నిజామాబాద్

బడ్జెట్ కేటాయింపులు ఊరటనందించేనా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 14: తెరాస ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న 2018-19 బడ్జెట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో కేటాయింపులు సంతృప్తికరంగానే ఉంటాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో ముడిపడి ఉన్న ఏయే రంగాలకు పెద్దపీట వేస్తారు, ఏ రంగాలను విస్మరిస్తారనే దానిపై ప్రజానీకంలో ఆసక్తి నెలకొని ఉంది. గత నాలుగేళ్లుగా లక్ష నుండి లక్షన్నర కోట్ల పైచిలుకు నిధులతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో నిజామాబాద్‌కు అరకొర నిధులు మాత్రమే దక్కాయన్న పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా సరైన న్యాయం జరగలేదనే అభిప్రాయాలు మెజార్టీ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుండి పూర్తి స్థాయిలో అధికార పార్టీకే చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, అత్తెసరు నిధులతోనే సరిపెట్టుకున్నారని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లోనైనా జిల్లాకు భారీగా కేటాయింపులు జరిపి ప్రజలను సంతృప్తిపరుస్తారా? లేక ఎప్పటిలాగే అరకొర నిధులతోనే సరిపెడతారా? అన్నది నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో తేటతెల్లం కానుంది. ఎప్పటిలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించినప్పటికీ, ఏయే పనులకు ఎంతమేరకు నిధులు కేటాయిస్తారో, ఏ ప్రతిపాదనలకు మొండిచేయి చూపుతారన్న సందిగ్ధత నెలకొంది. ప్రధానంగా జిల్లాలో గత దశాబ్ద కాలం క్రితం నెలకొల్పబడిన తెలంగాణ విశ్వవిద్యాలయం నిధులలేమితో కొట్టుమిట్టాడుతోంది. గతేడాది బడ్జెట్‌లో తెలంగాణ వర్శిటీకి 30కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ, ఇంతవరకు నయా పైసాను విడుదల చేయలేదు. దీంతో యూనివర్శిటీ ఆశించిన రీతిలో సత్వర అభివృద్ధిని సంతరించుకోలేకపోతోంది. బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు బడ్జెట్‌కు ముందు హామీలు ఇవ్వడం, అనంతరం అరకొర నిధులతోనే ప్రభుత్వం సరిపెడుతుండడం, కేటాయించిన మేరకు కూడా నిధులు మంజూరు కాకపోవడం ఆనవాయితీగా మారింది. అందుబాటులో ఉండే అరకొర నిధులు బోధకుల జీతభత్యాలు, తాత్కాలిక నిర్మాణాలకే సరిపోతున్నాయి. దీంతో ఈసారి బడ్జెట్‌లో తె.యుకు కనీసం వంద కోట్ల రూపాయలను కేటాయించాలన్న డిమాండ్ విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావేత్తల నుండి బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మహారాష్టక్రు పెద్ద మొత్తంలోనే నిధులను అందిస్తూ, కాల్వల నిర్మాణ పనులను వేగిరపర్చాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో కాల్వలు, లైనింగ్ పనుల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నప్పటికీ, మహారాష్ట్ర చేపట్టాల్సిన బ్యారేజీ నిర్మాణం ముందుకు సాగలేకపోతోంది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వ వాటా నిధులను చెల్లించి పనుల కోసం మహా సర్కార్‌పై మరింత ఒత్తిడి పెంచితే, మూడున్నర దశాబ్దాల నుండి పెండింగ్‌లో ఉంటున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యి జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 22వేల ఎకరాలకు సాగునీటి వసతి సమకూరుతుంది. కాళేశ్వరంగా రూపాంతరం చెందిన ప్రాణహిత-చేవేళ్ల 20, 21, 22వ ప్యాకేజీ పనులకు కూడా భారీ మొత్తంలో నిధులు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు ఇప్పటికే పెద్దఎత్తున నిధులు వెచ్చించినప్పటికీ, పనులు అస్తవ్యస్తంగా కొనసాగడం వల్ల ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుతం కనీసం మరో 100కోట్ల రూపాయలను కేటాయిస్తే తప్ప ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణ పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు సైతం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీగా నిధులను సర్దుబాటు చేయాల్సి ఉంది. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ శాఖా మంత్రిగా కొనసాగుతున్నందున సేద్యపు రంగానికి విరివిగా నిధుల కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు, వౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలు, రోడ్ల నిర్వహణ తదితర వాటికి ఏమేరకు కేటాయింపులు జరిగాయన్నది బడ్జెట్ సందర్భంగా తేటతెల్లం కానుంది.