నిజామాబాద్

భూ రికార్డుల ప్రక్షాళనలో ముడుపులు ఆశిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 11: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సందర్భంగా కొంతమంది వీఆర్‌ఓలు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ తరహా అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఓ బాధితుడు భూ రికార్డుల శుద్ధీకరణ జరిపేందుకు వీఆర్‌ఓ డబ్బులు అడుగుతున్నాడని ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి అనంతరం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, భూ రికార్డుల శుద్ధీకరణను ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ పారదర్శకంగా చేపట్టాల్సిందేనని అన్నారు. ఎవరైనా ముడుపులు ఆశిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. దీనికి సంబంధిత తహశీల్దార్లను కూడా బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. నూటికి నూరు శాతం నియమ నిబంధనలు పాటిస్తూ పహాణీలు తయారు చేయాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. తహశీల్ కార్యాలయాల్లోనే పహాణీల రూపకల్పన ప్రక్రియను జరిపించాలని, అవసరమైతే వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను షిఫ్టు పద్ధతుల్లో పని చేయిస్తూ అక్కడే భోజన వసతి సమకూర్చాలన్నారు. జిల్లాలో 439 రెవెన్యూ గ్రామాలకు గాను 426 గ్రామాల్లో సర్వే జరుగుతుందని, మిగతా 13 గ్రామాల్లోనూ ఈ నెల 20వ తేదీ వరకు సర్వే పూర్తి చేయాలని, మొత్తంగా భూ రికార్డులు శుద్ధీకరణను 25వ తేదీ వరకు పూర్తి చేయాలని గడువు విధించారు. వివరాలను వెంటదివెంట ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యానువల్ 1బి, పహాణీల తయారీని వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం విద్యావంతులై ఉండి, చురుకుగా పని చేసే వీఆర్‌ఏల సహాయం తీసుకోవాలని అన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచాలి
కాగా, జిల్లాలోని వివిధ క్వారీల నుండి రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, మైనింగ్ అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నిఘా కొనసాగించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటదివెంట పరిష్కరించాలని హితవు పలికారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం పరిధిలో 21 అర్జీలు, జిల్లా ఆసుపత్రిలో 17, పోలీస్ శాఖలో 21, నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి 56, బోధన్ మున్సిపాలిటీలో 18, ఆర్ అండ్ బి 19, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖల్లో 11చొప్పున, డిఆర్‌డీఓలో 31, డీఈఓలో 22 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సర్ట్ఫికెట్ల జారీలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నందున, ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా వైకల్యం నిర్ధారణ అయిన వారికి వెంటనే సర్ట్ఫికెట్లు జారీ అయ్యేలా చూడాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందించాల్సిన వేతనాలు, చెల్లించాల్సిన పీఎఫ్ విషయంలో కొన్ని ఏజెన్సీల నిర్వహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

నీటి కోసం ధర్నా
మోర్తాడ్, డిసెంబర్ 11: మోర్తాడ్‌లోని భగత్‌సింగ్‌కాలనీలో ఏర్పడిన తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ధర్నా చేపట్టారు. సోమవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడి నుండి మండల కార్యాలయానికి వెళ్లి కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, భగత్‌సింగ్ కాలనీలో 100కుటుంబాలు నివసిస్తున్నాయని, 8సంవత్సరాలుగా ఒకే బోరుబావి వీరిని ఆదుకుంటోందన్నారు. ప్రస్తుతం ఆ బోరు పని చేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోందని, వెంటనే కొత్త బోరుబావి తవ్వించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీ ఏర్పడి 8సంత్సరాలు గడుస్తున్నా, మురుగునీటి కాల్వలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ మేరకు గ్రామ సచివాలయ, మండల అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐకెఎంఎస్ నాయకులు మల్లేష్, రాజు, సాయిలు, సిద్ధమ్మ, అనుష, స్వప్నతో పాటు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.