నిజామాబాద్

సాహితీవేత్తలందరూ తరలిరావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సాంస్కృతిక, సాహితీ రంగాల్లో ఆసక్తి కలిగిన వారిని తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పీ.సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. తెలుగు మహాసభల విజయవంతానికి చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. 15వ తేదీ నాటి ప్రారంభ సమావేశానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో సాహితీవేత్తలు హాజరయ్యేలా చూడాలన్నారు. మహాసభలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చే వారికి రవాణా, భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే తెలుగు పండితులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధిపతులు, పీ.హెచ్‌డీ విద్యార్థులు పాల్గొనేందుకు వీలుగా అవసరాన్ని బట్టి ఆర్టీసీ బస్సులను సమకూర్చాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కనీసం 20బస్సులు, కామారెడ్డి జిల్లా నుండి 15బస్సులు అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ ఆర్.ఎంను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే, ఆ రోజున వారికి ఓ.డీగా పరిగణిస్తామని పేర్కొన్నారు. రవాణా వసతి కోసం ఆర్టీసీ ఆర్.ఎంలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని, భోజన వసతి కోసం బడ్జెట్‌ను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. సంస్కృతిక, సాహిత్య రంగాలపై ఆసక్తి కనబర్చే వారిని గుర్తిస్తూ, తెలుగు మహాసభల్లో పాల్గొనేలా చొరవ చూపాలన్నారు. ఇందుకోసం చేపట్టే ఏర్పాట్ల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంను సంప్రదించాలని ఎస్.పీ.సింగ్ సూచించారు. కాగా, జిల్లాలో తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలను ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని, సాహితీవేత్తల నుండి మంచి స్పందన లభించిందని ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించనున్న మహాసభల్లో పాల్గొనేందుకు కూడా అనేక మంది సాహితీప్రియులు ఆసక్తితో ఉన్నారని, వారికి రవాణా, భోజన వసతిని కల్పిస్తూ హైదరాబాద్‌కు తరలించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు మహాసభల సందర్భంగా ముగ్గుల పోటీలు
ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొని అందమైన రంగవళ్లులతో తమ ప్రతిభను చాటుకున్నారు. బాలభవన్ సంగీత ఉపాధ్యాయురాలు ఉమాబాల న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. అదేవిధంగా హైస్కూల్ విద్యార్థులుకు జనరల్ నాలేడ్జ్ పోటీలు, సాయంత్రం వేళలో కవి సమ్మేళనం, సాహితీ సదస్సు నిర్వహించారు. తెలుగు భాష ప్రాముఖ్యత, గ్రంథాలయాల పాత్ర తదితర అంశాలపై కవులు పాటలు, పద్యాలు, కవితలు వినిపించారు. ఈ కార్యక్రమాల్లో ఇందూరు భారతి కార్యదర్శి ఎం.రామస్వామి, భావన సాహితీ సమితి అధ్యక్షుడు పడాల రామారావు, బీ.సీ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి గంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం కూడా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నర్సింలు తెలిపారు. హైస్కూల్ విద్యార్థులకు పద్య పఠనము, క్యారమ్స్ పోటీ, చిత్రలేఖనం, కళాశాల స్థాయి విద్యార్థులకు కవితా రచనలు, చిత్రలేఖనం పోటీలు ఉంటాయని వివరించారు.

ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
*సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్

ఆర్మూర్, డిసెంబర్ 12: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో స్పష్టత రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూర్‌లోని బాలాజీ ఫంక్షన్ హాలులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని అన్నారు. లొసుగులతో కూడిన నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో వాటిపై కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారని, తద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయి పోతున్నాయని అన్నారు. నిరుద్యోగ యువత దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై కక్షగట్టిందని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో సౌకర్యాలు కల్పించకుండా ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సొంత జాగీరులా భావించి రాచరిక పాలన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవలంభించిన విధానాలనే నేడు టీఆర్‌ఎస్ పార్టీ వేగంగా అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అందువల్లే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సామాజిక న్యాయం ఏజెండాగా త్వరలో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని, ఆకాంక్షలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి సొంత ఏజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పంటలకు ఆశించిన గిట్టుబాటు ధర లభించడం లేదని, దళారులే రాజ్యమేలుతున్నారని అన్నారు. నోట్ల రద్దును తుగ్లక్ చర్య అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత సమర్థించడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దెబ్బతిందని అన్నారు. జీఎస్టీని ప్రతిఘటించకపోవడం వల్ల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయిందని, అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్, జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్, ఎల్లయ్యలు పాల్గొన్నారు.