నిజామాబాద్

రాజుకుంటున్న ముందస్తు రాజకీయ వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 21: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలానికి పైగా సమయం మిగిలి ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమతమ పార్టీల శ్రేణులను సమాయత్తం చేయడంలో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల ముఖ్య నేతల పర్యటనలు ఎన్నికల హంగామాను తలపిస్తున్నాయి. క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒకింత నిస్తేజ వైఖరి నెలకొని ఉండగా, అధికార తెరాస పార్టీ మొదలుకుని ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆయా కార్యక్రమాల పేరిట భారీ ఎత్తున బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేందుకు పోటీ పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి ఆశించిన స్థాయిలో వరద జలాలు రానందున, ప్రత్యామ్నాయంగా రివర్స్ పంపింగ్ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించేందుకు తెరాస ప్రభుత్వం పథకం రూపొందించింది. సుమారు 1050కోట్ల రూపాయలతో ఇప్పటికే ఈ పనులకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరిస్తూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలనే వ్యూహంతో గత నెల 10వ తేదీన పోచంపాడ్ వద్ద తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. రివర్స్ పంపింగ్ పథకానికి శంకుస్థాపన చేసేందుకు హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు దాదాపుగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ సభలో పాల్గొని ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేసే ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుండి కూడా సిఎం సభకు జన సమీకరణ జరిపారు. ఒకదశలో భారీగా తరలివచ్చిన జన సమూహంతో ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే జన సమీకరణకు తెరాస నేతలు చేసిన కృషి ఏపాటిదో ఊ హించుకోవచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న తెలంగాణ సెంటిమెంటును అనుకూలంగా మల్చుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున సంకల్ప సభను నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్, పార్టీ జాతీయ నాయకులు హాజరైన ఈ సభకు భారీగా ప్రజలను సమీకరించేందుకు వారం పదిరోజుల ముందు నుండే కమలం నేతలు తీవ్రంగా శ్రమించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాల నుండి సుమారు పాతిక వేల మందికి పైగా ప్రజలను తరలించడంలో సఫలీకృతులయ్యారు. రాజ్‌నాథ్‌సింగ్ మినహా మిగతా బిజెపి నేతలంతా తెరాస పాలనను, ఆ పార్టీ అవలంభిస్తున్న విధానాలను తూర్పారబడుతూనే, ప్రధానంగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని విషయాన్ని ప్రజలకు నొక్కి చెప్పే ప్రయత్నాలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తూ, ఎన్నికలకు సమాయత్తం చేసే కార్యంలో నిమగ్నమైంది. వంద రోజుల పాటు చేపడుతున్న ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమాన్ని పురస్కరించుకుని బూత్ స్థాయి నుండి మొదలుకుని గ్రామ, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలందరికీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం డిచ్‌పల్లిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల అవగాహన సదస్సులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియాతో పాటు టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క, సిఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ తదితరులంతా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలని పిలుపునిస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీల ముఖ్య నేతలంతా రానున్న ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. మొత్తం మీద ప్రధాన పక్షాలన్నీ ముందస్తుగానే హడావుడి చేస్తుండడం ఎన్నికల వేడిని తలపిస్తోంది.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను
సద్వినియోగం చేసుకోవాలి
కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 21: ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను అందుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్‌పల్లి సొసైటీ చైర్మన్ బద్ధం భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం కమ్మర్‌పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఉప్లూర్, కమ్మర్‌పల్లిలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న క్వింటాల్‌కు 425 రూపాయలు ఇస్తున్నామని, 14 శాతం తేమ ఉండాలని అన్నారు. మక్కలు విక్రయించిన వారం రోజుల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు నర్సారెడ్డి, భూమేశ్వర్, రైతులు దేవేందర్, సంత రాజేశ్వర్, వేముల గంగారాం, కొమ్ము రవి తదితరులు పాల్గొన్నారు.
30లోగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి
కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 21: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద చేపట్టాల్సిన మరుగుదొడ్ల నిర్మాణాలను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సిఇఓ గోవింద్ నాయక్ చెప్పారు. గురువారం కమ్మర్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అధికారులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం 4553 కాగా, ఇంకా 102 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అన్నారు. పది రోజుల్లోగా ప్రతి మూడు రోజులకోసారి కలెక్టర్‌చే సమీక్షా ఉంటుందని అన్నారు. ఈజిఎస్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేసి ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిడివో చంద్రశేఖర్, ఇఓపిఆర్‌డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

అభ్యంతరాలు లేని భూముల వివరాలు
నమోదు చేయండి
మోర్తాడ్, సెప్టెంబర్ 21: రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ పంచాయతీలో రైతు సమగ్ర భూ సర్వే సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ శ్రీనివాస్ హాజరై, సర్వే వివరాలను పరిశీలించారు. రైతులు వారి పట్టాదారు పాసుపుస్తకాలతోనూ, భూ రికార్డులతోనూ సమావేశానికి హాజరు కాగా, వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సమగ్ర భూ సర్వేలో పూర్తిస్థాయి వివరాలతో ఉన్న భూముల వివరాలను ఆన్‌లైన్ చేయాలని, ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నా, వివాదాస్పదంగా ఉన్నా వాటి విషయమై పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని అసైన్‌మెంట్ భూములు, మార్పిడి వంటి భూముల వివరాలను కూలంకశంగా పరిశీలన చేయాలని ఆదేశించారు. అవసరమైతే అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తహశీల్దార్ ముంతాజీబుద్దీన్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఆర్‌ఐ రవీందర్, విఆర్‌ఓలు రమేష్, రవి, ఆంజనేయులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.