నిజామాబాద్

పుష్కరమైన పూర్తికాని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, ఏప్రిల్ 28: నిర్ణీత గడువులోగా పనులను పూర్తిచేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్ పేరును బ్లాక్‌లిస్టులో పెడతామని సాక్షాత్తు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పనులు ప్రారంభించి సంవత్సరం కాలమైన పనులు పూర్తిచేయలేని కాంట్రాక్టర్ చేతులెత్తయడంతో నాలుగు మాసాలుగా గట్టుపొడిచిన వాగు పనులు ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనకు నోచుకుని పుష్కరకాలం గడిచినప్పటికీ, ఆయకట్టు రైతులకు నీరందించలేని దుస్థితిలో గట్టుపొడిచిన వాగు కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కనిపించిన వేగం ఆ తర్వాత కనిపించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. తెరాస ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్ అసంపూర్తి కాల్వల నిర్మాణాలకు 11.10కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. 2016 జనవరిలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా కాల్వల తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో సభావేదికపై నుండే మంత్రి కాంట్రాక్టర్‌కు, అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మూడు మాసాల్లోగా పనులను పూర్తిచేయని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్ పేరును బ్లాక్‌లిస్టులో పెడతామని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మొదట్లో పనుల్లో వేగం కనిపించినప్పటికీ, మొదటి బిల్లును డ్రా చేసుకున్న తర్వాత పనుల వేగం దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పవచ్చు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ మండలాల్లోని పలు గ్రామాల చెరువులను నింపడానికి ఉమ్మడి రాష్ట్ర శాసనసభా స్పీకర్ హోదాలో ఆనాటి ఎమ్మెల్యే కెఆర్.సురేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. దాదాపు 45సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గట్టుపొడిచిన వాగుకు మొక్షం లభించడంతో శంకుస్థాపన కార్యక్రమానికి ఆయకట్టు రైతులు భారీగానే తరలివచ్చారు. రెండు కొండల మధ్య నిర్మాణ పనులకు నోచుకున్న ఆనకట్ట పనులు శరవేగంగా జరిగి పూర్తయ్యాయి. కేవలం సంవత్సర కాల వ్యవధిలోనే పనులు పూర్తికావడంతో వర్షాకాలంలో పూర్తిగా నిండిపోయి ప్రకృతి అందాలకు ప్రాజెక్ట్ కొంత హంగులు అద్దింది. ఒక పిక్నిక్ స్పాట్‌లా మారిన ఈ ప్రాజెక్ట్ జలాలను ఆయకట్టు గ్రామాలకు మళ్లించేందుకు ఆ తర్వాత నిధులు మంజూరీలేక ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత అరకొర నిధుల మంజూరుతో ప్రాజెక్ట్ ప్రారంభంలో కాల్వల తవ్వకాల పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌లు చేతులేత్తేయడంతో దాదాపు పుష్కరకాలంగా పనులు నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన తెరాస సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి 11.10కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు గడువు విధించడంతో పనులు శరవేగంగా జరుగుతాయని ఆయకట్టు రైతులు పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. వారనుకున్నట్లుగానే దాదాపు కోటి రూపాయల విలువ గల కాల్వ తవ్వకాల పనులు వేగంగానే జరిగాయి. 24.97 శాతం లెస్ టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు కోటి 24లక్షలు మొదటి బిల్లును కూడా మంజూరీ చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కాల్వల తవ్వకం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మోర్తాడ్‌లాంటి గ్రామాలకు హన్మంతరెడ్డి ఎత్తిపోతల జలాలు అందకున్న నష్టంలేదంటే గట్టుపొడిచిన వాగు ప్రాజెక్ట్ ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఎనిమిదిన్నరవేల ఎకరాల పంట భూములను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి వేసిన పోరాట కమిటీ కూడా ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. తలాపున సముద్రం ఉన్నా, తాగడానికి గుక్కెడు నీళ్లుకరువు అన్న చందంలా తయారయ్యింది ఈ ప్రాజెక్టు పరిస్థితి. ప్రస్తుతం మండే ఎండలలో కూడా పుష్కలమైన నీటి నిల్వలతో ఉన్న ఈ ప్రాజెక్ట్ జలాలు ఆయకట్టు రైతులకు ఎండమావులే అవుతున్నాయి. పనులు నిలిపివేసి చేతులెత్తేసిన కాంట్రాక్టర్ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టాలని, ప్రభుత్వం వెంటనే ఈ పనులను ఇతరులకు కేటాయించి రానున్న ఖరీఫ్‌కల్లా పూర్తి చేయించి, తమకు సాగునీటి అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
కాంట్రాక్టర్ ముందుకు వస్తే పనులు అప్పగిస్తాం
గట్టుపొడిచిన వాగు కాల్వల తవ్వకాల పనులు నిలిచిపోయిన విషయం వాస్తవమేనని ప్రాజెక్ట్ డిఇ ఉదయ్‌కుమార్ అన్నారు. పనుల విషయమై వివరాలు కోరగా, ఆయన పైవిధంగా స్పందించారు. పనలుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు కోటి 24వేల రూపాయల మొదటి బిల్లును మంజూరు ఇవ్వడం జరిగిందని అన్నారు. పనులు చేయడం తనవల్ల కాదంటూ సంబంధిత కాంట్రాక్టర్ వాటిని నిలిపివేసి, తన సామాగ్రిని మొత్తం తీసుకుని వెళ్లిపోయాడని అన్నారు. దీని విషయమై ప్రభుత్వానికి లేఖ రాశామని, కొత్త కాంట్రాక్టర్ ఎవరైన పనులు చేసేందుకు ముందుకు వస్తే పనులను అప్పగించి శరవేగంగా పూర్తి చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కష్టాలు
కంఠేశ్వర్, ఏప్రిల్ 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులు తీవ్రమైన నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుండి పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, ఆ నీరు ఎంతమాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా ఈ-ఆసుపత్రి ప్రారంభం కావడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నీటి కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు, ఇతర అవసరాల నిర్వాహణకు ఇబ్బందులు తలెత్తుతుండటగా, ఇన్ పేషెంట్ వార్డుల్లో పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో రోగుల బంధువులు గత్యంతరం లేని పరిస్థితుల్లో బయటి నుండి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 535పడకలు ఉండగా, ప్రతిరోజు 1200పైచిలుకు మంది అవుట్ పేషెంట్లు వస్తుండగా, 500పైచిలుకు ఇన్‌పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు 50లోపు ఆపరేషన్లు జరుగుతుండటగా, ఆ విభాగాల్లోనూ సరిపడా నీరు సరఫరా కావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో నీటి సౌకర్యం కోసం గతంలో 8బోరుబావులు తవ్వించగా, అందులో ప్రస్తుతం కేవలం 2బోరుబావులు మాత్రమే పని చేస్తున్నాయి. వీటి ద్వారా అరకొర నీరు రావడం, మున్సిపల్ నుండి 1000 లీటర్ల నీరు సరఫరా అవుతోంది. దీంతో ఆసుపత్రిలోని ఏడు అంతుస్థుల్లోని బాత్‌రూమ్‌లు, టాయిలెట్స్ వినియోగానికి ఈ నీరు అంతంత మాత్రంగానే సరిపోతోంది. నీటి కొరత వల్ల ఆయా విభాగాల్లో ఇన్ పేషెంట్ల వార్డులోని మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు కంపుకొడున్నాయని రోగుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు గైనిక్ విభాగంలో 25, జనరల్ విభాగంలో 12, ఆర్థో విభాగంలో 10, ఇఎన్‌టి, ఇతర విభాగాలకు సంబంధించి సుమారు 40నుండి 50వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటి కోసం నీరు అవసరం కాగా, నీటి కొరత వల్ల వైద్యులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జనీ, ఆర్థో విభాగం, చిన్నపిల్లల విభాగం, ఆరోగ్యశ్రీ విభాగాల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆయా వార్డుల్లో బాత్‌రూమ్‌లు, టాయిలెట్స్ ఉన్నప్పటికీ, నీటి కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. రోగులు బాత్‌రూమ్, టాయిలెట్స్ వినియోగం కోసం సైతం బస్టాండ్‌కు సమీపంలోని ఆయా దుకాణాల్లో నుండి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో జలధార కింద రూపాయికి లీటర్ చొప్పున నీటిని కొనుగోలు చేస్తున్నా, అవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. ఇక మున్సిపాల్టీ ద్వారా జలధారకు ఇవ్వబడిన నీటి కనెక్షన్ రాత్రి 7గంటల వరకే ఉంటుందని, దీంతో రాత్రి 7గంటలు దాటిందంటే రోగుల బంధువులు నీటి కోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగడం, ఆసుపత్రిలో వేసిన బోరుబావులు పని చేయకపోవడం రోగులు, రోగుల బంధువుల నీటి కోసం ప్రతిరోజు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు.