నిజామాబాద్

చలి గుప్పిట్లో ఇందూర్ గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 26: నిన్నమొన్నటి వరకు ఓ మోస్తరుగా వున్న చలి పులి ఒక్కసారిగా పంజా విసురుతుండడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. గత నాలుగైదు రోజులుగా జిల్లా అంతటా చలి ప్రభావం గణనీయంగా పెరిగింది. ఉదయం వేళలోనూ చల్లటి గాలుల తాకిడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక సాయంత్రం 6 గంటల నుండి ఉదయం వరకైతే ప్రజలు ఇళ్లను వీడి బయటకు వచ్చేందుకే సాహించడం లేదు. వారం రోజుల క్రితం వరకు కూడా చలి తీవ్రత అంతగా కనిపించలేదు. ప్రస్తుతం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చలి ప్రభావం పెరగడం, మునుముందు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు పేర్కొంటుండడంతో ప్రజలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల క్రితం ఉష్ణోగ్రత సగటున గరిష్టంగా 34.0 డిగ్రీలు, కనిష్టం 18.0 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ప్రస్తుతం అది 13 డిగ్రీలకు పడిపోయింది. ఈ ఏడాది సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైంది. మూడు రోజుల క్రితం వరకు కూడా 18.1, 17.0 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా 13డిగ్రీలకు చేరింది. శనివారం 12.8 డిగ్రీలుగా నమోదైంది. ఇలా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు క్షీణిస్తుండడంతో చలి ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పొగమంచు చలి ప్రభావాన్ని మరింతగా పెంచుతోంది. ఉదయం 10 గంటల వరకు కూడా చలి దుప్పట్లు ఆకాశాన్ని కమ్ముకుని కనిపిస్తున్నాయి. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. చలి ధాటికి వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు పడరానిపాట్లు పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చిన్నారులు సైతం శ్వాసకోస ఇబ్బందులతో అనారోగ్యాలకు గురవుతుండడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చలి వణికిస్తోంది. జిల్లాలోని ఏ పల్లెలో చూసినా చలి మంటలు కాస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాలుగు గంటలకే మేల్కొని తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే పల్లె ప్రజలు ఆరు గంటలు దాటితే తప్ప వీధుల్లోకి రావడం లేదు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చలి తీవ్రత పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా మీదుగా వున్న రెండు జాతీయ రహదారులపై పలు వాహనాల డ్రైవర్లు చలితీవ్రత తట్టుకోలేక డ్రైవర్లు తమ వాహనాలు నిలిపివేసుకొని చలి మంటలు కాస్తున్నారు. కాగా, విపరీతంగా పొగ మంచు వస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని డ్రైవర్లు అంటున్నారు. కాగా, చలి ప్రభావాన్ని తట్టుకునేందుకు ఉన్ని వస్త్రాల వైపు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నగరంలోని ఖలీల్‌వాడీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెలసిన ఉన్ని దుకాణాలు అనునిత్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వాస్తవానికి నవంబర్ మొదటి వారంలోనే చలి ప్రభావం ప్రారంభమవుతుంది. దీంతో ఆ సమయంలోనే ఉన్ని వస్త్రాల దుకాణాలు గిరాకీని సంతరించుకుంటాయి. అయితే ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడిన ఫలితంగా నవంబర్ నెలలో చలి ప్రభావం అసలే కనిపించకుండాపోయింది. డిసెంబర్ మొదటి వారంలో కాస్తంత చలి ప్రారంభమైనప్పటికీ, అనంతరం తిరిగి ఉష్ణోగ్రతలు పెరగడంతో నేపాల్ నుండి వచ్చిన ఉన్ని వస్త్రాల వ్యాపారులు సగానికి పైగా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారిగా చలి విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం అరకొరగా మిగిలి ఉన్న దుకాణాల వద్ద ఉన్ని దుస్తుల కొనుగోలుదారుల సందడి కనిపిస్తోంది.

తండ్రిని హతమార్చిన బాలుడు

మాక్లూర్, డిసెంబర్ 26: తాగిన మైకంలో ఇంటికి చేరుకుని అనునిత్యం ఘర్షణ పడుతున్న తండ్రి తీరుతో విసుగు చెందిన పదమూడేళ్ల బాలుడు కల్లు సీసాతో దాడి చేసి కన్నతండ్రిని కాటికి పంపాడు. ఈ ఉదంతం జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్‌బండార్ తండాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్రాములు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మానిక్‌బండార్‌తండాకు చెందిన మెగావత్ గణేష్ (40) అనునిత్యం మద్యం సేవించి తాగిన మైకంలో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. అతని కుమారుడు దినేష్ డిచ్‌పల్లిలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులు రావడంతో దినేష్ రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే తండ్రి గణేష్ శుక్రవారం రాత్రి తాగి వచ్చి తల్లితో గొడవ పడడాన్ని చూసి దినేష్ వారించబోయాడు. ఇలా తప్పతాగి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తూ, తాగుడు వ్యసనాన్ని వీడాలని హితవు పలికాడు. దీంతో తాగిన మైకంలో ఉన్న గణేష్ ఆగ్రహం ప్రదర్శిస్తూ వేలెడంత లేవు..నాకే నీతులు చెబుతావా? అంటూ చేయి చేసుకున్నాడు. తండ్రి ప్రవర్తనతో విసుగెత్తిన దినేష్ ఆరుబయట ఉన్న కల్లు సీసాను పగులగొట్టి తండ్రి కడుపులో పొడిచాడు. దీంతో గణేష్ అక్కడికక్కడే ఉన్నపళంగా కుప్పకూలి కిందపడిపోయాడు. అతనిని స్థానికులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ వెంకట్రాములు తెలిపారు.