నిజామాబాద్

గుడుంబా బాధితులకు ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 21: జిల్లాలో గుడుంబా వృత్తిని వదిలేసిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలను తయారు చేయాలని సంయుక్త కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమావేవం నిర్వహించారు. ఈ సందర్భంగ జెసి మాట్లాడుతూ, 2015 డిసెంబర్ 3న నిజామాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. గుడుంబా కాచి జీవనం వెళ్లదీసే 170కుటుంబాలను గుర్తించడం జరిగిందని, స్థానికత ఆధారంగా, నైపుణ్యం, ఆసక్తి గల వారికి ప్రభుత్వ సపోర్టింగ్ స్కీమ్‌లు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ఎంపిడిఓలు, ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించిన వారికి కావాల్సిన, ఆసక్తి గల పథకాలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందినప్పటికీ, ఈ పథకంలో అర్హులలేనని, గుడుంబా వృత్తిని వదిలేసిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యయక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఇంచార్జ్ డిఆర్‌ఓ రమేష్, జడ్పీ సిఇఓ గోవింద్‌నాయక్, ఎక్సైజ్ సిఐలు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్
ఆర్మూర్, ఏప్రిల్ 21: ఆర్మూర్‌ను పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ కోరారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీలో పారిశుద్ధ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తలను విడదీసి ఇవ్వాలని అన్నారు. ఇంటింటికి 2 డబ్బాలను ఇవ్వడం జరుగుతుందని, వీటిలో తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి చొప్పున ఉపయోగించాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ సహకరించాలని అన్నారు. అలాగే వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, సానిటరి ఇన్‌స్పెక్టర్ జయరాజ్, టిఎంసి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉంది
సివిల్ సర్వీసెస్ దినోత్సవంలో కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డి, ఏప్రిల్ 21: ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ శే్వత, కలెక్టర్ సత్యనారాయలు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని జనహిత భవనంలో నిర్వహించిన సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌తో పాటు ఎస్పీ శే్వతలను ఘనంగా సన్మానించారు. 1947వ సంవత్సరంలో ఇండియాన్ అడ్మినిస్ట్రేటివ్‌గా నామకరణం చేసి ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఎంపిక చేస్తు దేశంలోని అత్యుత్తమ సేవలు అందించినందుకు వీరికి నియామక పత్రాలను ప్రభుత్వం అందిస్తుంది. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజల కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జీవితంలో మరువలేని విషయమన్నారు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ స్కీంలు, ప్రజల్లోకి చేరే అవకాశం ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ కుల, జాతుల ప్రజలు ఉన్నప్పటికీ రాగద్వేషాలకు పోకుండా ఐఎఎస్, ఐపిఎస్‌లు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ శే్వత తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. గతంలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేసిన సంతృప్తి ఇవ్వలేదన్నారు. ఐపిఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఐఎఎస్, ఐపిఎస్‌ల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు, హెచ్‌ఎంలకు, ఎంఇఓలకు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగులు, జర్నలిస్టులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రత్యేక సదస్సులను ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడానికి రిటైర్డు అయిన 26 మందిని ఎంపిక చేశారు. పూర్ణను ఆదర్శంగా తీసుకోని విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగాధర్ మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందేందుకు ఐఎఎస్, ఐపిఎస్‌లే కీలకమన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భారీగా తగ్గిన ఉల్లి ధర
గతేడాది రూ. 700, ఈసారి 300

మోర్తాడ్‌లో దొన్‌పాల్ ఉల్లిగడ్డలకు డిమాండ్
మోర్తాడ్, ఏప్రిల్ 21: ఈసారి ఉల్లిగడ్డల రైతులకు సరైన గిట్టుబాటు ధరలు అందడంలేదు. ఎక్కువ మంది రైతులు ఉల్లిగడ్డల పంటను సాగు చేయడంతో పాటు ఒకేసారి దిగుబడులు చేతికందడంతో తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఇదే మోర్తాడ్ మార్కెట్‌లో ఉల్లిగడ్డల బ్యాగు ధర 700 రూపాయల వరకు పలుకగా, ఈసారి అదే బ్యాగు ధర 300రూపాయలకు పడిపోయింది. అయినప్పటికీ రైతులు స్థానిక మార్కెట్లోనే వాటిని అమ్మకాలు చేసుకుంటున్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్‌పాల్ గ్రామం ఉల్లిగడ్డలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ గ్రామానికి చెందిన చాలామంది రైతులు ఉల్లిగడ్డలు సాగు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానంగా వేసవిలో చేతికందే ఉల్లిగడ్డలను చాలా కుటుంబాలు సంవత్సరానికి సరిపడ ఖరీదు చేస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. మోర్తాడ్ అంగడిలో సింహాభాగం ఉల్లిగడ్డల మార్కెట్ ఆక్రమిస్తుంది. ఇందులో అమ్మేవారంత మండలంలోని దోన్‌పాల్ గ్రామానికి చెందిన మహిళారైతులే. దాదాపు అంగడి జరిగే ఆ ఒక్కరోజే యాభై క్వింటాళ్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. దొన్‌పాల్ మహిళా కూలీలు ఒక్కొక్కరు అరవై కిలోల ఉల్లిగడ్డలున్న బ్యాగులను తీసుకవచ్చి మార్కెట్లో అమ్ముతారు. గడచిన ఆరు సంవత్సరాలుగా దొన్‌పాల్ రైతులు ఉల్లిగడ్డల సాగు విస్తీర్ణానాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. చాలా వరకు అన్ని గ్రామాల్లోను రైతులు ఉల్లిగడ్డలను పండిస్తుంటారు. అయితే కేవలం స్థానిక మార్కెట్లో రోజువారి అమ్మకాలకు సరిపడ మాత్రమే పంటను పండిస్తుంటారు. దొన్‌పాల్ రైతులు మాత్రం ఎకరాలకు ఎకరాలుగా పంట సాగు చేస్తు ఉల్లిగడ్డలు పండించడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఏటేటా దిగుబడులు పెరుగుతుండటంతో పాటుగా గిట్టుబాటు కూడా ఆశాజనకంగా ఉండటంతో వారికి లాభాలను ఆర్జించి పెడుతోంది. సాగునీరు ఎక్కువే అవసరం అయినప్పటికీ దొన్‌పాల్ రైతులు ఎక్కువగా ఉల్లిగడ్డలను సాగు చేయడం వెనుక ప్రభుత్వం చేపట్టిన వాటర్‌షెడ్ పథకం ఉపయోగపడిందని రైతులు అంటారు. దాదాపు ఇరవై లక్షల రూపాయలతో పదిహేను సంవత్సరాల క్రితం గ్రామంలో వాటర్‌షెడ్ పథకాన్ని చేపట్టడంతో గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇతర గ్రామాలలో ఇబ్బందులు కలుగజేస్తున్న భూగర్భ జలమట్టం దొన్‌పాల్‌లో మాత్రం రైతులకు అందుబాటులో ఉండటం వారికి లాభిస్తోంది. బోరుబావులు సమృద్ధిగా జలాలు అందిస్తుడటంతో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆ గ్రామ రైతులు రబీ సీజన్‌లో ఉల్లిగడ్డల సాగునే ఎక్కువగా చేపడుతుంటారు. మండల సాధారణ సాగు విస్తీర్ణంలో దొన్‌పాల్‌లోనే డెబ్భై శాతం పంట సాగవుతోంది. దీనిని బట్టే దొన్‌పాల్ రైతుల ఉల్లిగడ్డల సాగు ఏమేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా రైతులందరు తెల్లరకం ఉల్లిగడ్డలనే ఎక్కువగా సాగు చేయడం వల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు చెల్లిస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లతో పాటుగా మహారాష్ట్ర నుండి వచ్చే వ్యాపారులు మోర్తాడ్ మార్కెట్లో ఏకమొత్తంలో ఉల్లిగడ్డలను ఖరీదు చేసి ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వ్యాపారులు రంగ ప్రవేశంతో ఉల్లిగడ్డల రేటు గత సంవత్సరం గణనీయంగా పెరిగింది. వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో రైతులు కూడా ధరల తగ్గింపుపై ఎలాంటి ఆసక్తి చూపలేదు. ఈసారి మాత్రం సాగునీటి లభ్యత సమృద్ధిగా ఉండటంతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా రావడంతో ధరలు భారీగా పడిపోయాయని రైతులు వాపోతున్నారు. మొదట్లో యాభై కిలోల బ్యాగు ధర 400లకు పైగా అమ్ముడైనప్పటికీ, ప్రస్తుతం అదికాస్తా మూడు వందలకు పడిపోయింది. మార్కెట్‌కు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే ఉల్లిగడ్డల బ్యాగులన్నీ అమ్ముడైపోతున్నాయని రైతులు అంటున్నారు. మే నెలలో ఈ అమ్మకాలు మరింత ఉపందుకుంటాయి. కేవలం ఉల్లిగడ్డలే కాకుండా వెల్లుల్లిని కూడా దొన్‌పాల్ రైతులు సాగు చేసి అమ్ముతున్నారు. దీని విషయంలో వాటర్‌షెడ్ పథకాన్ని అమలు చేయించిన గ్రామ మాజీ సర్పంచ్ దేవన్న మాట్లాడుతూ, తమ రైతులు ఉల్లిగడ్డలను సాగు చేయడంలో సిద్ధహస్తులుగా పేరోందారని అన్నారు. యేటేటా ఆ పంటను సాగు చేసే రైతుల సంఖ్య పెరగడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చని అన్నారు. గ్రామంలోనే ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేస్తే తమ రైతులు మరింత ప్రగతి సాధిస్తారని అన్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలోనే దొన్‌పాల్ ఉల్లిగడ్డల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పవచ్చు.

ఎగ్జిబిషన్ కమిటీలో యువతకు స్థానం కల్పించాలి
ఎమ్మెల్యే గణేష్‌గుప్తా
వినాయక్‌నగర్, ఏప్రిల్ 21: జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమిటీలో అనుభవజ్ఞులైన పెద్దలతో పాటు యువతకు అవకాశం కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలో ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ను అర్బన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ సొసైటీలో యువతకు స్థానం కల్పించడం వల్ల ప్రజల మరింత ఆహ్లాదాన్ని కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా యువత కొత్తదనంతో కూడిన అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. అఖిల భారతీయ పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన పేరిట ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేస్తున్నారే తప్పా, ఇందులో వ్యవసాయానికి సంబంధించిన ఏ ఒక్క స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు బంటు రాజేశ్వర్, లక్కంరెడ్డి, రామచంద్రరెడ్డి, కార్పోరేటర్ చాంగుబాయి, ఎనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నేతల రాస్తారోకో
బోధన్ రూరల్, ఏప్రిల్ 21: ముస్లింలకు పనె్నండు శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం బోధన్ మండల బిజెపి నాయకులు నాగన్‌పల్లి గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ముస్లింలకు పనె్నండు శాతం రిజర్వేషన్‌లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే ఈ రిజర్వేషన్‌లు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. మత రాజకీయాలను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రాస్తారోకోలో బిజెపి నాయకులు అశోక్‌గౌడ్, భాగ్యరాజ్, చామకూర రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లా కమిషన్ చైర్మన్ సిఫార్సుల
ప్రతులను దగ్ధం చేసిన న్యాయవాదులు
వినాయక్‌నగర్, ఏప్రిల్ 21: న్యాయవాదులకు అన్యాయం జరిగే విధంగా లా కమిషన్ చైర్మన్ చౌహాన్ విడుదల చేసిన సిఫారులను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు లా కమిషన్ చైర్మన్ సిఫార్సుల ప్రతులను దగ్ధం చేసి, నిరసన చాటారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. లా కమిషన్ చైర్మన్ బిఎస్.చౌహాన్ న్యాయవాదులకు అన్యాయం చేకూర్చేలా సిఫార్సులు చేయడం దారుణమన్నారు. ఈ నిరసనలో న్యాయవాదులు ఆశ నారాయణ, మోహన్, విఘ్నేష్, భాస్కర్‌తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

గొర్రెల పంపిణీతో జీవితాల్లో వెలుగులు: కలెక్టర్

కామారెడ్డి, ఏప్రిల్ 21: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గొర్రెలు, మేకల పంపిణీతో కుర్మ గొల్లల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉందని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22వ తేదిన పట్టణంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు. అలాగే తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పశు వైద్యాధికారులు, ప్రాథమిక గొర్రెల పెంపకం సంఘం ప్రతినిధులు హాజరు కావాలని పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంపై చర్చించి అర్హులైన వారి జాబితాను తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.