నిజామాబాద్

సర్పంచ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని యువకుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, డిసెంబర్ 26: నందిపేట సర్పంచ్ షాకీర్ అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు వార్డు సభ్యులు, స్థానిక యువకులు శనివారం మార్కెట్‌ను బంద్ చేయించి రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో సర్పంచ్ వర్గీయులు కూడా రోడ్డుపైకి చేరుకుని బంద్ చేయించిన దుకాణాలను తిరిగి తెరిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలకవర్గం తీర్మానం లేకుండా ఇళ్ల నిర్మాణాలకు సర్పంచ్ ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారం వెనుక పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయని, గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించారని ఇదివరకే స్థానిక యువకులు, పలువురు వార్డు మెంబర్లు ఫిర్యాదు చేయడంతో డిఎల్‌పిఓ విచారణ జరిపారు. అయితే సర్పంచ్ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైనప్పటికీ అతనిపై డిఎల్‌పిఓ శ్రీకాంత్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ యువకులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా సర్పంచ్ వర్గీయులు కూడా ప్రతినినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌ఐ జాన్‌రెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఆందోళన విరమించాలని ఇరువర్గాల వారిని కోరినా ప్రయోజనం లేకుండాపోయింది. జిల్లా అధికారులు వచ్చేంత వరకు రాస్తారోకో విరమించబోమని సర్పంచ్ వ్యతిరేక వర్గీయులు భీష్మించుకు కూర్చున్నారు. స్థానిక ఎస్‌ఐ ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించడంతో ఆర్మూర్ డిఎస్‌పి రాంరెడ్డి, భీమ్‌గల్ సిఐ రమణారెడ్డి, వేల్పూర్, బాల్కొండ ఎస్‌ఐలు కృష్ణ, స్వామిగౌడ్ అదనపు బలగాలతో నందిపేటుకు చేరుకుని ఇరువర్గాల వారిచే ఆందోళనను విరమింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అదనపు బలగాలతో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పోలీసు కవాతు నిర్వహించారు. ఇరువర్గాల వారు ఆగ్రహావేశాలతో ఊగిపోతుండడాన్ని గమనించి, ఎలాంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా ముందుజాగ్రత్త చర్యగా నందిపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి వరకు 144 సెక్షన్‌ను విధించారు. ఎవరైనా ఆంక్షలను అధిగమించి ఆందోళనలు చేపడితే బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా, సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇరువర్గాలకు చెందిన 2 0మందిపై కేసు : డిఎస్పీ రాంరెడ్డి
కాగా, ఎలాంటి అనుమతి లేకుండా నందిపేట మండల కేంద్రంలో శనివారం రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు ఇరువర్గాలకు చెందిన 20 మందిపై కేసులు నమోదు చేశామని ఆర్మూర్ డిఎస్పీ రాంరెడ్డి తెలిపారు. పరిస్థితి కుదుటపడిన మీదట ఆయన స్థానిక సర్పంచ్‌తో పాటు ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనుమతి లేకుండా ఈ తరహా ఆందోళనలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, ఇకముందు ఎవరైనా గొడవలకు దిగితే వారి పేర్లతో రౌడీషీట్లు తెరుస్తామని, పి.డి యాక్టు కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని డిఎస్పీ హెచ్చరించారు.

ముగిసిన శివనామ సప్తాహ

మద్నూర్, డిసెంబర్ 26: మండల కేంద్రంలోని బాగన్న మఠంలో కొనసాగిన శివనామ సప్తాహ శనివారం నాటితో ముగిసింది. తమ్లూర్ మహరాజ్ శివానందశివాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రతిరోజు కీర్తనలు, భజనలతో ఆధ్యాత్మికత ఉట్టిపడగా, నిర్వహకులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌సింధే హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని వీరశైవ లింగాయత్‌తో పాటు మహారాష్టల్రోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి సప్తాహలో పాల్గొన్నారు.

ఎర్రవెల్లి బయలుదేరిన మోర్తాడ్ శ్రేణులు

మోర్తాడ్, డిసెంబర్ 26: మండలంలోని టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం ఎర్రవెల్లికి తరలివెళ్లారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గడిచిన నాలుగు రోజులుగా ఎర్రవెల్లిలో అయుత మహా చండీయాగాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో చండీయాగంలో పాల్గొనడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని, దాంతోపాటుగా ఎవరూ చేయని రీతిలో తమ నేత చేస్తున్న యాగాన్ని కనులారా చూడవచ్చనే భావనతోనే తాము ఎర్రవెల్లికి వెళ్తున్నామని టిఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం తెలిపారు. ఎర్రవెల్లికి తరలివెళ్లిన వారిలో ఎంపిటిసిలు పాపాయి పవన్, మురళి, నాయకులు వడ్యాట్ మహిపాల్, దేవన్న, కె.చిన్నరాజేశ్వర్‌తోపాటు వివిధ గ్రామలకు చెందిన సీనియర్ కార్యకర్తలు ఉన్నారు.

గుల్లాలో ఘనంగా కుస్తీ పోటీలు

జుక్కల్, డిసెంబర్ 26: మండలంలోని గుల్లా గ్రామంలో దత్త జయంతి, మాణిక్‌ప్రభు జాతరను పురస్కరించుకుని శనివారం ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో మందిరంలో కన్నడ, మరాఠి, తెలుగులో సంప్రదాయంగా కీర్తనలు, భజనలు చేస్తూ ఉత్సవాలు నిర్వహించారు. శనివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా, ఎంతో ఆసక్తి కరంగా కొనసాగాయి. పది రూపాయల నుండి ఆఖరు కుస్తీ రెండు వేల రూపాయల వరకు నగదు బహుమతులను విజేతలుగా నిలిచిన మల్ల యోధులకు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సరిహద్దులోని మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు హాజరై పాల్గొన్నారు. స్థానికుల నుండి సైతం విశేష ఆదరణ లభిస్తుండడంతో గ్రామ కమిటీ వారు ఈసారి కుస్తీ పోటీల సంఖ్యను మరింతగా పెంచారు. దత్త జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులకు అన్నదానం సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మాధవరావు దేశాయ్, సర్పంచ్ సుధాకర్, నాయకులు రాజుసేట్, కిషన్, శంకర్‌శెట్కార్ పాల్గొన్నారు.

రోడ్డు పనులు పరిశీలించిన అధికారులు

జుక్కల్, డిసెంబర్ 26: జుక్కల్ నుండి జుక్కల్ చౌరస్తా వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆర్ అండ్ బి అధికారులు శనివారం పరిశీలించారు. రోడ్డు భవనాల శాఖ డిప్యూటీ ఇ.ఇ ప్రభాకర్, ఎ.ఇ సుధీర్‌కుమార్ డబుల్ రోడ్డు విస్తరణ పనులను నిశితంగా పరిశీలన జరిపి గుత్తేదారుకు పలు సూచనలు చేశారు. ఈ రోడ్డు పనుల వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా దశల వారీగా ప్రణాళికను అనుసరిస్తూ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జుక్కల్ చౌరస్తా నుండి జుక్కల్ వరకు పది కిలోమీటర్ల మేర డబుల్ లేన్ రోడ్డు పనులు చేపడుతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జుక్కల్ చౌరస్తాలో వంతెన నిర్మాణం కూడా చేపట్టనున్నందున రోడ్డు డైవర్షన్ ఏర్పాటు చేసి ఈ పనులు జరిపిస్తామని అధికారులు పేర్కొన్నారు.