నిజామాబాద్

వైభవంగా రామానుజ సహస్రాబ్ది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 1: వైష్ణవ మత స్థాపకుడు, నారాయణ మంత్రోపదేశం సర్వజనులకు అందజేసిన భగవత్‌రామానుజుల సహస్రాబ్ది వేడుకలు నిజామాబాద్ జిల్లాలో సోమవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజాము నుండి వైష్ణవ ఆలయాలన్నీ రామానుజ తిరునక్షత్ర వేడుకల కార్యక్రమాలను చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని చక్రంగుడి ఆలయంలో జిల్లా వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజామునే భగవత్‌రామానుజునికి ఆలయంలో అభిషేకాది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం, నగర సంకీర్తన జరిపారు. రామానుజుని చిత్రపటాన్ని పూలమాలలతో అందంగా అలంకరించి రామానుజ భజన సంకీర్తనలు ఆలపిస్తూ పుర వీధులలో నగర సంకీర్తన చేపట్టారు. అనంతరం ఆలయానికి చేరుకుని అర్చనాది కార్యక్రమాలు, ప్రత్యేక పారాయణాలతో తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. రామానుజదాసులంతా ఊర్ధ్వపుండ్రాలు ధరించి రామానుజుల వారి వైభవాన్ని ద్రవిడంలో గానం చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో స్వామివారి పల్లకి సేవను నిర్వహించారు. పూల మండపంలో రామానుజులవారిని వేంచేయింపజేసి ఆలయ వీధులలో పల్లకి సేవను చేపట్టారు. ఆలయంలో వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమం సందర్భంగా, రామానుజులవారు వైష్ణవ మత స్థాపనతో పాటు సర్వమత సమానత్వంపై అందించిన ప్రబోధనలు, చేసిన సేవలను అర్చకులు భక్తులకు విశదపర్చారు. పరమ పవిత్రమైన అష్టాక్షరి సర్వమానవాళికి ప్రభోదించి పరమపద మార్గాన్ని చూపిన మహనీయుడని కీర్తించారు. లోకంలో చిన్నా, పెద్ద అంటూ కులాలు, మతాలు, తారతమ్యాలు లేవంటూ వెయ్యేళ్ల క్రితమే నొక్కి వక్కాణించిన రామానుజులవారు స్వయంగా ఆదిశేష అవతారమంటూ అర్చకులు, భక్తులు ఆయన చిత్రపటం ముందు ప్రణమిల్లారు. అనంతరం ఉత్సవాలకు హాజరైన రామానుజదాసులకు తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వైష్ణవ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యాంసుందరాచార్యులు, కందాళై నాగరాజుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రామాలయంలోనూ, జెండాబాలాజి మందిరం, ఖిల్లా రామాలయంలోనూ భగవత్ రామానుజ సహస్రాబ్ది వేడుకలను వైభవంగా జరిపించారు. జిల్లాలోని ఇతర ప్రధాన ఆలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

నిజామాబాద్ కలెక్టర్‌గా అవకాశం
దక్కడం దేవుడిచ్చిన వరం
జిల్లా పాలనాధికారిణి డాక్టర్ యోగితారాణా
జాతీయ అవార్డుతో బాధ్యత మరింతగా పెరిగిందని వెల్లడి
ఘనంగా సన్మానించి సంబరాలు జరుపుకున్న ఉద్యోగులు

నిజామాబాద్, మే 1: నిజామాబాద్ కలెక్టర్‌గా పని చేసే అవకాశం దక్కడం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని జిల్లా పాలనాధికారిణి డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఇ-నామ్ అమలు కోసం పకడ్బందీ చర్యలు చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో కలెక్టర్ ఉత్తమ అవార్డును అందుకున్న విషయం విధితమే. 11వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కలెక్టర్ యోగితారాణా విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును స్వీకరించిన మీదట వ్యక్తిగత సెలవులో ఉన్న కలెక్టర్, సోమవారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో వివిధ శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, సమాచార శాఖ ఉప సంచాలకులు మహ్మద్ ముర్తుజా తదితరులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగంలో భాగస్వాములైన ఉద్యోగులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే జాతీయ స్థాయి అవార్డు దక్కిందని అన్నారు. ఈ అవార్డును జిల్లా రైతులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఇ-నామ్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు ఎంతగానో తోడ్పాటును అందించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇ-నామ్ విధానం ద్వారా జిల్లాకు జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు దక్కేందుకు అంకితభావంతో కృషి చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా యంత్రాంగం తరఫున అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా సన్మానం చేయించారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పని చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. ప్రధానంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి, ఈ రెండు అంశాల్లోనూ అవార్డులు దక్కేలా కృషి చేయాలన్నారు. కాగా, ఏడాదిన్నర కాల వ్యవధిలోనే ఒకే జిల్లాలో పని చేస్తూ రెండు పర్యాయాలు జాతీయ స్థాయి అవార్డులు పొందిన ఏకైక ఐఎఎస్ అధికారిణిగా కలెక్టర్ యోగితారాణా ప్రత్యేకతను చాటుకున్నారని ఆయా శాఖల అధికారులు ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఉత్తమ అవార్డును దక్కించుకున్నారని అభినందనలు తెలియజేశారు. ఉపాధి హామీ అమలులో ఇదివరకే జాతీయ అవార్డును పొందిన కలెక్టర్ యోగితారాణా, తాజాగా ఇ-నామ్ అమలు ద్వారా ప్రధాని చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. హరితహారం అమలులోనూ నిజామాబాద్ జిల్లాను ముందంజలో నిలుపడం ద్వారా గతేడాది ఆగస్టులో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సిఎం కెసిఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, డిఇఓ నాంపల్లి రాజేష్, జడ్పీ సిఇఓ గోవింద్, డిపిఓ కృష్ణమూర్తి, ఉద్యానవన శాఖ డి.డి సునంద, బిసి సంక్షేమాధికారిణి విమలాదేవి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మేడే వేడుకలు
* వాడవాడలా ర్యాలీలు * అరుణ పతాకాల రెపరెపలు
కంఠేశ్వర్, మే 1: శ్రామిక రాజ్య స్థాపన, హక్కుల సాధన కోసం సమర శీల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వివిధ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తున్న పాలకుల కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సంబరాలను సోమవారం సిఐటియు, ఐఎఫ్‌టియు, ఎఐటియుసి, సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి, టిఆర్‌ఎస్ కార్మిక విభాగంతో పాటు వివిధ వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మృతవీరుల చిహ్నమైన అరుణ పతాకాన్ని ప్రధాన చౌరస్తాలో, కార్మిక సంఘాల కార్యాలయాల వద్ద ఎగురవేయడంతో పాటు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించి కార్మికులకు మేడే ఔన్నత్యాన్ని వివరించారు. జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపిన అనంతరం నెహ్రూపార్క్ వద్ద ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ జెండాను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ఎదుట జెండాను ఆవిష్కరించి మేడే సభను నిర్వహించారు. ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వెంకులు పాల్గొని జెండాను ఎగురవేశారు. టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో జరిగిన కార్మిక దినోత్సవం సంబరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యాలయం ముందు జెండాను ఎగురవేయగా, కోయెడి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. జెండాగల్లిలోని బీడీ కార్మిక భవన్ కార్యాలయం వద్ద తెరాస నేత ఎఎస్ పోశెట్టి మేడే జెండాను ఆవిష్కరించారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఓమయ్య, సుధాకర్ తదితరులు జెండాను ఎగురవేయగా, శ్రద్ధానంద్ గంజ్‌లోనూ ఎఐటియుసి ఆధ్వర్యంలో మేడే సంబరాలు జరుపుకున్నారు. ఆదర్శ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లిలోని కార్యాలయంలో మేడే జెండాను ఎగురవేశారు. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మేయర్ ఆకుల సుజాత, జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మిలు జెండాను ఆవిష్కరించారు. కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌లో జెండాను ఎగురవేసి మేడే ఉత్సవాలు జరుపుకున్నారు. ద్వారకానగర్‌లోని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు కార్మిక జెండాను పరుచూరి శ్రీధర్ ఎగురవేశారు. మల్లారంలోని మేఘన డెంటల్ కళాశాల ఎదుట కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్‌టియు నగర కార్యదర్శి శివకుమార్ జెండాను ఆవిష్కరించారు. నగర పాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వై.ఓమయ్య జెండాను ఎగురవేయగా, పెద్ద సంఖ్యలో కార్మికులు మేడే సంబరాల్లో భాగస్వాములయ్యారు. బీడీ యూనియన్‌లు, నగర పాలక సంస్థ, ఆర్టీసీ, రైల్వేస్టేషన్, మార్కెట్ యార్డు తదితర ప్రాంతాల్లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి, మేడే సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ, ఎనిమిది గంటల పనిదినం, హక్కుల సాధన కోసం చికాగో నగరంలో కార్మికులు ఐక్యంగా చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అనేక బలిదానాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుతం పాలకులు ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా కాలరాయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు, మరోవైపు కార్మికులకు కనీస వేతనాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు అందిస్తున్న పాలకులు, కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం, సంక్షేమ పథకాలు అందక దుర్భర జీవితాలు గడుపుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారుల అలసత్వం వల్ల కార్మిక చట్టాలు, యాజమాన్యాలకు చుట్టాలుగా మారుతున్న పరిస్థితి ఉందన్నారు. పైపెచ్చు ఇదివరకు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలలో మార్పులు చేస్తూ యాజమాన్యాలకు కొమ్ముగాసేలా కుట్రలకు తెర లేపుతున్నారని దుయ్యబట్టారు. కార్మికవర్గం ఐక్యంగా ఉంటూ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అంతిమంగా పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చివేసి, శ్రామిక రాజ్య స్థాపనకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మేడే సంబరాల్లో ఆయా కార్మిక సంఘాల నాయకులు వి.కృష్ణ, కంజర భూమయ్య, దండి వెంకట్, నూర్జహాన్, సబ్బని లత, సాయిబాబా, మురళితో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

అప్రమతతో విధి నిర్వహణ
డిఐజి శివశంకర్‌రెడ్డి

ఇందూర్, మే 1: శాంతిభద్రతల పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించే పోలీసు శాఖలో పని చేసే సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని నిజామాబాద్ రేంజ్ డిఐజి శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం పొందినందుకు ప్రతి క్యాడెట్ గర్వపడాలని సూచించారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల నిజామాబాద్ కమిషనరేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన స్టయిపండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్స్‌లకు 9నెలల శిక్షణ కార్యక్రమానికి డిఐజి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఐజి ఎస్.శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ, నేటి సమాజంలో జరుగుతున్న రకరకాల మోసాలను, నేరాలను అరికట్టాలంటే శిక్షణ పొందే సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని, అప్పుడే నేరాలను సమర్ధవంతంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ సిటీ ఎఆర్ విభాగానికి ఎంపికైన 242మంది క్యాడెట్స్‌లో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ డిప్లోమా చేసిన వారే అధిక సంఖ్యలో ఉండటం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసు వృత్తిని ఎంచుకోవడం పట్ల వారిని డిఐజి ప్రత్యేకంగా అభినందించారు. గతంలో సాధారణ పౌరులుగా మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో పోలీసు శాఖ నుండి ఏదైతే కోరుకున్నారో, శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన తర్వాత ప్రజలకు అలాంటి సేవలు అందించేందుకు సంసిద్ధులు కావాలని సూచించారు. గతంలో ప్రజల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేదని, ఆ సమయంలో శాఖ పరంగా అనుకోకుండా చిన్నచిన్న పొరపాట్లు జరిగినా పెద్దగా పట్టించుకునేవారు కాదని, ప్రస్తుతం ప్రజల్లో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. అప్పుడే ప్రజలకు పోలీసు శాఖపై ఉన్న గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసినవారవుతారని అన్నారు. శిక్షణలో భాగంగా క్యాడెట్లను శారీరకంగా, మానసికంగా సంసిద్ధులను చేస్తూ, ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ ఉంటుందని, ఈసారి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇవ్వడం, బాధితులతో ముఖాముఖి మాట్లాడించడం జరుగుతుందన్నారు. సమాజంలో ఏ రంగంలో రాణించాంటే క్రమశిక్షణ, మృధుస్వభావంతో మెలగడం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందేందుకు వచ్చిన క్యాడెట్లకు ల్యాప్‌టాప్స్ అందించడం జరుగుతుందని, వీటి ద్వారా మరింత జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని డిఐజి హితవు పలికారు. ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్ డిప్లోమా చేసిన వారు 57మంది ఉన్నందున, ల్యాప్‌టాప్ వినియోగంపై కంప్యూటర్ పరిజ్ఞానం లేని తోటి క్యాడెట్లకు ఒక్కొక్కరు కనీసం నలుగురికి సహకరించాలని డిఐజి సూచించారు. ట్రైయినింగ్‌లో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే క్యాడెట్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరు శిక్షణ కాలంలో క్రమశిక్షణతో నడుచుకోవాలన్నారు. పోలీసు కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, నిన్నటి వరకు సామాన్య పౌరులుగా ఉన్న మీరు నేటి నుండి పోలీసు కుటుంబంలో సభ్యులుగా మారారని, వేశ, భాషల్లో మార్పులు రావాలని సూచించారు. తెలంగాణ పోలీసు శాఖ ఇటీవల నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటే, అందులో నుండి కేవలం 9వేల మందిని మాత్రమే శిక్షణకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. శిక్షణ సమయంలో ఇండోర్, అవుట్‌డోర్ తరగతులు, భోజన వసతి, వైద్యం తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ పి.సంజీవ్‌కుమార్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎసిపిలు ఆనంద్‌కుమార్, కె.శివకుమార్, మోహన్, ఎఆర్ ఎసిపి రవీందర్, రిజర్వు ఇన్స్‌పెక్టర్ మల్లికార్జున్, బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసులు, ఎడపల్లి, రెంజల్ ఎస్‌ఐలు ఆసీఫ్, రవికుమార్‌తో పాటు క్యాడెట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

వెలవెలబోయిన ప్రజావాణి
వినాయక్‌నగర్, మే 1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణి సోమవారం ఫిర్యాదుదారులు లేక వెలవెలబోయింది. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం కావడంతో కార్మికులు, కర్షకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మేడే ఉత్సవాల్లోనే నిమగ్నమయ్యారు. దీంతో ప్రజావాణికి కేవలం 29్ఫర్యాదులు రాగా, కలెక్టర్ డాక్టర్ యోగితారణా, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డితో పాటు అధికారులు స్వీకరించారు. ఇందులో కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్ని ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపించారు.
కలెక్టర్‌కు అభినందనల వెల్లువ
ఇదిలా ఉండగా, ఈ-నామ్‌ను పకడ్బందీగా అమలు చేసి జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కలెక్టర్ డాక్టర్ యోగితారాణాకు సోమవారం స్వచ్ఛంద సంస్థలు, ఆయా శాఖల అధికారుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌లో ఎఎస్‌ఐ విఠల్ ఆధ్వర్యంలో పోలీసులు కలెక్టర్ యోగితారాణాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అదే విధంగా ఇండియన్ రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న తనకు రెండు పర్యాయాలు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం తన జీవితంలో మరిచిపోలేనని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, తద్వారా ప్రభుత్వంతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

ఐదుగురు ఫీల్డ్‌అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు
ఇందూర్, మే 1: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి పురోగతి సాధించలేని ఐదుగురు ఫీల్డ్‌అసిస్టెంట్లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా డిఆర్‌డిఓ పిడి వెంకటేశ్వర్లును ఆదేశించారు. సోమవారం సా యంత్రం తన ఛాంబర్‌లో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, డిఆర్‌డిఓ అధికారులతో కలిసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గడిచిన పక్షం రోజులుగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పురోగతి సాధించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గడిచిన పక్షం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 5,160 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిచేయగా, నవీపేట మండలంలోని నందిగామ, కోస్లి, యంచ, అభంగపట్నం గ్రామాల్లో ఒక్క మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టనందున ఆ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా డిచ్‌పల్లి మండలంలోని నడ్‌పల్లి ఫీల్డ్‌అసిస్టెంట్‌పై కూడా సస్పెన్షన్ వేటు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఇఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ 3వ విడత కింద
జిల్లాలో 183 చెరువుల ఎంపిక

* నీటిపారుదల శాఖ ఉమ్మడి జిల్లాల ఎస్‌ఇ గంగాధర్
ఎల్లారెడ్డి, మే 1: తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మూడవ విడత కింద కామారెడ్డి జిల్లాలో 183 చెరువులు ఎంపికైనట్లు, నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నీటిపారుదల శాఖ ఎస్‌ఇ గంగాధర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రం లోగల పెద్ద చెరువుమిషన్ కాకతీయ ఫేజ్ 2కింద మిని ట్యాంకుబండ్ నిర్మాణం కోసం ఎంపిక కావడంతో, చెరువును పరిశీలించేందుకు కామారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఇఇ కె.బన్సీలాల్, డిఇఇ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో మిషన్ కాకతీయ పథకం మూడవ విడత కింద 183 చెరువులు పునరుద్ధరణకు ఎంపిక కాగా ఇప్పటి వరకు 55 చెరువుల పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. మిషన్ కాకతీయ 2వ విడత కింద జిల్లాలో 367 చెరువుల పునరుద్ధరణకు గాను 91 చెరువులు పూర్తికాగా, 276 చెరువుల పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఐదు మినీ ట్యాంకుబండ్‌లు మంజూరైయ్యాయని ఎస్‌ఇ చెప్పారు. ఇందులోఒకటి ఎల్లారెడ్డి పెద్ద చెరువు అని అన్నారు. పెద్ద చెరువు మినీ ట్యాంకుబండ్ నిర్మాణం కోసం 5.41 లక్షల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభం అవుతాయన్నారు. విలేఖరుల సమావేశంలో స్థానిక నీటిపారుదల శాఖ ఏఈఈ మోహన మురళి, కాంట్రాక్టర్ మధుసుదన్‌రావు, వర్క్ ఇన్స్‌పెక్టర్ రషీద్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భారీ అరుణ పతాకంతో ర్యాలీ
కంఠేశ్వర్, మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేను పురస్కరించుకుని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో 131మీటర్ల భారీ అరుణపతాకంతో ర్యాలీ నిర్వహించగా, చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ర్యాలీ నగరంలోని గాంధీగంజ్ నుండి ప్రారంభమై బస్టాండ్, పోచమ్మగల్లి, మార్కండేయ మందిరం, కోటగల్లి మీదుగా నీలం రాంచంద్రయ్య భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి పరుచూరి మురళి మాట్లాడుతూ, రోజువారిగా శ్రమించే కష్టజీవులకు కులం, మతం, పట్టింపులంటూ ఏమీ ఉండవని, కేవలం తమ కుటుంబ పోషణ, బతుకుదెరువు కోసమే కార్మికులు ఆలోచిస్తారని అన్నారు. ప్రస్తుతం దోపిడిదారులు ఐక్యంగా ఉంటూ కార్మికుల శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందువల్ల కార్మికులంతా సంఘటితమై హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు శివకుమార్, మోహన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, నగరంలోని కోటగల్లిలో మేడేను పురస్కరించుకుని ఎఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతి సమాఖ్య కళాకారులు ఆలపించిన గేయాలు కార్మికులను ఎంతగానో అలరించాయి. మేడే వేడుకల్లో యూనియన్ నాయకులు బాబన్న, కుర్తె లింగం, సంజీవ్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.