నిజామాబాద్

ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 7: ప్రభుత్వ ప్రాధమ్యాల అమలుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ-షీ టీమ్ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో జిల్లాను ముందంజలో నిలిపి అవార్డును దక్కించుకోవడమే కాకుండా, హరితహారం అమలులోనూ ఇందూరును అగ్రస్థానంలో నిలిపి ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రశంసలు దక్కించుకున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాజకీయ పైరవీలను సైతం పక్కనబెడుతూ నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న క్రమంలో వస్తున్న ఒత్తిళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ, పరిపూర్ణ ఆత్మస్థైర్యం కలిగిన జిల్లా పాలనాధికారిణిగా ప్రశంసలు పొందుతున్న కలెక్టర్ యోగితారాణా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రభూమి’తో ప్రత్యేకంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు అందించే సందేశం?
కలెక్టర్: ముందుగా జిల్లా యంత్రాంగం తరఫున అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఏడాదిలో కేవలం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడంతోనే సరిపెట్టుకోకుండా, కుటుంబ నిర్వహణ కోసం ఎంతో నిబద్ధత, నిస్వార్థంగా అహరహం శ్రమించే మహిళల కృషిని గురిస్తూ అనునిత్యం వారికి తగిన గౌరవం, ప్రోత్సాహం అందించినప్పుడే మహిళా సాధికారతకు సరైన సార్థకత చేకూరుతుందన్నది నా అభిప్రాయం. ఇంట్లో అందరికంటే ముందు నిద్రలేచి ఎంతో బాధ్యతగా, సహనంతో పనులన్నీ చక్కబెట్టి అందరికంటే ఆలస్యంగా నిద్రపోయేది మహిళేననే విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబ నిర్వహణలో ఓ తల్లిగా, భార్యగా, అక్క, చెల్లి, కూతురుగా మహిళ పోషించే పాత్రను మరెవరితోనూ పోల్చలేము. తన ఇల్లు, కుటుంబం కోసం ఎంతైనా శ్రమిస్తూ ఒకే వ్యక్తి ఏకకాలంలో అనేక బహుముఖ బాధ్యతలు నిర్వర్తించే ప్రజ్ఞ మహిళకే సొంతం. దీనిని గుర్తిస్తూ ప్రతిఒక్కరూ మహిళలకు తగిన గుర్తింపు, గౌరవం అందించాల్సిన అవసరం ఉంటుంది.
ప్ర. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు?
కలెక్టర్: ఇదివరకటితో పోలిస్తే పరిస్థితులు కొంతవరకు మారినప్పటికీ, ఇంకనూ మహిళల పట్ల సమాజంలో పరిపూర్ణమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు బాలికల పట్ల ఒకింత వివక్షత కనబరుస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అబ్బాయిలతో సమానంగా, అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా వారికి నాణ్యమైన చదువు చెప్పిస్తే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబనతో ముందుకు సాగుతారు. దీనివల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి తాము స్వశక్తిపై ఆధారపడి ఉన్నామనే ధైర్యంతో సమాజం నుండి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనగల్గుతారు. ప్రతి ఒక్కరి ఇంటి నుండే ఈ మార్పు ప్రారంభమవుతూ, బాలికలకు ఇతోధికంగా తోడ్పాటు, ప్రోత్సాహం అందించాలి.
ప్రశ్న. మహిళలు వివక్షతను ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారా?
కలెక్టర్: కొన్ని అంశాల పరంగా చూస్తే బాలికలు, మహిళల పట్ల వివక్షత కొనసాగుతోందనే అనుకోవాలి. మగ పిల్లలకు కానె్వంట్ స్కూళ్లలో చేర్పిస్తూ, బాలికలకు సాధారణ బడుల్లో చేర్పించడం, వారు యుక్త వయస్సుకు చేరుకునే సమయానికి చదువు మాన్పించి వంటింటికే పరిమితం చేయడం, ఆస్తి పంపకాల్లో సమాన వాటా ఇవ్వకపోవడం, విడాకులు పొందిన మహిళలు మళ్లీ పెళ్లీ చేసుకుంటే సమాజపు ఆంక్షలు వంటివి వివక్షతను చూపిస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ వంటి రుగ్మతలకు బాలికలు, యువతులే గురవుతున్నారు. చివరకు సమాన పనికి సమాన వేతనం విషయంలోనూ మహిళలకు అన్యాయమే జరుగుతుండడం వివక్షతకు అద్దం పడుతోంది. ఈ తరహా వైఖరిలో పూర్తిగా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్ర. ఎలాంటి అంశాలు మహిళల తోడ్పాటుకు దోహదపడతాయి?
కలెక్టర్: ప్రధానంగా వారిని విద్య పరంగా ప్రోత్సహించాలి. సమాజం మహిళలకు తగిన గౌరవం గుర్తింపును ఇస్తే అద్భుతాలు చేసే శక్తి వారిలో ఉంది. ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి పతకాలు సాధించి పెట్టింది మహిళలే కావడం ఈ విషయాన్ని చాటుతోంది. విద్య, వివాహం, ఉద్యోగం, సంతానం కనడం వంటి విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మహిళలకు కల్పించాలే తప్ప, తమ అభిప్రాయాలు, నిర్ణయాలను వారిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. మగవారితో పోలిస్తే ఆడపిల్లలకే తమ తల్లిదండ్రులు, కుటుంబం పట్ల ఆపేక్ష ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తల్లిదండ్రులు వార్ధాక్యంలో చేరుకున్న సమయంలో వారి బాగోగుల గురించి ఎక్కువగా పట్టించుకునేది కుమార్తెలేనని, ఈ విషయం ఆడపిల్లలు ఉన్న వారందరికీ అనుభవంలోకి వచ్చేదేనని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమాజపు కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరుతో బాలికల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, వారి పట్ల అనవసర ఆంక్షలను ప్రదర్శించకూడదు.
ప్ర. మహిళా దినోత్సవం నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు ఏమిటి?
కలెక్టర్: ఈసారి ప్రత్యేకంగా బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలనే లక్ష్యంతో ‘బీ బోల్డ్ ఫర్ ది చేంజ్’ అనే నినాదంతో కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించాం. మహిళల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి వారికి తెలియజేసేందుకు 2కె రన్ పేరుతో అవగాహన ర్యాలీ నిర్వహించాం. మహిళా దినోత్సవ కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా రూపొందించాం. వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ రాణించాలి. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ ఆకుల సుజాత, ఇతర అనేక మంది ఎంపిపిలు, జడ్పీటిసిలు, మహిళలుగా తమవంతు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని సామాజికంగా, రాజకీయంగా మహిళలు చైతన్యవంతులు కావాలి.
ప్ర. చివరగా ఓ మహిళా పాలనాధికారిణిగా మహిళల కోసం ప్రత్యేకంగా చేస్తున్న కృషి ఏమిటి?
కలెక్టర్: ఓ వైపు ప్రభుత్వ ప్రాధమ్యాల అమలుకు కృషి చేస్తూనే, మహిళల కోసం ఒకింత అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రతి గర్భిణి సుఖ ప్రసవాలు చేసుకునేలా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ఈ దిశగా చేపడుతున్న చర్యలకు ఆశించిన రీతిలో ఫలితాలు వస్తున్నాయి. 18 నుండి 45సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపిస్తూ, అవసరమైన వారికి వైద్య చికిత్సలు చేయిస్తున్నాము. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో సఖీ-షీ టీంలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం.

సఖీ - షీ టీమ్‌ల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఇన్‌చార్జి డిఐజి అకున్ సబర్వాల్
ఇందూర్, మార్చి 7: గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్నచిన్న గొడవలతో పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టు తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న వారి సమస్యలను పరిష్కంచేందుకు ఏర్పాటు చేసిన సఖీ- షీ టీమ్‌ల సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రేంజ్ ఇన్‌చార్జి డిఐజి అకున్ సబర్వాల్ సూచించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారి కార్యాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌చార్జి డిఐజి మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, గృహహింస తదితర వాటిని నిరోధించేందుకు సిఎం కెసిఆర్ సఖీ- షీ టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ఇవి పట్టణ కేంద్రాలకే పరిమితం అయ్యేవని, ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసి, గ్రామాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో భార్యభర్తల గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే సమస్యలను సఖీ- షీ బృందం దృష్టికి తీసుకవస్తే అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఒకవేళా గ్రామ స్థాయిలో పరిష్కారం కాకపోతే మండలం, అక్కడ కూడా కాకపోతే జిల్లా స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమస్యల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఈ సఖీ- షీ బృందాలు కృషి చేస్తాయని అన్నారు. జిల్లాలో సఖీ- షీ బృందాలను కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అనంతరం కుర్నాపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుడు రఫత్ అనే విద్యార్థికి ఎడపల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమకూర్చిన 5వేల రూపాయల నగదు బహుమతిని ఇన్‌చార్జి డిఐజి చేతుల మీదుగా అందజేశారు. హరితహారంలో భాగంగా ఇన్‌చార్జి డిఐజి కుర్నాపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోశారు. అంతకు ముందు కుర్నాపల్లి గ్రామంలో పోలీసు శాఖ తరఫున చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను డిఐజి అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ, ఎసిపి వెంకటేశ్వర్లు, సర్పంచ్ దుబ్బాక సావిత్రి రవీందర్‌గౌడ్, ఎంపిటిసి పరిగె అనిత సాయిలు, ఎంపిపి రజిత, ఎడపల్లి, రెంజల్ మండలాల ఎస్‌ఐలు ఆసీఫ్, రవికుమార్‌తో పాటు గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.