నిజామాబాద్

యువతను మోసం చేస్తున్న సంస్థలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 28: కనుచూపు మేరలో ఉద్యోగావకాశాలు కానరాకపోవడంతో నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్న యువతను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, కొంతమంది వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అతి సునాయాసంగా బోల్తాకొట్టిస్తూ నయవంచనకు గురి చేస్తున్నారు. సర్కారీ కొలువు లభించడం గగనంగానే మారిన ప్రస్తుత తరుణంలో కనీసం సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులైనా అభ్యసించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని నిరుద్యోగ యువత తాపత్రయం కనబరుస్తుండగా, వారిని పలు ప్రైవేట్ సంస్థలకు చెందిన యాజమాన్యాలు నమ్మించి మోసం చేస్తున్నాయి. ఉపాధిని కల్పిస్తామంటూ నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయి. ఈ తరహా సంస్థలు రోజుకో రీతిన పూటకొకటి చొప్పున వీధివీధినా వెలుస్తున్నాయి. మారిన సమాజ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక, వృత్తి విద్య కోర్సులను విస్తృతం చేస్తూ అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ, ఈ ముసుగులో కొన్ని యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ అభ్యర్థుల నుండి వేలాది రూపాయలను ఫీజుల రూపేణా వసూలు చేస్తూ నిరుద్యోగ యువత అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఉపాధి కల్పించే మాట దేవుడెరుగు కనీసం పక్కా సర్ట్ఫికెట్లను సైతం సమకూర్చడం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రకటనల ద్వారా వివిధ సంస్థల వారు ఆకర్షిస్తున్నారు. తమ సంస్థలో చేరిన వారికి కంప్యూటర్ కోర్సులతో పాటు ఎసి మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటి డిమాండ్ కలిగిన వృత్తుల్లో నైపుణ్యం కల్పిస్తామంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. తమ సంస్థ ప్రభుత్వం నుండి గుర్తింపు పొందినదంటూ నమ్మిస్తున్నప్పటికీ, జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటిరెండు మినహా మిగతా వాటికి అనుమతి లేదని తెలిసింది. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టిస్తూ తమ సంస్థల్లో చేర్పించుకుంటున్నారు. మరికొంత మంది ఎంట్రన్స్ టెస్టులు పెడుతూ మార్కులు సాధించిన ప్రతిభ ఆధారంగా కోర్సు ఫీజులలో రాయితీలు కల్పిస్తున్నామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్నారు. ఈ ప్రచార ఆర్భాటాలను చూసి ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో నిరుద్యోగ యువతీ, యువకులు వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే వారికి ఏమాత్రం అనుభవం, నైపుణ్యం లేని ఇన్‌స్ట్రక్టర్లతో బోధన చేయిస్తూ వివిధ సంస్థల యాజమాన్యాలు కాలం వెళ్లదీస్తున్నాయి. కోర్సు కాలపరిమితి ముగిసిన అనంతరం కూడా సర్ట్ఫికెట్లను మాత్రం అందించడంలో మీనమేషాలను లెక్కిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సర్ట్ఫికెట్ల కోసం ఒత్తిడి తెస్తే నకిలీ సర్ట్ఫికెట్లను సృష్టించి చేతికందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నకి‘లీలలు’ ఎంతో సులభంగా ఆకళింపు చేసుకోవడం వల్ల కొంతమంది పరీక్షలు రాయకుండానే వారి వద్ద నుండి పైకం పెద్దమొత్తంలో దండుకుని ఆ సర్ట్ఫికెట్లనే అందజేస్తున్నారని తెలిసింది. వివిధ కంపెనీలలో ఉద్యోగ నియామకాల కోసం ఈ సర్ట్ఫికెట్లతో వెళ్తున్న యువతకు చుక్కెదురవుతోంది. మరికొంత మంది టెక్నికల్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఈ తరహా సర్ట్ఫికెట్లను సమకూర్చుకోగా, వారికి సైతం చేదు అనుభవమే ఎదురవుతున్నట్టు తెలిసింది. అప్పటికి గానీ తాము మోసపోయిన విషయాన్ని పసిగట్టలేకపోతున్నారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ సంస్థల పట్ల సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగానే ఈ సంస్థలకు చెందిన యాజమాన్యాలు శిక్షణ, ఉపాధి కల్పన పేరిట నమ్మిస్తూ అమాయక యువతను ఎంతో సులభంగా మోసాలకు గురి చేస్తున్నారని స్పష్టమవుతోంది.