నిజామాబాద్

దళితుల సంక్షేమానికి విరివిగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 14: దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి తెరాస ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని, ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17బడ్జెట్‌లో 40శాతం నిధులను కేటాయించడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పోచారం జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఫులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పోచారంతో పాటు జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, హన్మంత్‌సింధే, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, విజి.గౌడ్, మేయర్ సుజాత, కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన జయంతి వేడుకలో మంత్రి పోచారం మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ జరుపుకునే గొప్ప పండుగ అంబేద్కర్ జయంతి అని అన్నారు. అంబేద్కర్ దూరదృష్టితో రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే తెరాస ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని చెప్పారు. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి ఆసరాగా నిలుస్తూ వ్యవసాయ, ఉద్యానవన యూనిట్లను నూటికి నూరు శాతం సబ్సిడీపై మంజూరు చేయనున్నామని ప్రకటించారు. పాలీహౌస్‌ల ఏర్పాటుకు 40లక్షల రూపాయల వరకు పూర్తిగా రాయితీని ప్రభుత్వమే భరించనుందని తెలిపారు. దళిత రైతులకు 100శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఆధునిక యంత్రాలు, సేద్యపు పనిముట్లకు సబ్సిడీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో 400కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు. గత ప్రభుత్వాల అసమర్ధత, నిర్లక్ష్య వైఖరి వల్ల దళితుల స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ రీతిలో మార్పులేవీ రాలేకపోయాయని మంత్రి పోచారం ఆక్షేపించారు. బంగారు తెలంగాణ సాధనలో అన్ని వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు. రైతు కూలీలను భూ యజమానులుగా తీర్చిదిద్దేందుకు అర్హులైన దళితులకు మూడెకరాల సాగు భూమిని పంపిణీ చేస్తున్నామని అన్నారు. భూముల కొనుగోలుకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని స్పష్టం చేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోని 2015-16 సంవత్సరానికి సంబంధించి 38కోట్లతో 796 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 333మంది దళిత కుటుంబాలకు పంపిణీ చేశామని తెలిపారు.
ఇందిర జలప్రభ కింద రైతుల భూములకు నీటి వసతి, సూక్ష్మసేద్య పరికరాల ఏర్పాటు కోసం 100శాతం సబ్సిడీని 6.50లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రెండు పడక గదుల నిర్మాణాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు 50శాతం కోటా కేటాయిస్తున్నామని, టిఎస్.ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి కూడా ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకుని ఎస్సీ, ఎస్టీలు ఆర్థికాభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని మంత్రి పోచారం పిలుపునిచ్చారు. కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే మన చట్టసభలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే ఎంతగానో ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏడుగురు దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేయడంతో పాటు లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేశారు.