నిజామాబాద్

సమష్టి కృషితోనే విద్యా ప్రమాణాల మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, అక్టోబర్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కవిత, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో విద్యా వ్యవస్థ గాడితప్పిందని, పర్యవేక్షణ లోపం కారణంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సిబ్బంది కొరత, తరగతి గదులు, సౌకర్యాల లేమి వల్లే విద్యారంగా అనుకున్న స్థాయిలో వృద్ధి సాధించలేకపోతోందని గుర్తించిన సిఎం కెసిఆర్, వాటి కల్పనకై పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. విద్య వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజలకు ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పంచేందుకు కృషి చేస్తున్నామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతి డిగ్రీ, జూనియర్ కళాశాలకు ఆర్‌ఓ ప్లాంటు, సిసి కెమెరాల ఏర్పాటుతో, ల్యాబ్ ఎక్విప్‌మెంట్స్ అందజేయడం జరిగిందన్నారు. డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విద్యను బోధిస్తున్న అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని అసెంబ్లీ మొదటి సమావేశంలో తీర్మాణించడం జరిగిందని, అయితే కొందరు కోర్టును ఆశ్రయించడం వల్ల కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేయలేకపోతున్నామని అన్నారు. అయినప్పటికీ, వారికి వేతనాలు పెంచాలనే ఉద్దేశ్యంతో అధ్యాపకుల విద్యా అర్హతలను బట్టి 37వేల రూపాయల వరకు వేతనం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య తెలుసుకున్న మంత్రి కడియం శ్రీహరి, గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ఆడ్మిషన్లు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. అదే సమయంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్యను అందించి, ఫలితాలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలని సూచించారు. బోధన్ మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల భవన నిర్మాణాలకు 36కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్, ఆర్.్భపతిరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ ఇంచార్జ్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్‌కుమార్, సిఇ మల్లేష్, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో
గంగపుత్రుల పాత్ర మరువలేనిది
బాల్కొండ, అక్టోబర్ 12: స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో గంగపుత్రుల పాత్ర మరువలేనిదని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ప్రభుత్వం 100శాతం సబ్సిడీపై అందించిన చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కష్టపడే వారికి తగిన సహాయం చేస్తే, వారి కుటుంబాలు బాగుపడి ఆర్థికంగా ఎదుగుతారని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గంగపుత్రులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాంగానే దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, నేరుగా మత్స్యకారులకు చేప పిల్లలను అందించడం జరుగుతుందన్నారు. చేపల పెంపకం, మార్కెటింగ్ వ్యవస్థను మెరుగపర్చేందుకు ఎంసిడిసి రాష్ట్ర ప్రభుత్వం 1000కోట్లు అప్పుగా తీసుకుని, మత్స్యకార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్నారు. జిల్లాలో 38కోట్లతో 4ఇన్సులేటర్ వ్యాన్లు, 10మినీ వ్యాన్లు, 1800 మోటార్లను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మత్స్యకార్మికులందరికి సబ్సిడీ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, పథకాల అమలులో వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో కోటి రూపాయల విలువ గల కోటీ 24లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ మత్స్యకారులు మధ్యదళారులు లేకుండా ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మత్స్యకారులు ఎమ్మెల్యేను గజమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అర్గుల రాధ, జిల్లా మత్స్య శాఖల సంఘం అధ్యక్షుడు సాయిలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లికొండ గంగరాజు, మోహన్, గంగారాం, ఆర్డీఓ శ్రీనివాస్, మత్స్యశాఖ ఎడి మహిపాల్, ఎఫ్‌డిఓ రాజనర్సయ్య, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, నందిపేట మండలాలకు చెందిన మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను డబ్బా పార్టీ అంటారా?
*టిఆర్‌ఎస్‌పై ఎమ్మెల్సీ ఆకుల లలిత మండిపాటు
కంఠేశ్వర్, అక్టోబర్ 12: నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని డబ్బా పార్టీ అంటూ ఎంపి కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొనడం తగదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్కొన్నారు. గురువారం నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడారు. బుధవారం రాత్రి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఏరియాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టిఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నవి డబ్బా పార్టీలేనని పేర్కొనడం జరిగిందన్నారు. అందుకు ప్రతిస్పందించిన తాను తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ విషయాన్ని తెరాస నాయకులు మరిచిపోవద్దని హితవు పలుకడం జరిగిందన్నారు. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎంపి కవిత వత్తాసు పలుకుతూ ప్రాజెక్టులు కట్టినా, బతుకమ్మ చీరలు పంపిణీ చేసినా పలు పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని, అలాంటి పార్టీలను డబ్బా పార్టీలే అంటామని పదేపదే పేర్కొనడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి, ప్రస్తుతం అమలుకు ఆమడ దూరంలో ఉన్న టిఆర్‌ఎస్సే డబ్బా పార్టీ అని ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎద్దేవా చేశారు. డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ, ఇద్దరు దళితులను హత్య చేయించింది జీవన్‌రెడ్డి కాదా, కోదండరాంతో పాటు మేధావులను విమర్శిస్తున్న జీవన్‌రెడ్డికి ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి కవితతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, కమీషన్లు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. మరోసారి తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షుడు కేశ వేణు, బంటు బలరాం, స్వర్ణలత, తంబాకు చంద్రకళ, పోల ఉష తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అడ్డుకునేందుకు కుట్ర
* డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి

బోధన్, అక్టోబర్ 12:తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు సర్కారు జీవోనంబర్ 16ను జారీ చేయగా కొందరు పనిగట్టుకుని కోర్టుకెళ్లి క్రమమబద్ధీకరణను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని డిప్యూటీ సిఎం, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మొదటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కోర్టు కేసుల వల్ల ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగలేక పోయిందని పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో డిప్యూటి సిఎం మాట్లాడుతూ క్రమబద్ధీకరణ జరగక పోవడం వలన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్‌ల పొట్ట కొట్టకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వారికి 37వేల 100 రూపాయల మూల వేతనాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించక పోయినా వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ సర్కారు కృత నిశ్చయంతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా విస్మరించాయని అన్నారు. అనేక కళాశాలలకు కనీసం పోస్టులు కూడా మంజూరు చేయలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వం కొత్త కళాశాలలకు పోస్టులను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా పెంచుతున్నామని అన్నారు. ఆంగ్ల మాద్యమంలో గురుకులాలు ప్రారంభించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 200 మైనార్టీ గురుకులాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్, ఇంటర్ బోర్టు కమిషనర్ అశోక్‌కుమార్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ ఇంటర్ బోర్డు అధికారి దాసరి ఒడ్డెన్న, బోధన్ సబ్‌కలెక్టర్ సిక్థా పట్నాయక్, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, తెరాస నాయకులు శరత్‌రెడ్డి, బుద్దె రాజేశ్వర్, ఆబిద్ సోఫి తదితరులు పాల్గొన్నారు.