నిజామాబాద్

ఆరోగ్యానికి సేంద్రియ పంటలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 13: సేంద్రియ పద్ధతిలో, ప్రకృతిపరంగా సహజ సిద్ధమైన విధానాలతో సాగు చేసిన పంటలు ఆరోగ్యాల పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని, ఈ తరహా పంటలనే ఎక్కువగా వినియోగించడంపైనే ప్రజలు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా హితవు పలికారు. చిన్నికృష్ణ దేవి విత్తన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సేంద్రియ పంటల సాగు కోసం దేశీయ పద్ధతులను పాటిస్తూ రూపొందించిన విత్తనాలను గురువారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఆదర్శ రైతు చిన్నికృష్ణ సుమారు 50 రకాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో, జీవామృత విధానం ద్వారా సాగు చేస్తున్నారు. ఇదే రీతిలో ఇతర రైతులు కూడా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలనే తాపత్రయంతో ఆయన విత్తనాల పంపిణీకి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ యోగితారాణా రసాయనిక ఎరువులను పూర్తిగా పక్కనబెట్టి సేంద్రియ పద్ధతుల్లో పండించిన వివిధ రకాల పంటలను, వాటి విత్తనాలను పరిశీలించారు. వీటి సాగుకు అయిన వ్యయం, దిగుబడి, వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, సాగు చేసే సమయంలో ఎదురైన ఇబ్బందులు తదితర వాటి గురించి చిన్నికృష్ణను అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు సేకరించేందుకు ముందుకు వచ్చిన వారికి కలెక్టర్ యోగితారాణా తన చేతుల మీదుగా వాటిని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధునాతన వంగడాల కోసం అనునిత్యం ప్రయోగాలు జరిపే ఇక్రిశాట్ వంటి సంస్థల్లో సైతం లేనివిధంగా చిన్నికృష్ణ తన పంట పొలంలో పూర్తిగా సేంద్రీయ పంటలు సాగు చేస్తున్నారని, ఏకంగా 50రకాల పంటలను పండించడం, వాటి విత్తనాలను ఇతర రైతులకు సమకూర్చేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇది సమాజ హితం కోరి చేస్తున్న కార్యక్రమమేనని ప్రశంసించారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరానికి బలం చేకూరుతుందని, అయితే అధిక దిగుబడులను ఆశిస్తూ రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వినియోగిస్తుండడం వల్ల తినే కూరగాయలు వంటి పంటలు కూడా విషతుల్యంగా మారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం కనబరుస్తున్నాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారిస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు. తన క్యాంపు కార్యాలయం ఆవరణలోనూ చిన్నికృష్ణ అందించిన సేంద్రియ వరి వంగడం పండిస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పంటల సాగులో విత్తనం ఎంతో కీలకమైనదని, ఇదివరకు రైతులు తాము పండించిన పంట నుండే విత్తనాలను సమకూర్చుకునేవారని అన్నారు. ప్రస్తుతం విత్తన కంపెనీలు హైబ్రీడ్ సీడ్స్ పేరుతో రసాయన పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను అందిస్తున్నాయని, వీటిలో అధిక భాగం ఎంతోకొంత హాని చేసేవిగానే ఉంటున్నాయని పేర్కొన్నారు. మన కోసం కాకపోయినా, భవిష్యత్ తరాల వారి కోసమైనా సేంద్రీయ పంటల సాగు పెంపొందించేలా రైతులు ఆలోచించాలని కోరారు. రసాయనాలు వాడిన పండ్లను ప్రజలు వినియోగించకూడదని, వీటి పట్ల అవగాహనను పెంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌లలో లభించే కురుకురే, శీతల పానియాల్లో హానికారక రసాయనాలు ఉన్నందున వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని, తనతో కలిసి చదువుకున్న ఇద్దరు డాక్టర్లు క్యాన్సర్ వ్యాధితో చనిపోయారని, తనతో పాటు ఐఎఎస్‌కు ఎంపికైన పశ్చిమబెంగాల్ అధికారిణి కూడా మృతి చెందారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గమనించి తమ కుటుంబం సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేసిన వరి, గోధుమలు వంటి వాటినే వినియోగిస్తున్నామని, ప్రజలు కూడా వీటినే విరివిగా వినియోగించేందుకు ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు చిన్నికృష్ణ, జెడిఎ మోహన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఎ.డి రియాజ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, ఏరువాక శాస్తవ్రేత్త పవన్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడింతలు పెరిగిన బీరు వినియోగం
తగ్గిన విస్కీ, బ్రాందీ అమ్మకాలు

నిజామాబాద్, ఏప్రిల్ 14: మండుటెండల ప్రభావంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీరు వినియోగం ఒక్కసారిగా మూడింతలు పెరిగింది. వేసవి తాపానికి తల్లడిల్లుతున్న మందుబాబులు విస్కీ, బ్రాందీలకు ప్రత్యామ్నాయంగా చల్లటి బీరును తాగేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బీరుబాటిళ్ల వినియోగం ఊహించనంత స్థాయిలో పెరిగిపోయింది. సాధారణ సమయాల్లో నెలకు 30వేల కేసుల బీరు బాటిళ్లు అమ్ముడయ్యేవి కాగా, వేసవి ఉష్ణోగ్రతల వల్ల గడిచిన పక్షం రోజుల వ్యవధిలోనే 45వేల కేసులకు పైగా విక్రయాలు జరగడం విశేషం. ఒక్కో కేసులో 12 బీరుబాటిళ్ల చొప్పున, మొత్తం 5లక్షల 40వేల బీరుసీసాలను మందుబాబులు ఖాళీ చేసేశారు. సాధారణ సమయాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కలుపుకుని నెలకు సగటున 3.60లక్షల బీరుబాటిళ్లు వినియోగించేవారు కాగా, భానుడి ప్రతాపంతో ప్రస్తుతం ఎక్కడా లేని గిరాకీ పెరిగింది. అదే సమయంలో విస్కీ, బ్రాందీల అమ్మకాలు కొంతమేర తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండడంతో అనేక మంది మధ్యాహ్న సమయానికి ముందే బార్‌లు, పర్మిట్ రూమ్‌లకు చేరుకుని చల్లటి బీర్లను సేవిస్తూ వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు సాయంత్రం వరకు తాపీగా కాలం గడుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా అన్ని చోట్ల పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బీరు బాటిళ్లను అందుబాటులో ఉంచడం ఒకింత ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక ఐఎంఎల్ డిపో మాక్లూర్‌లో ఉండడంతో, మద్యం దుకాణాల వారు, బార్ల నిర్వాహకులు ఇక్కడి నుండే వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. నెలవారీ అమ్మకాలను బట్టి వివిధ కంపెనీలకు ఇండెంట్లను పంపించి బీరు బాటిళ్ల నిల్వలను ఐఎంఎల్‌కు సమకూర్చుకుంటారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో లిక్కర్ డిపో నిర్వాహకులు సైతం బీరు బాటిళ్లను సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారు. ఉహకందని రీతిలో బీర్ల వినియోగం జరుగుతుండడంతో మద్యం వ్యాపారులు ఒకేసారి పెద్ద మొత్తంలో బీరు కేసులను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలకు అక్కడి మందుబాబుల అవసరాలకు సరిపడా బీరుబాటిళ్లు లభ్యం కాకుండా కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎక్సైజ్ అధికారులు చొరవ చూపాల్సి వస్తోంది. ఒకే ప్రాంతంలో బీరుబాటిళ్ల నిల్వలు పేరుకుపోకుండా చూస్తూ, అన్ని ప్రాంతాలకు అక్కడి అవసరాలకు అనుగుణంగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ బీరుబాటిళ్ల వినియోగాన్ని నియంత్రించడం కత్తిమీద సాముగానే మారింది. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, భిక్కనూరు, కామారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్ వంటి సుదూర ప్రాంతాల నుండి తాము తరుచూ వాహనాలను సమకూర్చుకుని ఐఎంఎల్ డిపోకు రావడం వల్ల రవాణా ఖర్చుల రూపేణా నష్టపోవాల్సి వస్తోందని, అందుకే ఒకేసారి భారీ మొత్తంలో బీరుబాటిళ్ల నిల్వలను తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ దూర ప్రాంతాల మద్యం దుకాణదారులు పేర్కొంటున్నారు. వారికి అనుమతించిన పక్షంలో, ఇతర ప్రాంతాల్లో కొరత నెలకొంటున్నందున ఇండెంట్‌ను తగ్గిస్తూ మద్యం డిపో నుండి బీరుబాటిళ్లను దిగుమతి చేస్తున్నారు. మరో నెలన్నర రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొని ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఎండలు మండిపోతుండడం బీర్ల విక్రయంపై ప్రభావం చూపుతోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిసారి వేసవిలో వీటి విక్రయాలు ఊపందుకోవడం సహజమే అయినప్పటికీ, మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మూడింతలు కావడం స్థానిక ఎక్సైజ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెరిగిన విక్రయాల వల్ల భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుండడం ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తుండగా, అన్ని ప్రాంతాలకు మందుప్రియుల అవసరాలకు అనుగుణంగా బీరుబాటిళ్లను అందుబాటులో ఉంచేందుకు పెద్దఎత్తునే కసరత్తులు కొనసాగించాల్సి వస్తోంది. వేసవి సీజన్ మరో రెండు నెలలు ఉండడంతో, బీరుబాటిళ్ల కొరతను నివారించేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కాగా, మండుతున్న ఎండల నుండి సేద తీరేందుకు మందుప్రియులు బార్‌లు, ధాబాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా సాయంత్రం వేళల్లో బార్‌లు కిటకిటలాడేవి కాగా, గ్రీష్మతాపం వల్ల ప్రస్తుతం మధ్యాహ్నం సమయాల్లోనూ మందుబాబుల సందడి కనిపిస్తోంది. వేసవిలో ఆరోగ్య రీత్యా విస్కీ, బ్రాందీ వంటి మరింత వేడిమి కలిగించే మద్యం కంటే, బీరు సేవనమే ఉత్తమమని భావిస్తున్నారు. ఎండవేడిమి కారణంగా బీర్లకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడడంతో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.