నిజామాబాద్

ఎస్సెస్సీలో ఉత్తీర్ణత మెరుగుపడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 26: నిర్ణీత సమయానికి అనుగుణంగా పూర్తికాని సిలబస్, సర్కారీ బడులలో అరకొర వసతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సవాలక్ష సమస్యల మధ్యనే పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఏమేరకు ఫలితాలు సాధిస్తారన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. శుక్రవారం ఎస్సెస్సీ ఫలితాలు వెల్లడి కానుండడంతో అందరి దృష్టి అటువైపే కేంద్రీకృతమై ఉంది. ఈ ఏడాది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులను కలుపుకుని మొత్తం 24,658మంది పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇదివరకు ఎస్సెస్సీలో అద్వితీయ ప్రతిభతో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఇందూరు జిల్లా వరుసగా మూడు సంవత్సరాలు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. మునుముందు కూడా ఇదే ఒరవడి కొనసాగుతుందని భావించిన విద్యావేత్తలకు, గత నాలుగైదేళ్ల నుండి అంతంతమాత్రంగానే నమోదవుతున్న ఉత్తీర్ణత శాతం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. కనీసం ఈ ఏడాదైనా ఫలితాలు మెరుగుపడతాయనే ఆశాభావంతో అందరి దృష్టి ఎస్సెస్సీ రిజల్ట్స్‌పైనే కేంద్రీకృతమై ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004-05 విద్యా సంవత్సరం మొదలుకుని 2009-10 వరకు కూడా ఎస్సెస్సీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలుస్తూ వచ్చింది. 2004-05లో 24,642మంది పరీక్షలు రాయగా, 83.19శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. మరుసటి ఏడాది కూడా 27,953మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, వారిలో 23,794మంది పాస్ కావడంతో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడి 85.12శాతంతో మూడవ స్థానాన్ని కాపాడుకోగలిగింది. 2006-07లో 29,602మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 83.89శాతం ఉత్తీర్ణతను సాధించి రెండవ స్థానానికి ఎగబాకింది. అది మొదలు ఎస్సెస్సీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా ఏటేటా అగ్రతాంబూలంలోనే నిలుస్తూ వచ్చింది. 2007-08లో 89.02శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, అనంతరం కూడా వరుసగా 2008-09లో 90.56శాతం, 2009-10లో 92.65శాతం ఉత్తీర్ణతతో పదవ తరగతి ఫలితాల్లో ఇందూరు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ముందంజలో నిలుస్తూ హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పింది. అయితే 2010-11 విద్యా సంవత్సరం నుండి మాత్రం జిల్లా ప్రభ మసకబారుతూ వచ్చింది. 2010-11లో 85.26శాతం సగటు ఉత్తీర్ణతతో పదవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక 2011-12లో అయితే 84.92శాతం ఉత్తీర్ణతతో ఏకంగా 18వ స్థానానికి పడిపోయింది. 2012-13 సంవత్సరంలో మొత్తం 37,272మంది బాలబాలికలు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, వారిలో 31,568మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో 84.70శాతం సగటు ఉత్తీర్ణతతో నిజామాబాద్ జిల్లా 18వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2013-14లోనూ ఇంచుమించు అదే తరహాలో ఫలితాలు నమోదయ్యాయి. 2014-15లో 89.31శాతం సగటు ఉత్తీర్ణతను సాధించగా, 2015-16లో 82శాతం ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016-17లో 90.04శాతం ఉత్తీర్ణతను గతేడాది ఒకింతగా మెరుగుపర్చుకుని 92.29శాతంతో రాష్ట్ర స్థాయిలో ఆరవ స్థానం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడనున్న ఎస్సెస్సీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోనని అందరిలోనూ ఆదుర్దా నెలకొని ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడుతుందని, పూర్వ వైభవాన్ని చాటుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెకండరీ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి పుస్తకాలతో కుస్తీ పట్టించామని, అది తప్పనిసరిగా ఫలితాలు సానుకూలంగా వెలువడేలా చేస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తయిన సిలబస్‌కు అనుగుణంగా రోజువారీ స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ, వివిధ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా చర్యలు చేపట్టామని, పరీక్షల పట్ల విద్యార్థుల్లో నెలకొని ఉండే భయాన్ని దూరం చేసేందుకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించామని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారులు చేపట్టిన చర్యలు, అమలు చేసిన ప్రణాళికలు ఏమేరకు సత్ఫలితాలు అందించాయన్నది శుక్రవారం విడుదల కానున్న ఎస్సెస్సీ ఫలితాలతో తేటతెల్లం కానుంది.