నిజామాబాద్

ముగిసిన ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 14: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నాటితో ముగిశాయి. చివరిరోజున సెకండియర్ విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 17,220 మందికిగాను 624మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజర్ అయ్యారని డీఐఈఓ ఒడ్డెన్న తెలిపారు. మొదటి మూడు రోజులపాటు జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కానప్పటికీ, అనంతరం ప్రతిరోజు ముగ్గురు మొదలుకుని ఏడుగురి వరకు డిబార్‌లు అవుతూ వచ్చారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఇంటర్ వార్షిక పరీక్షలు ఈసారి కొంత కట్టుదిట్టంగానే జరిగాయి. ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విద్యార్థుల్లోనూ పరీక్షలు అయిపోయాయనే రిలీఫ్ వారి ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం నాటి పరీక్ష రాసి కేంద్రాల నుండి బయటకు వచ్చిన వెంటనే ఎంతో సంతోషంతో ప్రశ్నపత్రాలను గాల్లోకి విసురుతూ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను పిలిపించుకుని వారి వెంట ఎంతో సంతోషంగా ఇళ్లకు పయనం అయ్యారు. కాగా, చివరి రోజున సైతం కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి,పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న గదుల్లో తగినంత వెలుతురు లేకపోవడాన్ని గమనించి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుండి జరిగే పరీక్షల్లో తప్పనిసరిగా లైటింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులను ఆదేశించారు. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందు ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అక్రమాలు ఏవైనా జరిగాయా అన్నది తెలుసుకునేందుకు వీలుగా కళాశాలలోని సీ.సీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కాకతీయ హైస్కూల్‌కు ఆనుకుని ఖాళీగా ఉన్న ఓపెన్ ప్లాట్‌లో పెద్ద ఎత్తున కొబ్బరిబొండాలు ఆరబెడుతుండడాన్ని గమనించి, వీటి వల్ల అపరిశుభ్రతతో పాటు దోమలు వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉన్నందున తక్షణమే ఇతర చోటుకు తరలించేలా చూడాలన్నారు. అనంతరం శివాజీనగర్‌లోని శ్రీ నూతన వైశ్య పాఠశాలను కలెక్టర్ సందర్శించి, పదవ తరగతి పరీక్షల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసౌకర్యాలకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గదిలోనూ తగినంత లైటింగ్ ఉండేలా చూడాలని, తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని సైతం కలెక్టర్ పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగానే అందిస్తున్నారా? గుడ్లు తినని వారికి అరటి పండ్లు ఇస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల వద్ద కూడా పరిశుభ్రత ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు కలెక్టర్ హితవు పలికారు.

భగీరథ పనులను వేగవంతం చేయాలి
* కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు
నిజామాబాద్, మార్చి 14: మిషన్ భగీరథ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని, ప్రధానంగా దాహార్తి సమస్య నెలకొనేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు నీరందించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో మిషన్ భగీరథ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పనులేమిటీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు మ్యాప్‌ల సహాయంతో పనుల వివరాల గురించి కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకానికి సింగూరుతో పాటు ఎస్సారెస్పీ రిజర్వాయర్ల నీటిని వినియోగించుకునేలా పనులు జరుపుతున్నామని, పై రెండు ప్రాజెక్టులలోనూ తాగునీటి అవసరాల కోసం నీటిని నిలువ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా భగీరథ పనులను పూర్తిచేస్తే, ప్రస్తుత వేసవిలోనే దాహార్తి సమస్య నెలకొనే ప్రాంతాలకు తాగునీటిని అందించవచ్చని అన్నారు. జిల్లాలో మొత్తం 1651కిలోమీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం జరుపాల్సి ఉండగా, ఇప్పటికే 1452కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను కూడా మరింత వేగవంతంగా చేపట్టాలని సూచించారు. రైల్వే, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలు, కాల్వలు, నదుల క్రాసింగ్‌ల వద్ద పైప్‌లైన్ పనులను ఈ నెల 20వ తేదీలోగాపూర్తి చేయాలని గడువు విధించారు. ఎస్సారెస్పీ సెక్టార్‌లో మొత్తం 278 క్రాసింగ్‌లు ఉన్నట్టు తేలిందని, వీటిలో 197 చోట్ల పనులు పూర్తయినందున, మిగతా 81 క్రాసింగ్‌ల వద్ద కూడా పైప్‌లైన్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. బల్క్ వాటర్ సప్లై పనులతో పాటు ఇంటింటికి నీటి సరఫరా నిమిత్తం కుళాయి కనెక్షన్లు, ఇంట్రా విలేజ్ పనులను కూడా సకాలంలో చేపడుతూ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ రమేష్, నాగేశ్వరరావు, చౌదరిబాబు తదితరులు పాల్గొన్నారు.