నిజామాబాద్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 23: ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామంలో 15లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బోధన్ శాసన సభ్యుడు షకీల్ అహ్మద్ గురువారం భూమిపూజ చేశారు. గ్రామంలో 10లక్షలతో సీసీ రోడ్డు పనులు, 5లక్షల వ్యయంతో ఈద్గా వద్ద సిమెంట్ ఫ్లాట్‌ఫామ్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఇమ్రాన్‌ఖాన్ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకవచ్చారు. గత పాలకులు తమ గ్రామాభివృద్ధిపై పూర్తి వివక్షత వహించారని, కనీసం ఇటువైపు కనె్నత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో చాలామంది నిరుపేద ప్రజలు ఉన్నారని, వీరికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకంలో భాగంగా మొదటి దశలోనే తమ గ్రామానికి 50ఇండ్లను కేటాయించగా, పట్ట్భామి కలిగిన ఓ దాత ద్వారా 2ఎకరాల స్థలాన్ని అందించడం జరిగిందన్నారు. అయితే ఓ ఎన్‌ఆర్‌ఐ ఈ భూమి తనదంటూ దౌర్జన్యంగా కోర్టు నుండి నోటీసులు పంపించి, కబ్జా చేసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎంపీటీసీ ఇమ్రాన్, ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తామే స్వయంగా ఆ భూమి పట్టాదారును ఒప్పించి డబుల్ బెడ్‌రూమ్ కోసం ఇప్పించడం జరిగిందని, అందువల్ల ఈ భూమిని స్వాధీనం చేసుకుని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. సుమారు రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న తమ గ్రామాభివృద్ధికి సీడీపీ నుండి పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలని ఎంపీటీసీ ఇమ్రాన్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మాట్లాడుతూ, బోధన్ నియోజకవర్గం ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించడం వల్లే తాను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా నెహ్రూనగర్ గ్రామం తన సొంత గ్రామం లాంటిదని, అందుకే ఈ గ్రామాభివృద్ధికి ఇప్పటి వరకు 70లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 16శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నా, వాస్తవంగా 18శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుందన్నారు. అందులో మైనార్టీ వర్గానికి చెందిన తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని, అదే రాష్ట్ర జనాభాలో 3శాతం జనాభా ఉన్న వారు 50మందికి పైగా ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభలో చర్చించాలంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నెహ్రూనగర్ గ్రామంలో ఎక్కువ మంది పేద ప్రజలే ఉన్నందున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేసి 50ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులో దాత నుండి 2ఎకరాల భూమిని సేకరించినందున, అట్టి భూమిని స్వాధీనం చేసుకుని రెండుమూడు రోజుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాల పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ లతను ఆదేశించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్థులంతా సమావేశమై, అతి ముఖ్యమైన పనులకు సంబంధించి నివేదికలు పంపించాలని, అందుకు అవసరమైన నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ముస్లిం మైనార్టీలకు షాదీముబారక్, ఎస్టీ, ఎస్టీ, బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తస్లీమాబేగం సలీం, ఎంపీటీసీ సభ్యుడు ఇమ్రాన్‌ఖాన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరాం, టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు ఆత్మేల శ్రీనివాస్, లక్ష్మీనర్సింస్వామి ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్‌గౌడ్, స్థానిక నాయకులు హన్మాండ్లు, జ్యోతిరాజ్, భాస్కర్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.