నిజామాబాద్

ఏరువాక పనుల్లో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 27: ఒక మోస్తారుగా ఏకబిగిన కురుస్తున్న వర్షాలతో జిల్లా రైతాంగంలో ఎల్లెడలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ఆరంభం నుండే పలుకరిస్తున్న వానలు, రుతుపవనాల కదలికలతో అనునిత్యం చిరుజల్లుల రూపంలోనైనా కురుస్తూనే ఉన్నాయి. గడిచిన మూడు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసుకుని ఉన్న రైతులంతా ప్రస్తుతం వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సగటున 10.7మి.మీ వర్షపాతం కురిసింది. ప్రధానంగా భీమ్‌గల్ మండలంలో 30మి.మీ, ఆర్మూర్‌లో 20.6, బోధన్‌లో 13.2, వేల్పూర్‌లో 16.4, రుద్రూర్, వర్ని మండలాల్లో 10.6మి.మీ చొప్పున, మోర్తాడ్, ఏర్గట్లలో 14.4, నందిపేటలో 14.6, బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో 15.4మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. తాజాగా మంగళవారం కూడా ఉదయం నుండి రాత్రి వరకూ ఆకాశం మేఘావృతమై మెజార్టీ మండలాల్లో ఒక మోస్తారుగా వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనైతే గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, వీధులు, నివాస ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఇలా ఏకబిగిన కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఇప్పటికే వర్షపాతం దాదాపుగా సాధారణ స్థాయికి చేరుకుంది. రుద్రూర్, దర్పల్లి, మాక్లూర్, నవీపేట్, భీమ్‌గల్, వేల్పూర్, కోటగిరి, బోధన్, రెంజల్ మండలాల్లో సాధారణానికి మించి వర్షం కురవగా, ఆర్మూర్, నిజామాబాద్, మోర్తాడ్, ఇందల్వాయి, వర్ని, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు మరింత ఆశాజనకంగా కనిపిస్తున్నాయని రైతులు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. గతేడాది సీజన్ ఆరంభంలో ఒక మోస్తారుగా కురిసిన వర్షాలు, ఆ తరువాడ జూలై మొదటి వారం వరకు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఆ తరువాత ఏకధాటిగా వానలు కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈసారి అలాంటి విరామం లేకుండా ఏకబిగిన ఒక మోస్తారుగా వర్షాలు కురుస్తుండడం పంటల సాగుకు ఊతమందించేదిగా ఉందని రైతులు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు. ఈసారి సకాలంలోనే పంటల సాగు విస్తీర్ణం లక్ష్యానికి చేరుకుంటుందని వ్యవసాయాధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్దేశిత ఖరీఫ్ ప్రణాళికలో ఇరవై శాతం వరకు వరి నాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈసారి కూడా వర్షాలు అనుకూలిస్తాయని వాతావరణ శాఖ భరోసా కల్పించడంతో మెజార్టీ రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో లక్షా 20వేల హెక్టార్ల విస్తీర్ణానికి పైబడి వరి సాగవుతుందని ప్రణాళికలు రూపొందించారు. అరకొర విస్తీర్ణంలోనే సోయా, మొక్కజొన్న, పప్పు దినుసులు వంటి పంటలను విత్తుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సోయా విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, వరి వైపు దృష్టిసారిస్తున్న రైతులు సోయా విత్తనాల కోసం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా వరి పంట ఆక్రమించడం ఖాయమని తెలుస్తోంది. ఒకటి, రెండు భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద జలాల చేరిక ప్రారంభమైతే వరి నాట్లు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇప్పటికే గోదావరిలో వరద ప్రవాహం సన్నని ధారగా మొదలవగా, పలుచోట్ల చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరడం మొదలైంది. ఈ అనుకూల పరిస్థితిని గమనించిన అన్నదాతలు పెద్దఎత్తున వరి సాగు చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. సీజన్ ఆరంభంలోనే వర్షాలు అనుకూలిస్తున్న దరిమిలా, మునుముందు పరిస్థితి మరింతగా అనుకూలిస్తుందనే ఆశాభావంతో వరి నాట్లు వేయడంలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ఎటుచూసినా దుక్కులు దున్ని, పంట పొలాలను దమ్ము కొట్టిస్తూ, వరి నాట్లు వేయిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

జిఎస్‌టికి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారుల నిరసన
వినాయక్‌నగర్, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న వస్తు సేవా పన్నును వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు నిరసన కార్యక్రమాలకు దిగారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం తొలిరోజు నుండే తమ దుకాణాలను మూసివేసి, ర్యాలీ, ధర్నా నిర్వహించారు. వస్త్ర దుకాణాలకు నిలయంగా ఉన్న పూసలగల్లితో పాటు ఆర్‌పి రోడ్‌లో వేర్వేరుగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ వ్యాపారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిఎస్‌టికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హోల్‌సెల్‌తో పాటు రిటైల్ వర్తకులంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అవధూత దశరథం, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకటనర్సయ్యలు మాట్లాడుతూ, వస్త్ర వ్యాపారాన్ని జిఎస్‌టి పరిధిలోకి చేర్చడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 28శాతం పన్ను విధించడం వల్ల ప్రత్యేకించి చిరు వ్యాపారులు కోలుకోలేని రీతిలో దెబ్బతింటారని, వేలాది కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు వస్త్రాల ధరలు పెరిగి, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, వస్త్రాలకు డిమాండ్ సన్నగిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు చిరు వ్యాపారులపై భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో సంస్కరణల పేరుతో వ్యాపార వర్గాల వారిపై ఎనలేని భారం మోపేలా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి నుండి వస్త్ర వ్యాపారాన్ని మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా హోల్‌సెల్ క్లాథ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 72గంటల బంద్‌ను పాటిస్తున్నామని అన్నారు. అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో సంఘం బాధ్యులు కన్నరాజు, మధు, కె.అశోక్‌తో పాటు పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు.

మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ధర్నా
కంఠేశ్వర్, జూన్ 27: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మందకుమార్ మాదిగ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించి తెలంగాణ, ఎపిలలో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అనంతరం మాదిగల ఓట్లతో గెలిచి ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణను అక్రమంగా అరెస్టు చేయించి నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి, ఇప్పటివరకు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ సమస్యలను పరిష్కరించకుండా ఎస్సీ ఉద్యోగుల భర్తీని చేపడుతూ మాదిగలను అన్ని రంగాల్లో అభివృద్ధి కాకుండా అడ్డుకోవడం జరుగుతోందన్నారు. సిఎం కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపి వేయాలన్నారు. ఎంపి కవిత కూడా ఎస్సీ వర్గీకరణపై పార్లమెంటులో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మందకృష్ణ పైన, ఉద్యమం పట్ల నిర్బంధం కొనసాగిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జూలై 7న అమరావతిలో కురుక్షేత్ర మహాసభను నిర్వహిస్తామని, దీనిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొంపల్లి నవీన్‌కుమార్, శివరాజ్, సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దగుజ్జుల్‌లో వైద్య శిబిరం ఏర్పాటు
గాంధారి, జూన్ 27: మండలంలోని దుర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దగుజ్జుల్ తండాలో వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తండాకు చెందిన దాదాపు వంద మంది వరకు అతిసార బారిన పడి వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్పందించిన అధికారులు తాండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తండా వాసులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం గాంధారి జెడ్పీటిసి తానాజీరావు, టిఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శివాజీరావు తాండాకు చేరుకుని తాండాలో అతిసార బారిన పడిన వారితో మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభం అయినందున తండా వాసులు కలుషిత నీరు తాగకుండా ఉండాలని వారికి సూచించారు. అనంతరం గాంధారి నుండి తండాకు మినరల్ వాటర్‌ను సరఫరా చేశారు. గాంధారి వైద్యాధికారి డాక్టర్ వీరేందర్‌ను కలిసిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి తండాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన జెడ్పీటిసికి వివరించారు. వెంటనే తండాలోని మురికి కాల్వలను శుభ్రం చేయించాలని, వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని దుర్గం సర్పంచ్ నరేందర్‌కు జెడ్పీటిసి సూచించారు. తాండాలోని ప్రభుత్వ పాఠశాలలో అతిసార బారిన పడిన వారికి ప్రత్యేక చికిత్సలు నిర్వహించని అనంతరం సెలైన్‌లు ఎక్కిస్తున్నారు. రోగులకు జెడ్పీటిసి పండ్లను పంపిణీ చేశారు. తండాను టిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శివాజీరావు సైతం సందర్శించారు. తాండాలో ఇఒపిఆర్‌డి ఆనంద్, వైద్య సిబ్బంది దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.