నిజామాబాద్

ఆరున్నర దశాబ్దాల కలకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 24: సుదీర్ఘ విరామానికి నేటితో తెరపడనుంది. పెద్దపల్లి - నిజామాబాద్ మార్గంలో రైల్వేలైన్ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో మోర్తాడ్ రైల్వే స్టేషన్‌కు శనివారం మరో రైలు రానుండటంతో స్థానికులు, నాయకులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరున్నర దశాబ్దాల కాలంలో పూర్తయిన పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌పై పూర్తి స్థాయి రైలును శనివారం కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు సికిందరాబాద్‌లో రిమోట్ సిస్టమ్ ద్వారా ప్రారంభించనున్నారు. నిజాం పాలన సమయంలో సర్వేకు నోచుకున్న పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైన్ నిర్మాణం పనులు సుదీర్ఘకాలం కొనసాగుతూనే వచ్చాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలుపుతూ, లింకేజీ రైలు మార్గంలా నిర్ణయించిన ఈ మార్గం పూర్తి చేయడానికి మొదటి నుండి కూడా నిధుల కేటాయింపులు అరకొరగానే ఉంటూ వచ్చాయి. 1994లో అప్పటి ప్రధానమంత్రి పివి నర్సింహారావు పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైన్ పనులకు శంకుస్థాపన చేశారు. నాటి నుండి నేటి వరకు బడ్జెట్‌లో అత్తెసరు నిధుల కేటాయింపుల కారణంగా పనులు నత్తనడకన నడుస్తూ వచ్చాయి. 177 కిలోమీటర్ల నిడివి కలిగి ఉన్న ఈ రైలు మార్గం నిర్మాణం కరీంనగర్ వరకు పూర్తికాగా, 2001లో తొలి రైలు ఈ మార్గంలో పరుగులు పెట్టింది. ఆ తరువాత 2007కల్లా జగిత్యాల వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తికావడంతో ఆ రైలును జగిత్యాలకు పొడిగించారు. అక్కడి నుండి రైలు మోర్తాడ్ వరకు రావడానికి దాదాపు దశాబ్దకాలం పట్టిందంటే ఈ మార్గంలో నిర్మాణం పనులు ఎంత నత్తనడకన కొనసాగాయో స్పష్టమవుతుంది. భూసేకరణలో ప్రతిబంధకాలు, సరిపడా నిధుల కేటాయింపులు లేకపోవడం తదితర కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయింపులు జరగడంతో పనుల వేగం పుంజుకున్నాయి. ఇటీవలే పనులు పూర్తి కావడంతో ఎట్టకేలకు డిసెంబర్‌లో జగిత్యాల-మోర్తాడ్‌ల మధ్యన పూర్తిస్థాయి పుష్‌పుల్ రైలును ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా బడ్జెట్‌లో భారీగా నిధులు రాబట్టడంతో ఆర్మూర్ - నిజామాబాద్‌ల మధ్య మిగిలిన 23కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆరున్నర దశాబ్దాల తరువాత పెద్దపల్లి - నిజామాబాద్ రైలు నిర్మాణం పనులకు పరిపూర్ణత చేకూరి ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమైంది.
నేడు రైలు సర్వీసు ప్రారంభం
పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడంతో ఈ మార్గంలో పూర్తిస్థాయి రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రిమోట్ సిస్టమ్ ద్వారా ఈ రైలును ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పెద్దపల్లిలో ప్రారంభమయ్యే ఈ రైలు కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లిల మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు మోర్తాడ్‌కు చేరుకోనుంది. ఐదు నిమిషాల పాటు మోర్తాడ్‌లో ఆగి తిరిగి నిజామాబాద్ వైపు పరుగులు తీయనుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు తొలిసారి పెద్దపల్లి - నిజామాబాద్ మార్గంలో రైలు సర్వీసును ప్రవేశపెడుతుండడంతో నిజామాబాద్‌లోనూ భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మార్గం క్రియాశీలకం
కాగా ఈ రైలు మార్గం దక్షిణ మధ్య రైల్వేకు గుండెకాయలాంటిదని నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలను కలుపుతూ లింకేజీ రైలు మార్గంగా పెద్దపల్లి - నిజామాబాద్ మార్గాన్ని గుర్తించారు. ప్రస్తుతం నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా దాదాపు 357కిమీ దూరం ప్రయాణించాలి. మోర్తాడ్ మీదుగా వెళ్తె వంద ఇరవై కిలోమీటర్ల దూర భారం తగ్గనుంది. ఈ ప్రాంతం నుండి ఎక్కువగా ముంబైకి అనునిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు రోడ్డు మార్గం ద్వారానే వెళ్తుంటారు. కరీంనగర్ - జగిత్యాల జిల్లాలకు చెందిన వారు ముంబైకు వెళ్లాలంటే రోడ్డు మార్గం గుండా నిజామాబాద్ వరకు చేరుకుని, అక్కడి నుండి దేవగిరి రైలులో ముంబై వెళ్తుంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ప్రారంభిస్తున్న ఈ రైలు మార్గం కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

టిబి నివారణకు చర్యలు
కలెక్టర్ డాక్టర్ యోగితారాణా
కంఠేశ్వర్, మార్చి 24: రాష్ట్రంలో టిబి (క్షయ) వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో సుమారు 1600మంది క్షయ వ్యాధిగ్రస్థులు ఉన్నారని, దీనికి కారణం అవగాహన లోపమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా అవగాహన లోపం వల్ల చాలామంది ఈ వ్యాధి బారినపడుతున్నారని అన్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించుకునేందుకు తెమడ పరీక్ష చేసి గుర్తించవచ్చని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కింది విధంగా ఉంటాయని అన్నారు. దగ్గగా వచ్చిన తెమడలో రక్తం రావడం, మనిషి నీరసంగా ఉండటం, సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి మందలించడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలన్నారు. పై లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఇందుకోసం జిల్లా ఆసుపత్రిలోనూ అత్యాధునీకమైన యంత్ర పరికరాన్ని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే మొదటి విడతలో 6నుండి 9మాసాల కోర్సు ఉంటుందని, ఈ కోర్సును ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతి రోజు వాడాలని సూచించారు. ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్లకు, ల్యాబ్ సూపర్‌వైజర్లకు కలెక్టర్ ద్విచక్ర వాహనాలను అందజేశారు. క్షేత్రస్థాయిలో క్షయ వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి, పరీక్షలు చేయించి, మందులు వాడే విధానం తెలిపేందుకు ఈ వాహనాలు సిబ్బందికి ఎంతగానో దోహదపడనున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిఎంహెచ్‌ఓ వెంకట్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌తో పాటు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.