నిజామాబాద్

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 14: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై బహిష్కరణ వేటు వేయడాన్ని నిరసిస్తూ, అధిష్ఠానం పిలుపునందుకుని గాంధీభవన్ వద్ద నిరసన దీక్షలో పాల్గొనేందుకు సమాయత్తం అయిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ, మిగతా సభ్యులందరిపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం జరిగిన వెంటనే జిల్లా వ్యాప్తంగా సీ.ఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు చాటారు. ఈ క్రమంలోనే బుధవారం భారీగానే గాంధీభవన్‌కు తరలివెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు, క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు.జిల్లా కేంద్రంలోనే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడిజిల్లాలోని దాదాపుగా అన్నిపోలీస్ ఠాణాల పరిధిలో అరెస్టులు కొనసాగాయి. బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని అన్ని పీఎస్‌లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయి కనిపించాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 500మంది పైచిలుకు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఛలో గాంధీభవన్ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ఆస్కారం ఉందని భావించి తెల్లవారుజామునే నాయకులను ముందస్తు అరెస్టు చేయడం ద్వారా నిరసన దీక్షకు వెళ్లనివ్వకుండా అడ్డుకోగలిగారు. దీంతో అరెస్టయిన కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు ఎక్కడికక్కడ ఠాణాల్లోనే బైఠాయించి నిరసనలు తెలిపారు. నేతల అరెస్టు సమాచారాన్ని తెలుసుకున్న కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలుచేసి ఆక్రోశాన్నివెళ్లగక్కారు. మధ్యాహ్నం సమయం అనంతరం నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చాటేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడం శోచనీయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ తప్పిదాలను ఎక్కడ తెరపైకి తెస్తారోననే భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి పైనా కుంటిసాకులతో సస్పెన్షన్ వేటు వేసి కేసీఆర్ సర్కార్ తన నిరంకుశ వైఖరిని చాటుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న ప్రభుత్వానికివచ్చే ఎన్నికల్లో గుణపాఠం ఖాయమన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు కల్పించినా, తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు. కాగా, బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు కంఠేశ్వర్ కమాన్, గాంధీచౌక్, నెహ్రూపార్క్, వీక్లీ మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా తదితర ముఖ్య కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి నిఘాను కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలకు ఆదేశించిన కమిషనర్ కార్తికేయ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.