నిజామాబాద్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇంట్లో కోదండరాంకు ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొ.కోదండరాంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం నిజామాబాద్‌లోని తననివాస గృహానికి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. ఆమె ఆహ్వానాన్ని పురస్కరించుకుని కంఠేశ్వర్‌లో గల ఆకుల లలిత నివాసానికి వెళ్లిన కోదండరాంకు ఎమ్మెల్సీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు. నిజానికి ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి ఆమె నివాస గృహంలోనే కోదండరాం కూడా విలేఖరుల సమావేశంలో పాల్గొంటారని మీడియా ప్రతినిధులకు తొలుత సమాచారం అందించారు. అయితే చివరి నిమిషంలో కోదండరాం విలేఖరుల సమావేశంలో పాల్గొనలేదు. ఆతిథ్యం కోసం వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశ్యంతో మిన్నకుండిపోయినట్టు తెలిసింది. ఇటీవలే సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కోదండరాంపై ఘాటైన విమర్శలు చేసిన విషయం విధితమే. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండే కోదండరాం కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తెరాసను ఓడించేందుకు తెర వెనుక కుట్రలు పన్నారని ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోదండరాం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత ఇంటికి ఆతిథ్యానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయ్యింది. కాగా, టి.జెఎసి జిల్లా కన్వీనర్ భాస్కర్‌ను పరామర్శించేందుకు నిజామాబాద్‌కు కోదండరాం హాజరైన సందర్భంగా ఆకుల లలిత, ఆమె భర్త ఆకుల రాఘవేందర్‌లు తమ ఇంట్లో తొలి ఏకాదశి పూజ నిర్వహించడం జరిగిందని విందుకు ఆహ్వానించడంతో కోదండరాం వచ్చారని, ఇందులో మరెలాంటి విశేషం లేదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అయితే తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ప్రతినిధులతో కలిసి కోదండరాం ఎమ్మెల్సీ ఆకుల లలిత ఇంటి వద్దే ‘కొలువులకై కొట్లాట’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం విశేషం. టి.జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. కరపత్రం ఆవిష్కరించిన సందర్భంగా తెరాస ప్రభుత్వ పనితీరుపై కోదండరాం సునిశిత విమర్శనాస్త్రాలు సంధించారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్న కెసిఆర్ సర్కార్‌కు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు మంజూరు చేసేందుకు చేతులు రావడం లేదని ఆక్షేపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే నమ్మకంతో విద్యార్థులు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో 1200మంది అమరులయ్యారని అన్నారు. ఇప్పటికీ విద్యార్థి నాయకులపై వందల కేసులు నమోదై కోర్టుల చుట్టూ పేషీలకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆశించినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ, వారి కొలువుల స్వప్నం సాకారం కాలేకపోతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో దాదాపు 14లక్షల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, వివిధ శాఖల్లో దాదాపుగా 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. గడిచిన 40నెలల కాలంలో యాభైకు పైగా నోటిఫికేషన్లను వెలువరించి కేవలం 20వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని అన్నారు. చీటికిమాటికి సిలబస్‌లో మార్పులు చేస్తూ, అడ్డగోలు నిబంధనలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కోదండరాం ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఆవేదనను చాటేందుకు టి.జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న కొలువులకై కొట్లాట కార్యక్రమానికి నిరుద్యోగ యువత భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

అఖిలపక్షం ధర్నా
మాచారెడ్డి, అక్టోబర్ 12: మాచారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతుపై అవలంభిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండలంలోని అఖిలపక్ష నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాచారెడ్డి మండలం నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్నందువల్ల నిత్యం నాలుగు రోడ్లు రద్దీగా ఉంటాయని అన్నారు. మాచారెడ్డి మండలానికి అనుసంధానంగా ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కేంద్రాలకు వెళ్లే ప్రధాన రహదారులున్నాయి. వారి జిల్లా సరిహద్దు వరకు మాత్రం ఉన్న రోడ్లు డబుల్ లైన్ రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయని వివరించారు. పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా సరిహద్దు నుంచి మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కామారెడ్డి జిల్లా బావబామ్మర్దులకు పాకిస్తాన్ మాదిరిగా కనిపిస్తుందా అని వారు విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని వారు ప్రశ్నించారు. కెటిఆర్ కూడా దేశాయిపేట గ్రామానికి వెళ్లినప్పుడు ఇదే బురద గుంటలో నుంచి వెళ్లారన్నారు. అయినా వారికి కనిపించడం లేదా అని వారు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఈ రోడ్డు అభివృద్ధి పనులు చేయకుంటే ప్రభుత్వ కార్యక్రమాలను స్తంభింప జేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు పంపిరి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి సేపూరి శ్రీనివాస చారి, మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహ్మద్ అస్లాం, బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, తోట బాల్‌రాజు, నాయకులు బుచ్చిరెడ్డి, తోకల శంకర్ తదితరులు పాల్గొన్నారు.