నిజామాబాద్

చిత్తశుద్ధితో పనిచేస్తేనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 2:క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధిగా పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని జిల్లా కలెక్టర్ యోగితారాణా అన్నారు. గురువారం బోధన్ పట్టణంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఎన్‌ఆర్ ఇజిఎస్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఐకెపి సంఘాల పనితీరు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలన్న విషయాన్ని ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగులు పేద ప్రజలకు సేవ చేసేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని అప్పుడే సర్కారు లక్ష్యం, ప్రభుత్వ పథకాలు సత్ఫలితాన్నిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు. గ్రామాలలో ఉపాధి హామీ కూలీల సంఖ్యను మరింత పెంచాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో మహిళా సంఘాల సభ్యులు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అటువంటి వారిని గుర్తించి వారికి ఉపాధి పనులలో అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయాన్ని గ్రామాలలోని మహిళా సంఘాల సభ్యులకు తెలియచేయాలని సూచించారు. పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, అలాగే కూలీలకు ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వేతనాలు కూడా భారీగా పెంచిందని ఈ విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకుని చిత్తశుద్ధిగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. డివిజన్‌లోని అన్ని గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు కూడా తనిఖీలు చేస్తూ పురోగతి సాధించాలని సూచించారు. వీటి నిర్మాణాలపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలన్నారు. ఐకెపి సిబ్బంది సైతం మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల గురించి మహిళా సంఘాలకు తెలియచేసి వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బోధన్ సబ్‌కలెక్టర్ సిక్ధా పట్నాయక్, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, బోధన్ డివిజన్‌లోని అన్ని మండలాల ఎంపిడివోలు, తహశీల్దార్‌లు, ఇవోపిఆర్‌డిలు, గ్రామ మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధి హామీ, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు కృషి
నేర సమీక్షలో సిపి కార్తికేయ సూచన
వినాయక్‌నగర్, మార్చి 2: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని కమిషనర్ కార్తికేయ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో ఆయన నేరాల నియంత్రణపై ఆయా డివిజన్ల పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిపి కార్తికేయ మాట్లాడుతూ, ప్రజావాణి ఫిర్యాదుల పట్ల త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా క్రమశిక్షణ, నిజాయితీతో వ్యవహరిస్తూ ప్రజలకు చేరువ కావాలని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత ఘర్షణలు చెలరేగకుండా, కేసుల దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రత్యేకించి జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అలవర్చుకుని శాఖ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. దొంగతనాలను నివారించేందుకు రాత్రి వేళల్లో అన్ని పిఎస్‌ల పరిధిలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన కోసం గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎసిపిలు ఆర్.వెంకటేశ్వర్లు, కె.మోహన్, జి.రవీందర్, సయ్యద్ అన్వర్‌హుస్సేన్, ఎస్‌బి సిఐ వెంకన్న, ఆర్‌ఐ మల్లికార్జున్‌తో పాటు అన్ని డివిజన్లకు చెందిన సిఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.