంత పట్టువిడుపు ధోరణిని కనబర్చాలంటూ కలెక్టర్‌కు సైతం సూచించారు. ఇదిలాఉండగా, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కలెక్టర్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నట్టు అనుచర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్నీ నిబంధనల ప్రకారమే జరగాలనే కలెక్టర్ వాదనతో విభేదిస్తూ ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి మంత్రి పోచారం కూడా తన ప్రధాన అనుచరుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అయితే మంత్రి హోదాలో ఉండి తాను కూడా కలెక్టర్ తీరుపై బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కడం బాగుండదనే భావనతో సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. నిజానికి జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కలెక్టర్ యోగితారాణా ఎక్కడ కూడా రాజీకి తావులేకుండా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఆయా శాఖల పనితీరును క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హరితహారం, ఉపాధి హామీ, విద్య, వైద్యారోగ్య శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు సైతం వేశారు. చివరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులను సైతం నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామం కాస్తా అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారుతోంది. ప్రత్యేకించి కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో కలెక్టర్ కఠిన వైఖరిని కనబరుస్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులను పక్కనపెట్టి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తుండడం మింగుడుపడడం లేదు.

స్టాండింగ్ కమిటీ ఎన్నికలు లాంఛనమే
కంఠేశ్వర్, మార్చి 2: నిజామాబాద్ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు గురువారం చివరి రోజు కావడంతో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు నామినేషన్‌లు దాఖలు చేశారు. 3వ డివిజన్ కార్పొరేటర్ గోపరి సుగుణ, 41వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ శ్రీవాణి, 6వ డివిజన్ కార్పొరేటర్ పురుషోత్తం, 21వ డివిజన్ కార్పొరేటర్ ఖుద్దూస్‌లు నామినేషన్‌లు వేశారు. వీరితో పాటు ఎంఐఎంకు చెందిన మరో కార్పొరేటర్ పర్వేజ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉండగా, అంతే మొత్తంలో ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక లాంఛనప్రాయంగా మారనుంది. నామినేషన్లను అధికారులు గురువారం సాయంత్రం స్క్రుటినీ చేశారు. అనంతరం స్టాండింగ్ కమిటీ చైర్మెన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనున్నారు. ఈ పదవులను ఆశిస్తూ అనేక మంది కార్పొరేటర్లు ఆసక్తి కనబర్చినప్పటికీ, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పోటీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఐదుగురు కార్పొరేటర్లతోనే నామినేషన్లు వేయించినట్టు తెలిసింది. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, పది డివిజన్లకు ఒకటి చొప్పున జోన్లను విభజించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మెన్లుగా ఎన్నికవుతున్న వారు తమతమ జోన్ చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా కార్పొరేటర్ల వెంట మేయర్ ఆకుల సుజాత, విశాలినిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే ధ్యేయం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, మార్చి 2: కామారెడ్డి జిల్లాలో 4వేల కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే ధ్యేయంగా నియోజక వర్గానికి ఓ మండలాన్ని ఎంపిక చేసి పైప్‌లైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన స్వగృహంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, సర్పంచ్‌లతో తాగునీటి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగూరు నుంచి వేస్తున్న పైప్‌లైన్‌తో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి వేస్తున్న పైప్‌లైన్‌తో బాల్గొండ, ఆర్మూర్, నిజామమాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు తాగునీటిని అందిస్తామని, మొత్తం 1645 గ్రామాలకు నీరు అందుతుందన్నారు. నల్లా కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని, ప్రజలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ పంచాయతీలో డిపాజిటల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్‌లలో పైప్‌లైన్ల కోసం 26కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. 3 మండలాల్లో 57 ఓహెచ్‌ఆర్‌ఎస్, 129 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలోనే మొదటిసారిగా బాన్సువాడ పట్టణంలో పైప్‌లైన్లు వేసి నల్లాకనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ వెంకటేశ్వర్లు, ఎఎంసి చైర్మన్ సురేశ్, నాయకులు మహ్మాద్ ఎజాస్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, గంగాధర్, అలీముద్దీన్‌బాబా, ముబీద్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.