నిజామాబాద్

గొర్రెల పెంపకంతో అభివృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 20: రాష్ట్రంలోని గొల్ల, కుర్మ, యాదవులు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గొర్రెల యూనిట్లను అందిస్తోందని, వీటిని పెంచుకుని ప్రతి ఒక్కరు అభివృద్ధి బాటలో పయనించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కంఠేశ్వర్ సంక్షేమ సంఘంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిగాల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనూ గొల్ల, కుర్మలు ఉన్నారని తాను సిఎం కెసిఆర్‌తో చెప్పడం జరిగిందని, అందుకు స్పందించిన సిఎం 8యూనిట్లను మంజూరీ చేయడం జరిగిందన్నారు. ఈ 8యూనిట్లను నగరంలోని అర్సపల్లి, కంఠేశ్వర్‌వాసులకు అందజేస్తున్నామని, మొదట కంఠేశ్వర్‌లో 4యూనిట్లను అందజేస్తామన్నారు. కుర్మలు ముందుకు వస్తే మరిన్ని యూనిట్లను మంజూరీ చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో గొర్రెల సంతతి చాలా తక్కువగా ఉందని, అందువల్ల తహశీల్దార్, పశువైద్యాధికారి, ఎంపిడిఓతో పాటు పలువురు లబ్ధిదారులతో కూడిన యూనిట్‌ను రాయలసీమ తదితర ప్రాంతాలకు పంపించి, నిజామాబాద్‌కు గొర్రెలను తీసుకరావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను గొల్ల, కుర్మ, యాదవులు సద్వినియోగం చేసుకుంటూ, ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్రంలోని తెరాస సర్కార్ గొర్రెల పెంపకం అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధియే ధ్యేయంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా చేతుల మీదుగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రారంభం
ఇదిలాఉండగా, నగరంలోని 43వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్‌కాలనీలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని 43వ డివిజన్ ప్రజల విజ్ఞప్తి మేరకు తన కోటా సిడిపి నిధుల నుండి 5లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. అనంతరం అక్కడే ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రజలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఉంటేందుకు సహకరించాలన్నారు. చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో ఎక్కడపడితే అక్కడ పారవేయోద్దని, కార్పొరేషన్ అధికారులు అందిస్తున్న గ్రీన్ కలర్ బుట్టలో తడి చెత్తను, బ్లూ కలర్ బుట్టలో పొడి చెత్తను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం
నగరంలోని తిరుమల సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతించడం జరిగిందన్నారు. తిరుమల సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో 14రకాల వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంటాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌తో పాటు ఆసుపత్రి నిర్వాహకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కులవృత్తుల పరిరక్షణకు గొర్రెల పంపిణీ
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, జూన్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కులవృత్తులను ప్రోహిస్తున్నారని, అందులో భాగంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో లబ్ధిదారులకు సబ్సిడీపై గొర్రెలను మంత్రి, ఎంపి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కులృవత్తుల వారికి న్యాయం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను సిఎం ప్రవేశపెడ్తున్నారని, ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీ అని అన్నారు. గొర్రెల పెంపకం మంచి ఆదాయం అని, దీని వల్ల గొల్ల, కుర్మలకు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని అన్నారు. కులవృత్తులకు ప్రోత్సహం అందిస్తేనే వృత్తులు మరుగున పడిపోకుండా ఉంటాయని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, గతంలో లాగా ప్రభుత్వ పథకాల సబ్సిడీ బ్యాంకు రుణాల కోసం తిరిగే పరిస్థితి లేదని, నేడు సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు. స్వాతంత్రం వచ్చాక యాదవులకు ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 7840 యాదవ సహకార సంఘాగలలో 7,18,069 మంది లబ్ధిదారులు నమోదు అయ్యారని అన్నారు. ఈ ఏడాది సగం, వచ్చే ఏడాది సగం మందికి చొప్పున రెండేళ్లలో అందరికి గొర్రెల పంపిణీ చేస్తాం అని అన్నారు. పంపిణీ చేసిన గొర్రెలను సంరక్షించుకుని పెంచుకుంటే రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో నాల్గు కోట్ల గొర్రెలతో పాటు 20వేల సంపద సృష్టంచబడుతుందని అన్నారు. భవిష్యత్తులో యాదవ్‌లు దేశంలోనే ధనికులు అవుతారని అన్నారు. గొర్రెల గ్రాసం కోసం సబ్సిడీపై స్టైలోగ్రాస్ విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పక్క రాష్ట్రాల నుండి గ్రొరెలను తెచ్చి తెలంగాణలో సంపద పెంచుకోవాలని సూచించారు. గొర్రెల కాపరికి కూడా ఇన్సూరెన్స్ వర్తింప చేస్తున్నామని అన్నారు. అనంతరము ఎంపి. బీబీపాటిల్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రజాసంక్షేమ పథకాలు ప్రజల్లో గుర్తుండిపోయేలా ఉన్నాయని, ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి అభివృద్ధి జరగడం లేదని, అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతోందని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కల్టెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపిడివో, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

గొల్ల, కుర్మలకు ఆర్థిక చేయూతే ప్రభుత్వ లక్ష్యం
*ఎంపి కల్వకుంట్ల కవిత
మోర్తాడ్, జూన్ 20: గ్రామాల్లోని కుల వృత్తులకు పూర్తిస్థాయిలో ఆర్థిక చేయూత అందించేందుకే ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ ఒక్క యాదవుడు ఆర్థిక అవసరాల కోసం చేయిచాచి అడగకుండా చేసేందుకే ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల పెంపకం పథకాన్ని చేపట్టడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పెంపకం యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ, గత పాలకులు కేవలం బిసిల సంక్షేమం పేరిట పథకాలను అమలు చేసినప్పటికీ, ఏ ఒక్కరికి మాత్రం లబ్ధి చేకూరలేదని అన్నారు. ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజాభీష్టానికి అనుగుణంగా సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. వృత్తి పనులను ప్రోత్సహించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని భావించే ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని తెలిపారు. కేవలం 5వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకం రానున్న ఐదేళ్లలో 25వేల కోట్ల సంపదను ఆర్జించిపెడుతుందని దీమా వ్యక్తం చేశారు. గొల్ల, కుర్మలు వారికి అందించిన గొర్రెల పెంపకం యూనిట్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, వాటి ఎదుగుదలకు అవసరమయ్యే పశుగ్రాసానికి అవసరమయ్యే విత్తనాలను కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆమె తెలిపారు. సంవత్సరానికి మూడు పర్యాయాలు నట్టల నివారణ మందును అందించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. ఇలాంటి ప్రక్రియ వల్లే గొర్రెలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన మాంసాన్ని అందించే అవకాశం కూడా ఏర్పడుతుందని ఎంపి పేర్కొన్నారు. ఎవరికైనా ఆపద వస్తే 108కు ఎలా కాల్ చేస్తామో, అదే విధంగా గొర్రెల పెంపకందారులు కూడా 1962కు కాల్ చేస్తే, ప్రత్యేక వాహనాల్లో వైద్యులు వచ్చి గొర్రెలకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎకరానికి 4వేల రూపాయల వంతున వచ్చే సంవత్సరం ఖరీఫ్ నుండి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏమీ వస్తుందని చాలామంది ప్రశ్నిస్తున్నారని, అలాగే వారికి ప్రజలే ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెప్పాలని ఆమె కోరారు. గ్రామంలో ఇల్లులేని నిరుపేదల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. దొన్కల్ గ్రామంలో సిసిరోడ్ల నిర్మాణం కోసం 35లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ఎంపి కవిత ప్రకటించారు. మల్లన్నదేవుడే ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని ఆమె ప్రార్థించారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, గొల్ల, కుర్మలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టిందని తెలిపారు. ప్రజా సంక్షేమానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే, అది ఒక తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గ్రామంలో మొత్తం 60యూనిట్లు అవసరం ఉండగా, తొలి విడతగా 30యూనిట్లు కేటాయిస్తున్నామని, వచ్చే సంవత్సరం మిగతా వారికి మంజూరీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులందరికి గొర్రెల యూనిట్లను ఎంపి, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కల్లెడ చిన్నయ్య, జడ్పీటిసి ఎనుగందుల అమిత, వైఎస్ ఎంపిపి పాపాయి పవన్, ఆర్డీఓ శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, అధికారులు, గొల్ల, కుర్మ, యాదవ కులస్థులు పాల్గొన్నారు.

పండుగల వేళ నగదు కొరతతో పరేషాన్
*పనిచేయని ఎటిఎంలు
*ఖాతాల్లోనే మూలుగుతున్న డబ్బులు

నిజామాబాద్, జూన్ 20: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు ఇప్పటికీ దూరం కాలేకపోతున్నాయి. నెలల తరబడి నగదు కొరత సమస్యతో సామాన్యులు సతమతం కావాల్సి వస్తోంది. పండుగల వేళ కరెన్సీ కొరత తమను పరేషాన్‌కు గురి చేస్తోందని సగటు కుటుంబాలకు చెందిన వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇదివరకే సంక్రాంతి, ఉగాది వంటి పండుగల మజాను పూర్తిస్థాయిలో ఆస్వాదించేందుకు అవకాశం లేకుండా చేసిన నోట్ల కొరత సమస్య, ప్రస్తుతం ముస్లిం మైనార్టీలు ఎంతో ప్రీతిపాత్రంగా జరుపుకునే రంజాన్ వేడుక పైనా ఎనలేని ప్రభావం చూపుతోంది. ప్రతి ఏటా రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. అనంతరం నెలవంక కనిపించిన మరుసటి రోజు ఈద్-ఉల్-్ఫతర్(రంజాన్) వేడుకను అట్టహాసంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, పసందైన వంటకాలు చేసుకుని బంధుమిత్రులను తమతమ ఇళ్లకు ఆహ్వానించడం జరుగుతుంది. అయితే కోరిన మేరకు నగదు నిల్వలు చేతికందే పరిస్థితి లేకపోవడంతో అనేక మంది ఉసూరుమంటున్నారు. రంజాన్ వేడుకకు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో షాపింగ్ చేసేందుకు చేతిలో నగదు నిల్వలు సరిపడా లేక అనేక మంది ఆవేదనకు లోనవుతున్నారు. జిల్లాలోని ఏ ఒక్క బ్యాంకులోనూ వినియోగదారులు కోరిన మేరకు నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించడం లేదు. అతికష్టం మీద 5వేలు మొదలుకుని 10వేల రూపాయల్లోపే నగదును అందిస్తున్నారు. ఇక ఎటిఎం కేంద్రాలైతే మూడొంతులకు పైగా మూసే ఉంటున్నాయి. అక్కడక్కడా కొన్ని పని చేస్తుండగా, వాటిలో కరెన్సీ పెట్టిన గంట సేపటికే నగదు నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో సెక్యూరిటీ గార్డులు నో క్యాష్ బోర్డులు తగిలిస్తున్నారు. అతికష్టం మీద కొన్ని ఎటిఎంల నుండి నగదు వస్తున్నప్పటికీ, 2000 రూపాయల డినామినేషన్ నోట్లు మాత్రమే అందుతుండడం చిల్లర కష్టాలను గట్టెక్కించలేకపోతోంది. బ్యాంకులలో మాత్రం గడిచిన నెల రోజుల నుండి 10వేల రూపాయల వరకే విత్‌డ్రాలకు అనుమతిస్తున్నారు. కరెంటు ఖాతాలు కలిగి ఉన్న వ్యాపారులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా నగదు అందించకపోవడంతో వారు రోజువారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన పలువురు వ్యాపారులు రోజువారీ లావాదేవీల ద్వారా సమకూరే నగదును బ్యాంకుల్లో జమ చేయకుండా తమ వద్దే అట్టిపెడుతున్నారు. ఈ క్రమంలోనే చోరీలు జరుగుతూ బాధితులు తాము దోచుకున్న సొత్తును భారీ మొత్తంలో కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవలే వినాయక్‌నగర్‌లో క్యాటరింగ్ సంస్థను నిర్వహించే ఓ వ్యాపారి తన ఇంట్లోనే నిల్వ ఉంచిన 2లక్షల రూపాయల నగదుతో పాటు 40తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇదివరకు తాము రోజువారీగా బ్యాంకులోనే నగదును డిపాజిట్ చేసేవారమని, అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం నగదును అందించలేని పరిస్థితి ఉండడంతో బ్యాంకుల్లో కాకుండా తమ ఇళ్ల వద్దే నగదును అట్టి పెట్టుకుంటున్నామని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా గడిచిన మూడు మాసాల నుండి నగదు కొరతతో వేతనాలు చెల్లించలేకపోతున్నారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి దాదాపు 80శాతం వరకు బిల్లులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ, ఆ మొత్తాన్ని రైతులకు అందించే పరిస్థితి లేకపోవడంతో బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పెట్టుబడులకు అవసరమైన నగదును సమకూర్చుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తమ ఖాతాల్లో దాచుకున్న డబ్బులు దండిగా ఉన్నప్పటికీ, నగదు కొరత కారణంగా తమ అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు లేకుండాపోతోందని సామాన్య ప్రజానీకం వాపోతున్నారు.

వెనుకబడిన వారి కోసమే గురుకుల పాఠశాలలు
*మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, జూన్ 20: సామాజికంగా వెనుబడిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ మండలం బోర్లం గ్రామంలో 4.66కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వసతిగృహాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బీబీపాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బొర్లం గురుకుల పాఠశాల ఆదర్శంగా మారడం అదృష్టం అని అన్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులతో సమానంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గురుకుల విద్యార్థులు సిద్ధం అవుతున్నారని, వారి ఆ విధంగా తయారు చేయడం జరుగుతోందని అన్నారు. గురుకుల విద్యార్థులపై ప్రతి రోజు భోజనానికి 40రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. నేటి పోటి ప్రపంచంలో 100కు 70.80 శాతం మార్కులు సాధించడం కాదు, 99శాతం మార్కులు సాధించే దిశగా విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక స్వల్పకాలంలో నే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ 500 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం చరిత్ర సృష్టించడమేనని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి సహస నిర్ణయం తీసుకోవడం జరగలేదని అన్నారు. విద్యవ్యవస్థ పటిష్టత కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. భవిష్యత్‌లో జనాభాకు అనుగుణంగా మండలానికో గురుకులాన్ని స్థాపించడం జరుగుతుందని, ప్రతి గురుకుల పాఠశాలను 20 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించడం జరుగుతోందని అన్నారు. గురుకుల పాఠశాలలో శాశ్వత ప్రాతిపాదికన ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని అన్నారు. కనిపించే దైవాలు ఉపాధ్యాయులు కాబట్టి విద్యార్థులు మంచి మెరుగైన జీవితాన్ని పొందేందుకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని, ఏమైన సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి తెల్సుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం ఎంపి బీబీపాటిల్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని, ముఖ్యంగా విద్యారంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణ రాష్ట్రంలో నిరాక్షరాస్యులు లేకుండా చేసేందుకు విద్యవ్యవస్థను సిఎం పటిష్టం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణతో పాటు ఆర్డీఓ, ఎంపిడివో, తహశీల్దార్, ఎంఇఓతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*ఎంపి కవిత
ఆర్మూర్, జూన్ 20: ముస్లింల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ ముస్లింల బాగు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలల చొప్పున మంజూరు చేశారని అన్నారు. షాది ముబారక్ కింద వివాహాలు చేస్తున్నారని, ఇతర సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా భావించే వారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం అలా కాకుండా మానవతా దృక్పదంతో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. అందుకోసమే రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించడమే కాకుండా పేదలకు బట్టల పంపిణీ, ఇఫ్తార్ విందు, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని ఆమె చెప్పారు. అనంతరం ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు ఇఫ్తార్ విందును ఆరగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్లు సుజాత, పండిత్ ప్రేమ్, టిఆర్‌ఎస్ నాయకులు అలీం, మలిక్‌బాబా, అజీమ్, సుంకరి రంగన్న, ఖాందేశ్ నివాస్, కొంగి సదాశివ్, రమాకాంత్, రసమాన్, ఎంపిపి పోతు నర్సయ్య, జడ్పీటిసి సభ్యుడు సాందన్న, మధుకర్, బండారి గోవర్ధన్, శ్యాం, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ముజీబుద్దీన్, మర్కజి కమిటీ అధ్యక్షుడు అశ్వాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి
సదాశివనగర్, జూన్ 20: ప్రభుత్వ పథకాలను కుర్మ,గొల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో గొర్రెల, మేకల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక యూనిట్, ముగ్గురికి మూడు యూనిట్లు అందించారు. గ్రామానికి చెందిన గంగమల్లు, లచ్చయ్యలతో పాటు మరొకరికి మూడు యూనిట్‌లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి పథకాలను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న గొర్రెలు, మేకల పిల్లలను పెంచి అమ్మాలని, ప్రభుత్వం ఇస్తున్న వాటిని విక్రయించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జెసి సత్తయ్య, ఎంపిపి బంజ విజయశివకుమార్, జడ్పిటిసి రాజేశ్వర్‌రావు, జెడిఎ గజరాం, సర్పంచ్‌లు మణెమ్మ, శైలజశ్రీనివాస్, ఎంపిటిసిలు లతరాజు, యాదగిరి, నాన్క్భుయి, ఎఎంసి చైర్మన్ శ్యాంరావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు మల్లేష్, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా రైతు సమగ్ర సర్వే!
* హరితహారం లక్ష్యాన్ని సాధించి తీరాలి: కలెక్టర్ యోగితారాణా
బోధన్, జూన్ 20:రైతు సమగ్ర సర్వేలో ఎక్కడా తప్పులు దొర్లకూడదని జిల్లా కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. సమగ్ర సర్వేలో రైతులకు సంబంధించిన అన్ని వివరాలు సమగ్రంగా ఉండాలని వీటి ఆధారంగానే రైతుకు రుణాలు, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ పై ఎరువులు వంటివి అందుతాయన్నారు. కావున క్షేత్ర స్థాయి అధికారులు ఈ సర్వే విషయంలో ఎక్కడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దన్నారు. మంగళవారం నాడిక్కడ ఆరు మండలాల రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలో రైతు సమగ్ర సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. అయితే గ్రామాల వారీగా రైతుల వివరాలు నమోదు చేసినప్పటికీ మరోమారు ఈ వివరాలలో ఎక్కడైనా తప్పులు దొరిలితే వాటిని సరిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ఇందుకోసం మొదటగా బోధన్ మండలంలోని నాగన్‌పల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు సంబంధించిన పహానీలు, రైతుల పంట భూముల సర్వే నంబర్లు, అందులో వేస్తున్న పంటల వివరాలు, రైతు పేరుమీద ఉన్నటుంవంటి బ్యాంకు ఖాతాల వివరాలన్నింటిని మరొకసారి సరిచూసి పూర్తి సమాచారం ఉండే విధంగా అధికారులు చెక్ చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసినా ఎక్కడైనా తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఈ వెరిఫికేషన్ ద్వారా సరిదిద్దే అవకాశం కలుగుతుందన్నారు. ఈ రికార్డుల ఆధారంగానే బ్యాంకుల అధికారులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమగ్ర సర్వే వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే బ్యాంకులలో రైతులకు అందే రాయితీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. అలాగే బోధన్ డివిజన్‌లోని మండల పరిషత్ అధికారులతో మాడ్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. నిర్దేషించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బోధన్ సబ్‌కలెక్టర్ సిక్ధా పట్నాయక్, బోధన్ తహశీల్దార్ గంగాధర్‌తో పాటు సబ్‌డివిజన్‌లోని అన్ని మండలాల తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, పంచాయిత్ రాజ్ అధికారులు, ఉపాధి హామీ ఎపివోలు పాల్గొన్నారు.

గొల్ల, కుర్మల అభివృద్ధికే గొర్రెల పెంపకం యూనిట్లు
*ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

భీమ్‌గల్, జూన్ 20: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గొల్ల, కుర్మ, యాదవుల ఆర్థికాభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం యూనిట్లను అందజేస్తోందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో మంగళవారం ఆ గ్రామానికి చెందిన గొల్ల, కుర్మలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై అందిస్తున్న గొర్రెల యూనిట్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అందుకు కావాల్సిన పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెడుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని వర్గాల కుల వృత్తులను కాపాడేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూసేందుకు సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఆ దిశగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొండ గోదావరి, వైఎస్ ఎంపిపి శివసారి నర్సయ్య, చేంగల్ సర్పంచ్ మహేష్, గొనుగొప్పుల సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.