నిజామాబాద్

తిమ్మాపూర్‌లో చిరుత సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 22: కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, తిమ్మాపూర్ గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు భయందోళనకు గురి అవుతున్నారు. శనివారం రాత్రి హెమ్లా నాయక్‌కు చెందిన గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెను లాక్కేలి చంపి తిందని గొర్రెల యాజమాని హేమ్లానాయక్ తెలిపారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామం పూర్తిగా అడవి మధ్యన ఉండటంతో ఇక్కడ తరుచు ప్రజలకు అడవి జంతుల బెడద ఉంటుంది, అడవి జంతువులు ఇప్పటి వరకు మనుషుల జోలికిరాకున్నప్పటీ, మేకలు, గొర్రెలు, పశువులపై దాడులు చేస్తుంటాయి. గ్రామంలో ఇప్పుడు మళ్లీ కొత్తగా చిరుతపులి సంచారం చేయడంతో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉండే తండావాసుల్లో భయందోళనలు చోటుచేసుకుంటున్నాయి. చిరుతపులి అడవి వదిలి తండాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అటవీశాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
అక్రమ కలప రవాణాపై నిఘా ఏదీ?
*పొరుగు జిల్లా నుండి యథేచ్ఛగా స్మగ్లింగ్

నిజామాబాద్, అక్టోబర్ 22: అధికారుల నిఘా వైఫల్యం కలప స్మగ్లర్ల పాలిట వరంలా మారింది. అటవీ శాఖ నిస్తేజ వైఖరితో నిజామాబాద్ జిల్లాలో ఈ అక్రమ దందా అంతకంతకూ వేళ్లూనుకుంటోంది. సుదూర ప్రాంతాల నుండి అడ్డదారుల్లో కలప నిల్వలను జిల్లాలోని సామిల్లులకు తరలిస్తున్నారు. ప్రధానంగా పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుండి అనునిత్యం అక్రమ కలప నిజామాబాద్ జిల్లాకు రవాణా అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా స్కార్పియో వాహనంలో తరలిస్తున్న ఎంతో విలువైన కలప దుంగలు బాసర వద్ద పట్టుబడడం స్మగ్లింగ్ ఉద్ధృతిని చాటుతోంది. సామిల్లుల నిర్వహణను పర్యవేక్షించే నాథుడే లేకపోవడంతో అక్రమ కలప దుంగలు అందమైన ఫర్నిచర్‌గా రూపును సంతరించుకుని బాహాటంగానే మార్కెట్‌లో అమ్మకాలకు ఉంచుతున్నారు. గత పుష్కర కాలం క్రితం వరకు కూడా స్థానికంగానే గల అటవీ ప్రాంతాల్లో స్మగ్లర్లు కలపను సేకరించేవారు. ఉమ్మడి జిల్లాలోని బడాపహాడ్, గాంధారి, భీమ్‌గల్, సదాశివనగర్, బాన్సువాడ, దర్పల్లి, డిచ్‌పల్లి తదితర ప్రదేశాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతాలుగా విలసిల్లేవి. అడ్డూఅదుపూ లేకుండా పెద్దఎత్తున కలప స్మగ్లింగ్ కొనసాగడంతో ప్రస్తుతం అడవులన్నీ పల్చబడ్డాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలం నుండి స్మగ్లర్లు పొరుగు జిల్లాపై కనే్నశారు. నిజామాబాద్‌కు ఆనుకుని ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్దఎత్తున ఇక్కడికి కలప దిగుమతి అవుతోంది. అపరిచిత వ్యక్తులు సమాచారం అందిస్తే తప్ప, అటవీ శాఖాధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదికూడా స్మగ్లర్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన సమయాల్లోనే ఈ తరహా స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారం బయటకు పొక్కుతోంది. ఈ పరిణామం కలప స్మగ్లర్ల మధ్య దాడులు, ప్రతీకార దాడులకు బీజం వేస్తూ హత్యల వరకూ దారితీసింది. సాక్షాత్తూ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే విచారణకు హాజరైన వ్యక్తిపై కత్తులతో దాడిచేసి హతమార్చిన ఉదంతం వెనుక కలప స్మగ్లర్ల మధ్య ఆధిపత్య పోరే కారణమని పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. ఇక కలప స్మగ్లింగ్‌ను నిరోధించాల్సిన గురుతర బాధ్యతలను పక్కనబెట్టి కొందరు పోలీసు సిబ్బంది తమ విధులను అడ్డుగా పెట్టుకుని అక్రమ కలప రవాణా దందాను కొనసాగించిన వైనం గత కొన్నాళ్ల క్రితమే వెలుగుచూసింది. ఉన్నతాధికారుల కళ్లు గప్పి వారి వాహనాల్లోనే ఎవరికీ అనుమానం రాకుండా ఇతర ప్రాంతాల నుండి కలపను జిల్లాకు చేరవేస్తూ పట్టుబడడం కలప స్మగ్లింగ్ తీరుతెన్నులను చాటింది. డిచ్‌పల్లిలోని టిఎస్‌ఎస్పీ 7వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు తమ అధికారి వాహనంలో కలపను జిల్లాకు తరలిస్తూ సోన్ చెక్‌పోస్టు వద్ద ఆదిలాబాద్ అటవీ శాఖాధికారులకు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌పై దాడి చేయగా భారీగా కలప దుంగలు బయటపడ్డాయి. ఈ తరహా అక్రమాలు తెరపైకి వచ్చిన తరువాత కూడా పలువురు అడపాదడపా కలప స్మగ్లింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అటవీ శాఖ అధికారులు తామేమీ తక్కువ తినలేదన్న చందంగా, దాడుల సమయంలో పట్టుబడిన ఎంతో విలువైన కలప దుంగలను సామిల్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం కూడా వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లోనే పలువురిపై సస్పెన్షన్ వేటు విధించారు. ఇలా పోలీసు, అటవీ శాఖలకు చెందిన పలువురు సిబ్బందే అడ్డదారిలో పయనిస్తుండడంతో, దీనిని ఆసరాగా చేసుకుని నగరానికి చెందిన కలప స్మగ్లర్లు సైతం ఆదిలాబాద్ కేంద్రంగా కలపను ప్రతి రోజు గుట్టుచప్పుడు కాకుండా అడ్డదారుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి రోజు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము సమయంలో భారీగా కలప నిల్వలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతలలో పుట్ట గొడుగుల్లా వెలసిన సామిల్‌లే ఇందుకు నిదర్శనం. సామిల్‌ల యాజమాన్యాలలో సంబంధిత అధికారులు కుమ్మక్కై అక్రమంగా నిల్వ ఉంచిన కలపతో పాటు, అక్రమంగా రవాణా అవుతున్న కలపను నిరోధించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖాధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేకుండానే గుడ్డిగా పర్మిట్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని సాకుగా చేసుకుని కొందరు స్మగ్లర్లు అక్రమ కలపను వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ తమ వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటున్నారు. కుచించుకుపోయిన అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, మరోవైపు సంబంధిత శాఖల అధికారుల తీరుతో ఎంతో విలువైన అటవీ సంపద స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.