నిజామాబాద్

అన్నదమ్ముల ఘర్షణలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, నవంబర్ 18: జిల్లా కేంద్రంలోని చర్చి కంపౌండ్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన అన్నదమ్ముల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందినట్లు పట్టణ ఎస్సై రవి కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున జరిగిన అన్నదమ్ముల ఘర్షణలో దేవసహాయం(41) తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. చర్చి కంపౌండ్‌లో నివసిస్తున్న మమత అనే వివాహిత విల్సన్ (చర్చి ఫాస్టర్) పై ఈ నెలలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ కేసును రాజీపడమని మృతుడి అన్నదమ్ములైన సాల్మన్, సాంసన్, ప్రసాద్‌లు పలు సార్లు విన్నవించగా వినకపోవడంతో, శనివారం ఉదయం అన్నదమ్ములతో పాటు ప్రసాద్ భార్య కేజియాలు కలసి శనివారం ఉదయం ఇంట్లోకి వెళ్ళి కేసును రాజీ పడమని ప్రతిఘటించారని, అయినా మృతుడు వినకపోవడంతో మృతునిపై దాడి చేసి , అతనిని కింద పడేసి చాతి పై నిలబడడంతో స్ప్రృహ తప్పాడంతో , 100 కాల్ చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో దేవసహాయంను జిల్లా కేంద్రంలోని జయ హాస్పిటాల్ తరలించారని తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో దేవసహాయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. మృతుని భార్య మమత పిర్యాదు మేరకు నలుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నల్లా కనెక్షన్ ఇచ్చి
పన్నులు వసూళ్లకేనా భగీరథ?
*పోరుబాటలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి
వినాయక్‌నగర్, నవంబర్ 18: మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి తాగునీరు ఇచ్చి, వాటిపై పన్నులు వసూలు చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సామాజిక తెలంగాణకై సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట శనివారం జిల్లా కేంద్రానికి చేరుకోగా, కంఠేశ్వర్ నుండి ధర్నాచౌక్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తూ, కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు దండుకునేందుకే చేపట్టినట్లు ఉందన్నారు ఈ పథకం. ఒకవైపు రాష్ట్రంలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఏ కార్యాలయానికి వెళ్లినా, ఖాళీ కుర్చిలే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి శాఖలో పెద్దమొత్తంలో ఖాళీలు ఉన్నప్పటికీ, సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఎన్నికల హామీని కూడా టీఆర్‌ఎస్ అమలు చేయలేకపోతోందన్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉన్న సింగూర్ నుండి అవసరం లేకపోయినా నీటిని విడుదల చేస్తున్నారని, దీంతో రాబోయే రోజుల్లో నిజాంసాగర్ ఆయకట్టు భూములకు సాగునీటి ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. సింగూరు నుండి విడుదల చేస్తున్న నీటిని మంజీరా, గోదావరి ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లించి, అక్కడి నుండి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాకు తరలించే కుట్రలో భాగంగానే నీటి విడుదల జరుగుతోందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, స్థానిక నాయకులు ముఖ్యమంత్రిని గానీ, సంబంధిత శాఖ మంత్రిని గానీ ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే జరిగిందని, మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటి గురించి సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని గొప్పలు చెప్పిన తెరాస, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నిరుద్యోగ యువతీ, యువకుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపిందన్నారు. చివరకు 8వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన జారీ చేసినా, ఇంతవరకు ఒక్క పోస్టును భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికొస్తే, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. నోట్ల రద్దుతో ధనవంతులకు ఏమీ నష్టం కలుగపోగా, పేద ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రజలు నేటికి అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, అందుకే సామాజిక తెలంగాణ-సమగ్ర అభివృద్ధికై సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టం జరిగిందన్నారు. పోరుబాట ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పోరుబాటలో సీపీఐ ప్లోర్ లీడర్ గుండా మల్లేష్, నాయకులు యూసుఫ్, సృజన, పాండురంగాచారి, రాము, సుధాకర్, భూమయ్య, ఓమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆత్మగౌరవంగా బతకాలనే పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
*ప్రభుత్వవిప్ గంప గోవర్దన్
బీబీపేట్, నవంబర్ 18: రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ డబుల్‌బెడ్‌రూం ఇళ్ళను కట్టిస్తున్నామని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. శనివారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి 15 లక్షల నిదులు మంజూరు చేశామని అన్నారు. డబుల్‌బెడ్ ఇళ్ళ కోసం 1 కోటి 80 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 15 లక్షల నిధులతో పాలశీతలీకరణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి 4 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. నిరుపేదలైన ఆడబిడ్డల కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించందని అన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన 30 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. షాదిముబారక్ లబ్దిదారులకు నలుగురికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ నంద రమేశ్, గండ్ర మదుసుదన్‌రావ్, ఎఎంసి చైర్మన్ అంతంరెడ్డి, నాయకులు నర్సాగౌడ్, వెంకట్‌గౌడ్, ఉపసర్పంచ్ బాగిరెడ్డి, ఎంపిటిసి బాలవ్వ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా మొరం తవ్వకాలు
*సర్కారు ఆదాయానికి గండి

నిజామాబాద్, నవంబర్ 18: ఎలాంటి లైసెన్సులు, అనుమతులు లేకుండానే జిల్లాలో విచ్చలవిడిగా మొరం అక్రమ రవాణా కొనసాగుతోంది. మొరం దందాకు రుచిమరిగిన అక్రమార్కులు పెద్దపెద్ద గుట్టలను సైతం గుటకాయస్వాహా చేస్తున్నారు. సాక్షాత్తూ ఉన్నతాధికారులంతా మకాం వేసి ఉండే నిజామాబాద్ నగర శివారు ప్రాంతాల నుండే అనునిత్యం పగలు, రాత్రి తేడా లేకుండా మొరం దందా కొనసాగుతుండడం విశేషం. బాబన్‌సాబ్ పహాడి ప్రాంతంలో ఏకంగా పొక్లెయిన్‌లను ఏర్పాటు చేసుకుని గత వారం రోజుల నుండి పెద్దఎత్తున అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ, పదుల సంఖ్యలో టిప్పర్లలో నిరాటంకంగా తరలించుకుపోతున్నారు. ఈ తవ్వకాల విషయమై స్థానికులు ప్రశ్నిస్తే, అధికారుల అనుమతితోనే మొరం రవాణా జరుపుతున్నామని ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాటలు విశ్వసించకుండా అనుమతుల విషయాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి సంబంధిత మైనింగ్, రెవెన్యూ అధికారుల నుండి సరైన సమాధానాలు రావడం లేదు. దీంతో అనేక మంది తమకెందుకు వచ్చిన గొడవలే అని మిన్నకుండిపోతున్నారు. బాహాటంగానే కొనసాగుతున్న ఈ తతంగాన్ని చూస్తే, అక్రమ మొరం దందా వెనుక పెద్దఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. గుట్టలకు ఆనుకుని నివాస గృహాలు ఉన్న వారు మొరం తవ్వకాల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తవ్వకాలను నిలిపివేయాలని కోరినప్పటికీ, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఏమాత్రం వినిపించుకోకుండా ఇష్టారీతిన గుట్టలను తవ్వుతుండడంతో వాటికి ఆనుకుని ఉన్న నివాసాలు ప్రమాదపు అంచులకు చేరువవుతున్నాయి. కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ అక్రమ దందాకు తమవంతు తోడ్పాటును అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల ప్రయోజనాలను కాపాడాల్సిన గురుతర బాధ్యతను విస్మరిస్తూ, అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పనుల కోసమే మొరం తరలిస్తున్నారంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. మొరం అక్రమ రవాణా దందా కారణంగా ప్రకృతిపరంగా ఏర్పడి పచ్చదనంతో కనువిందు చేసే గుట్టలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. మధ్య దళారీలు కూడా రంగప్రవేశం చేస్తూ నగర శివార్లలో కంటికి కనిపించిన గుట్టనల్లా జేసీబీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ తవ్వకాల వల్ల గుట్టలు తమ స్వరూపానే్న కోల్పోతున్నాయి. ఇప్పటికే నాగారం, ధర్మపురిహిల్స్, సారంగపూర్, డి-56కెనాల్ తదితర ప్రాంతాల్లోని గుట్టలన్నీ కనుమరుగైపోయి మైదాన ప్రాంతాలుగా మారాయి. ప్రస్తుతం బాబన్‌సాబ్ పహాడీ వద్ద ఈ అక్రమ మొరం దందా అడ్డూఅదుపూ లేకుండా బాహాటంగానే కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణాల కోసం ఎవరైనా చిన్నచిన్న వాగుల నుండి ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుకను తరలిస్తేనే మహాపరాధంగా భావిస్తూ వాహనాన్ని సీజ్ చేసి భారీగా జరిమానాలు విధిస్తున్న అధికారులు, సాక్షాత్తూ జిల్లా కేంద్రంలోనే రేయింబవళ్లు నిర్విరామంగా అక్రమ మొరం దందాను కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. పలుకుబడి కలిగిన పెద్దలే ఈ అక్రమ రవాణా వెనుక ఉండడంతో అధికారులు కనీసం కనెత్తి కూడా చూసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇదే అదనుగా భావిస్తూ అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. నిజామాబాద్‌కు చేరువలోనే ఉన్న మాక్లూర్ మండలంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం గత కొనే్నళ్లుగా అక్రమ మొరం దందా కొనసాగుతూనే ఉండడం సంబంధిత శాఖల అధికారుల అలసత్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిణామం వల్ల ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుండడమే కాకుండా, అనుమతుల రూపేణా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఆదాయానికి సైతం భారీ ఎత్తున గండి పడుతోంది.