నిజామాబాద్

మోర్తాడ్‌కు దూసుకువచ్చిన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 25: మోర్తాడ్‌లో రైలు రాక సంబురాలు అంబరాన్ని తాకాయి. ఉదయం నిజామాబాద్ నుండి బయలుదేరిన రైలు మోర్తాడ్‌కు కూతపెడుతూ దూసుకొచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తాలతో పాటు జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, పార్టీ శ్రేణులు రైలులో ప్రయాణించి మోర్తాడ్‌కు చేరుకున్నారు. వారితో పాటుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బద్దంలింగారెడ్డి, బాల్కొండ రొయ్యాడి రాజేశ్వర్ తదితరులు నిజామాబాద్ నుండి రైలులో మోర్తాడ్‌కు చేరుకున్నారు. ఎంపి కవిత జిందాబాద్ అంటూ టిఆర్‌ఎస్ శ్రేణులు, వందేమాతరం అంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేస్తూ రైలుకు స్వాగతం పలికారు. రైలు వస్తున్న విషయం ముందే సమాచారం అందడంతో వేలాదిమంది ప్రజలు రైల్వే స్టేషన్‌కు చేరుకుని పార్టీ నేతల సంబురాల్లో భాగస్వాములయ్యారు. రైలు ఇంజన్ ముందు ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం ఉంచి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ, గంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన పథకాలపై కాకుండా అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగానే పెద్దపల్లి - నిజామాబాద్ లైన్ అసంపూర్తి పనులకు 328 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. ఆ నిధుల వల్లే పనులు పూర్తయ్యాయని, చిరకాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న రైలుకు మోక్షం ఏర్పడిందన్నారు. నిజామాబాద్ - బీదర్, ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణాలు కూడా రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నామని వారు స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి సంబురాల్లో పాల్గొన్న మంత్రి పోచారం మాట్లాడుతూ, ఎంపి కవిత, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే అసంపూర్తి రైల్వేలైన్ నిర్మాణం పూర్తయ్యిందని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. సరిగా 5నిమిషాల పాటు మోర్తాడ్‌లో ఆగిన ట్రైయిన్ కూతలు పెడుతూ పెద్దపల్లి వరకు దూసుకెళ్లింది. ఈ కార్యక్రమాల్లో రెండు పార్టీల క్రియాశీలక నేతలు, నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు.

పసుపు క్వింటాలుకు రూ.10 వేలు చెల్లించాలి
మోర్తాడ్, మార్చి 25: పసుపు పంటకు క్వింటాలుకు 10వేల రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించాలని ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీ మహాజన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీలో శనివారం మహాజన సభ నిర్వహించారు. చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ సోమ చిన్నగంగారెడ్డి మాట్లాడుతూ, రైతాంగం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 2016 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు చేపట్టిన ఆర్థిక లావాదేవీలపై సమగ్ర నివేదికను సభ్యులకు అందజేశారు. సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పుడే సంఘం అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక రుణాల కింద ఇండ్లు, ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, పసుపు ఉడకబెట్టే యంత్రాలు, భూమి అభివృద్ధికి రుణాలను అందిస్తున్నామని, వీటిని రైతులు, సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సభ్యులకు న్యాయం చేయడంతో పాటు స్థానికంగానే మిల్లింగ్ జరిగేలా రైస్‌మిల్ ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ధాన్యం ఆరబెట్టడానికి, నిల్వ చేసేందుకు ఓపెన్ షెడ్డు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు సూచించగా, వెంటనే నిర్మాణం చేపడ్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. వ్యవసాయ పరంగానే కాకుండా పాడిపరిశ్రమపై కూడా రైతులు దృష్టి సారించాలని, ఇందుకోసం త్వరలో సొసైటీ ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రబీ సీజన్‌కు గాను మొక్కజొన్న, వరి పంటలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లు, సభ్యులతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.