నిజామాబాద్

హెల్మెట్లపై పోలీసు శాఖ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 23: భద్రతా చర్యల్లో భాగంగా హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ద్విచక్ర వాహనాదారులు విధిగా శిరస్త్రాణాలు ధరించేలా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనున్నారు. ఇటీవలి కాలంలో పెద్దఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండడం, ఎక్కువగా ద్విచక్ర వాహనాదారులే మృత్యువాత పడుతుండడంతో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ల వాడకంపై దృష్టిసారిస్తున్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, లేనిపక్షంలో మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత రక్షణ కోసం హెల్మెట్లు ధరించడం ఎంతో శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు. హెయిర్ స్టైల్ కంటే ప్రాణాలను కాపాడే హెల్మెట్లు ధరించడం ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఏదైనా ప్రమాదాలకు గురైన సందర్భాల్లో హెల్మెట్లు లేని కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్లు ధరించకపోయినా, సరైన పత్రాలు చూపకపోతే మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలు వేగంగా నడపరాదని, త్రిబుల్ రైడింగ్ ప్రమాదకరమని సీ.పీ హితవు పలికారు. కాగా, జిల్లా కేంద్రంలో హెల్మెట్ల వాడకం నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దఎత్తున ట్రాఫిక్ పెరిగిపోయి అనునిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ అధికారులు మరోమారు దీనిపై దృష్టి సారించారని తెలుస్తోంది. నిజానికి గత కొన్ని వారాల క్రితం నుండే పోలీసులు ఎక్కడికక్కడ ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేస్తూ, హెల్మెట్‌లు ధరించని వారికి ఎడాపెడా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను సమకూర్చుకునేందుకు వివిధ దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. శిరస్త్రాణాలకు డిమాండ్ పెరగడంతో పలువురు పూణె, బెంగళూరు, నాందేడ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి తక్కువ ధరకు హెల్మెట్లు కొనుగోలు చేసుకుని, స్థానికంగా జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా వాటిని విక్రయిస్తున్నారు. ఆయా కంపెనీలను బట్టి ఒక్కో హెల్మెట్ ధర 500రూపాయలు మొదలుకుని ఐఎస్‌ఐ మార్కు కలిగిన స్టాండర్డ్ కంపెనీలకు చెందిన వాటి ధర వేయి రూపాయల వరకు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం సాధారణ రకానికి చెందిన తక్కువ ధరకు అందుబాటులో ఉన్న హెల్మెట్ల పైనే వాహనదారులు దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో సుమారు 2.20లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలు ఉండగా, అందులో కనీసం పది శాతం మందికి కూడా శిరస్త్రాణాలు లేవనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం వాటిని తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షలను అమల్లోకి తెచ్చిన దరిమిలా ప్రతి ఒక్కరూ హెల్మెట్ల కొనుగోలుపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ హెల్మెట్ల నిబంధనను అమలయ్యేలా గురుతర బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నప్పటికీ, రవాణా శాఖ అధికారులు కూడా ఇప్పటికే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు హెల్మెట్లతో లంకె పెట్టారు. హెల్మెట్లు ఉంటేనే వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపడుతున్నారు. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే తప్పనిసరిగా శిరస్త్రాణాలను కూడా కొంటున్నారు. ప్రజల భద్రత కోసమే తాము ఈ నిబంధనను అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తు.చ తప్పకుండా పాటించాల్సిందేనని, లేనిపక్షంలో మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు.

కళాశాలల బంద్ విజయవంతం

కామారెడ్డి, నవంబర్ 23: ప్రభుత్వ డిగ్రీకళాశాల భూముల ఆక్రమనకు నిరసనగా విద్యార్థి ఐక్యకార్యచరణ కమిటీ ఇచ్చిన జిల్లాకేంద్రంలోని కళాశాలల బంద్ గురువారం విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలైన టిజివిపి జిల్లా అధ్యక్షుడు మలోత్ ప్రకాశ్‌నాయక్, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి సందీప్, బివిఎస్ నేత బాలునాయక్, ఎఐఎస్‌ఎఫ్ నేత బాను, ఎబివిపి నాయకుడు బాలు, టివియువి నేత లక్ష్మణ్, జివిఎస్ నేత జబ్బర్, పిడిఎస్‌యు నేతలు రవీ, సురేశ్, బిసివిఎస్ నేత నాగరాజ్, ఎస్‌ఎఫ్‌ఐ నేత అరవింద్‌లు మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన భూములు అక్రమంగా లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని నిరసిస్తూ అక్రమ సర్వేను అడ్డుకుంటే పోలీసులను ఊసిగొల్పి తమను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. విద్యార్థులకు నీడనిచ్చి చదువుల తల్లి కొలువై ఉన్న ప్రభుత్వ డిగ్రీ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం విద్యార్థులను పోలీసులతో అరెస్ట్‌లు చేయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన ఇంచ్ స్థలం కూడా అక్రమిస్తే విద్యార్థిలోకం చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి ప్రభుత్వడిగ్రీకళాశాల స్థలాన్ని పూర్తిగా కళాశాలకు అప్పగించి పెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి సంఘాలన్ని కలిసికట్టుగా భారీ స్థాయిలో ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన అన్ని కళాశాలల విద్యార్థులకు వారు కతజ్ఞతలు తెలిపారు.