నిజామాబాద్

బిసిల జీవన స్థితిగతులపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మార్చి 10: వెనుకబడిన తరగతులకు చెందిన వారి జీవన స్థితిగతులను సమగ్ర పరిశీలన జరిపి, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బిసి కమిషన్ చైర్మన్ బిఎస్.రాములు పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీ కాలనీల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. దారిద్య్ర రేఖకు దిగువన జీవనాలు వెళ్లదీస్తున్న మురికి వాడలను సైతం సందర్శించి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, వారి జీవన ప్రమాణాలను నేరుగా పరిశీలన జరిపారు. ముందుగా నిజాంకాలనీని సందర్శించి స్థానిక ముస్లిం మైనార్టీలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో ప్రభుత్వ పాఠశాల లేదని, పక్కా గృహాలు, ఉపాధి అవకాశాలు లేవని, వానాకాలంలో చిన్నపాటి వర్షం కురిస్తే మోకాలి లోతు వరకు వర్షపు జలాలు ఇళ్లలోకి చొచ్చుకు వస్తాయని స్థానికులు ఆవేదన వెలిబుచ్చారు. కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం, ఉర్దూ ప్రైమరీ పాఠశాలలను చైర్మన్ సందర్శించారు. అక్కడి నుండి పెయింటర్స్ కాలనీ, వెంగళ్‌రావునగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈద్గా వల్ల తోపుడు బండ్లపై పండ్లు విక్రయిస్తున్న వారిని, చాయ్ హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహకులను కలిసి వారికి రోజువారీగా ఎంత ఆదాయం సమకూరుతోంది, ఎంతమంది పిల్లలు, వారు ఏం చదువుతున్నారు, కుటుంబంలో ఎంతమంది సంపాదనపరులు ఉన్నారు, సొంత ఇల్లు ఉందా లేక అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? తదితర వివరాలను చైర్మెన్ ఆరా తీశారు. ఫులాంగ్ ప్రాంతంలోనూ పర్యటించి మహిళలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద బిసి సంఘాలకు చెందిన ప్రతినిధుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములు మాట్లాడుతూ, సామాజికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీ వర్గానికి 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుధీర్ కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో, బిసి కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ముస్లిం మైనార్టీల జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇదివరకు బిసి కేటగిరిలో ఎ,బి,సి,డి గ్రూపులు మాత్రమే ఉండేవని, బిసి(ఇ) గ్రూపులో నాలుగు శాతం రిజర్వేషన్ మాత్రమే అమలు చేసేవారని చెప్పారు. అయితే సామాజికంగా చాలా వెనుకబడి ఉన్న ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందేందుకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సుధీర్ కమిటీ ప్రభుత్వానికి సూచించిందన్నారు. తాము కూడా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ముస్లిం మైనార్టీల ఎదుగుదలకు ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ముస్లిం మైనార్టీలు నివసిస్తున్న చాలా కాలనీల్లో వౌలిక సదుపాయాల లేమి, ఉపాధి లేకపోవడం గమనించామని, పాఠశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. తాము గమనించిన అన్ని అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరుతూ డిప్యూటీ మేయర్ ఫహీం, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమేర్‌అహ్మద్ తదితరులు వినతిపత్రాలు అందజేశారు. ఇదిలాఉండగా, ముదిరాజ్‌లను బిసి(ఎ) కేటగిరీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బిసి(ఎ) జెఎసి ప్రతినిధులు నిరసన చాటారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద బిసి కమిషన్ గో బ్యాక్ అని రాసి ఉన్న టీ షర్టులను ధరించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. చివరకు జెఎసి ప్రతినిధులను మాత్రమే అనుమతించడంతో వారు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చైర్మన్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ వినోద్‌కుమార్, తహశీల్దార్ సుదర్శన్, మైనార్టీ, బిసి సంక్షేమ శాఖల అధికారులు కిషన్, విమలాదేవి తదితరులు ఉన్నారు.

సెప్టిక్‌ట్యాంకులో పడి బాలుడు మృతి
బిచ్కుంద, మార్చి 10: ట్యాంక్‌లో పడి నాల్గు ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన భార్యభర్తలైన శంకర్, లక్ష్మీలు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వీరు ఉదయం కూలీ నిమిత్తం తమ చిన్నారి కుమారుడు బాలకృష్ణ(4)ను ఇంటివద్ద వదిలేసి వెళ్లారు. సాయంత్రం వచ్చి ఇంట్లో తమ పిల్లవాడు కన్పించకపోయే సరికి పక్కన కొత్తగా నిర్మాణం అవుతున్న ఇంటి వద్ద అడుకుంటూ ఉండవచ్చని అక్కడికి వెళ్లి చూడగా, సెప్టిక్ ట్యాంకులో బాలకృష్ణ మృతదేహం తేలి ఉందని తెలిపారు. ఆట ఆడుకుంటూ వెళ్లి ఓపేన్‌గా 10్ఫట్ల లోతుతో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముందు
మున్సిపల్ కార్మికుల ధర్నా
కంఠేశ్వర్, మార్చి 10: నిజామాబాద్ నగర పాలక సంస్థలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, 2015 జూలై, ఆగస్టు మాసాల్లో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ 40రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందన్నారు. ఆ సమయంలో సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో కార్మికులు సమ్మెను విరమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సమ్మె విరమించి సంవత్సరంన్నర కాలం గడిచిన వేతనాలతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించారే తప్ప, వెనుకబడిన తరగతులు పని చేసే మున్సిపల్ రంగంలోని కార్మికులకు మాత్రం వేతనాలు పెంచలేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అందరికి హెల్త్‌కార్డులు ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, పనిముట్లు, చెప్పులు, మాస్క్‌లు ఇవ్వాలన్నారు. బయోమెట్రిక్ తీసుకవచ్చిన అధికారుల మధ్య సమన్వయం కుదరక గత 2నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. పెండింగ్ వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ కట్టాల్సిన డబ్బులు కట్టి, కార్మికులకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇటీవల మున్సిపల్‌లో వెంకటేశ్వర ఎజెన్సీ ద్వారా తీసుకున్న కార్మికుల నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్, యూనియన్ అధ్యక్షుడు భూపతి, నర్సయ్య, చంద్రసింహ, రమేష్‌బాబుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.