నిజామాబాద్

చివరి ఆయకట్టుకు ‘సాగర్’ జలాలు ఎండమావులేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 24: తలాపున సముద్రం ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువు అన్న చందంగా తయారైంది మోర్తాడ్ మండలం దొన్కల్ రైతుల పరిస్థితి. నిజాంసాగర్ ప్రాజెక్టు జలాలు మండల శివారు గ్రామాల వరకు అందుతున్నా, చివరి ఆయకట్టుగా ఉన్న దొన్కల్‌కు మాత్రం అవి ఎండమావులే అవుతున్నాయి. చుక్క నీరు రాకపోవడంతో కనీసం పూడిక తొలగింపునకు నోచుకోని పంట కాల్వలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజాంసాగర్ జలాలు పంట కాల్వలకు విడుదల చేసినప్పటికీ, దొన్కల్ వరకు రావడం లేదని ఆయకట్టు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు ఆయకట్టు గ్రామం, దానికో డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ఆ కమిటికి గ్రామం నుండే ఓ డైరెక్టర్ ఇలా చెప్పుకోవడానికే తప్ప ఎందుకూ ఉపయోగపడని కాలువగా మారింది నిజాంసాగర్ పంట కాలువల పరిస్థితి. వరదకాలువ నిర్మాణం వల్ల దెబ్బతిన్న కాలువ నిర్మాణానికి ప్రభుత్వం అధిక మొత్తంలోనే నిధులను కేటాయించింది. ఆ నిధులతో ధోనీ కాలువ నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ప్రతీ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి ఆయకట్టు గ్రామాలకు నీటిని వదులుతున్నప్పటికీ, దొన్కల్‌కు మాత్రం చుక్క నీరు చేరడం లేదు. రైతులు ఈ సమస్యను ప్రస్తావించినప్పుడల్లా పరిష్కరిస్తామన్న హామీలే తప్ప పరిస్థితిని చక్కదిద్దిన దాఖలాలు మాత్రం లేవని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. మండలంలోని దొన్కల్ గ్రామానికి ఎలాంటి సాగునీటి వసతులు లేవు. ఉన్నదల్లా నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలే ఏకైక ఆధారం. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా దొన్కల్ గ్రామానికి ఈ కాలువల ద్వారా చుక్కనీరు కూడా అందలేదంటే అతిశయోక్తి లేదు. పంట కాలువల నిర్మాణం జరిపినప్పుడు కాలువలతో పాటు అవసరమైన ప్రదేశాలలో తూములను కూడా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఇవన్ని కాలగర్బంలో కలిసిపోతున్నాయి. వరద కాలువ నుండి గ్రామంలోని స్వర్ణపువాగు ప్రాజెక్ట్ వరకు వుండాల్సిన పంట కాలువలు పూర్తిగా అంతర్థానం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో కాలువ భూమిలో కలిసిపోయిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. దాదాపు నాలుగైదు తూములు ముళ్లపొదల్లో కనిపించకుండాపోయాయి. కనీసం వాటి చుట్టూ పేరుకుపోయిన ముళ్ల పొదలను కూడా తీయలేని పరిస్థితిలో సంబంధిత శాఖ ఉందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. తూముల కట్టడాలు కూలిపోయాయి. స్థానిక మామిడితోట వద్దనైతే తూము పూర్తిగా భూమిలో కలిసిపోయింది. ఈ తూము నుండి దాదాపు అర కిలోమీటరు మేర కాలువ కూడా భూమిలోనే కలిసిపోయింది. మిగిలిన కాలువలో పూడిక నిండిపోయి కనిపించడం లేదు. వరదకాలువ నిర్మాణానికి ముందు అంతోఇంతో నిజాంసాగర్ జలాలు గ్రామశివారు వరకైనా వచ్చేవి. తరువాత అవి కూడా ఎండమావులే అయ్యాయని రైతులు వాపోతున్నారు. గ్రామంలో అంతర్దాన దశలో వున్న డిస్ట్రిబ్యూటరీ కాలువలకు మరమ్మత్తుల యోగం కల్పిస్తే చివరి ఆయకట్టుగా వున్న దొన్కల్ గ్రామానికి నిజాంసాగర్ జలాలు అందేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా నీటి వనరులు లేక అంతర్థానం అవుతున్న స్వర్ణపువాగు ప్రాజెక్ట్‌తో పాటుగా ఎనిమిది చెరువులకు ప్రాజెక్ట్ జలాలు అంది జలకళ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.