నిజామాబాద్

ఎర్రజొన్న, పసుపునకు గిట్టుబాటు ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 16: ఎర్రజొన్న, పసుపు పంటలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నంపెట్టే రైతుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతులు ఎర్రజొన్నలు క్వింటాలుకు 4500రూపాయలు, పసుపు పంట క్వింటాళుకు 15వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్మూర్‌లో వేలాదిమంది రైతులు తరలివచ్చి ఆందోళన చేపడితే, ప్రభుత్వం ఎర్రజొన్నలకు క్వింటాలుకు 2300రూపాయలు ప్రకటించి, రైతులు సంబురాలు చేసుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం దళారులతో కుమ్మక్కై జొన్నలకు ధర నిర్ణయించడం రైతు వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. రాత్రింభవళ్లు కష్టపడే రైతులకు మద్దతు ధర ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతు నాయకులు ఆర్మూర్‌లో శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమైతే, ప్రభుత్వం అనుమతించకపోగా 144సెక్షన్ విధించి అర్ధరాత్రి దాటక దీక్షలను భగ్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ దుశ్చర్యను సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్నలు, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని, లేదంటే సీపీఎం రైతుల పక్షాన నిలబడి పెద్దఎత్తున ఆందోళనకు సైతం వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో సీపీఎం మాజీ కార్యదర్శి గంగధరప్పా, పల్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కోసం రైతుల రాస్తారోకో
బాల్కొండ, ఫిబ్రవరి 16: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామ రైతులు పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిపైకి చేరుకున్న రైతులు రహదారికి అడ్డంగా బైఠాయించి సుమారు 2గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మెండోరా ఎస్‌ఐ రాఘవేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎర్రజొన్నలకు 2300రూపాయల ధర ప్రకటించడం తమకు కంటితుడుపు చర్యలా అవుతుందని, ఎర్రజొన్నలకు 4500రూపాయలు, పసుపు పంటకు 15000రూపాయల మద్దతు ధర ప్రకటించే వరకు తాము శాంతియుతంగా దీక్షలు చేపడ్తామని స్పష్టం చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో నవీన్‌రెడ్డి దీక్షలు చేపట్టగా, దానిని పోలీసులు భగ్నం చేయడం శోచనీయమని, దీంతో ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు సరైన గిట్టుబాటు ధర ప్రకటించే వరకు తమ ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ రాస్తారోకోలో రైతులు నాయకులు గోపిడి గంగారెడ్డి, నోముల రవీందర్, సాయారెడ్డి, నడిపి సాయన్నతో పాటు 100మంది వరకు రైతులు పాల్గొన్నారు.

119మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించిన సీపీ
ఇందూర్, ఫిబ్రవరి 16: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తం 119మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించడం జరిగిందని కమిషనర్ కార్తికేయ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ శిక్షణ కంటే ముందే ప్రమోషన్ ఇచ్చి, వారిని వివిధ పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 116 మంది సివిల్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందడం జరిగిందన్నారు. 1992 బ్యాచ్ నుండి 1999 బ్యాచ్‌లో కొంతమంది ఉన్నారన్నారు.

ఎర్రజొన్న ధర ప్రకటనపై పునఃసమీక్షించాలి
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
ఆర్మూర్, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ ఎర్రజొన్నలకు 2300 రూపాయలు సరిపోవని, కనీసం 3 వేల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం పునః సమీక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ఎర్రజొన్నలకు వ్యాపారులు సిండికేట్‌గా మారినందున కమిటీగా ఏర్పడి ప్రభుత్వమే ఎర్రజొన్న, పసుపును కొనుగోలు చేయాలని అన్నారు. ఎంఎస్‌పీ లేని పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తే వచ్చే నష్టానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నష్టం భరిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పసుపుకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రుణాలు, రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎర్రజొన్నలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. శీథల గిడ్డంగుల నిర్మాణాలకు కేంద్రం అడ్డుపడుతోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పడం సమంజసం కాదని అన్నారు. రైతులకు విత్తన, ఇన్‌పుట్ రాయితీలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటపాటి నర్సింహం నాయుడు మాట్లాడుతూ రెండు నెలలుగా పసుపుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపించలేదని అన్నారు. ఎర్రజొన్న క్వింటాల్‌కు 2300 రూపాయల ధర ప్రకటించడం కంటితుడుపు చర్య అని అన్నారు. రైతు ప్రతినిధులతో చర్చించి ధర నిర్ణయిస్తే బాగుండేదని అన్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు ఎంఎస్‌పీ కింద కేంద్రానికి ప్రతిపాదనలు పంపించలేదని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, కౌన్సిలర్ ద్యాగ ఉదయ్, నాయకులు ఆకుల శ్రీనివాస్, పోల్కం వేణు, పూజ నరేందర్, ఆకుల రాజు, మందుల వీరబద్రీ, ప్రతాప్, కోలు చంద్రశేఖర్, వీరబద్రీ తదితరులు పాల్గొన్నారు.