నిజామాబాద్

నగరంలో తూతూ మంత్రంగా కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మే 22: నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమంగా వెలిసిన రేకులషెడ్లు, కోకాలు, దుకాణ సముదాయాల తొలగింపు కార్యక్రమాన్ని బల్దియా అధికారులు తూతూ మంత్రంగా చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు, పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టగా, అక్రమార్కులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో కొన్ని రోజులకే కూల్చివేసిన చోటనే మళ్లీ నిర్మాణాలు చేపట్టడం శరామాములుగా మారుతోంది. ఇటీవలే నగరంలోని ఖలీల్‌వాడిలో డ్రైనేజీ నిర్మాణాల కోసం ఆక్రమణలను కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించినా, కొద్ది రోజులకే తిరిగి ఆ ఆక్రమణలు వెలుస్తున్నాయి. ఇటీవలే నగరంలోని బస్టాండ్ ప్రాంతంలో నగర పాలక సంస్థకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. కానీ, నగరంలోని బస్టాండ్ ఎదుట గల పండ్ల దుకాణదారులు డ్రైనేజీలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నా, అటువైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కనె్నత్తి చూడకపోవడం గమనార్హం. అదేవిధంగా నగరంలోని ఏ కాలనీ చూసినా ఆక్రమణలే కనిపిస్తాయి. కొన్ని చోట్ల రోడ్ల వెంట కాలినడకన వెళ్లాలంటేనే ఇబ్బందిగా మారుతోంది. అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రోడ్లను సైతం కబ్జా చేసుకుంటుండటంతో వాహనదారులకు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్‌కు ప్రక్కన, ఎదురుగా చాలా రోజులుగా ఆక్రమణలు ఉన్నాయి. ఈ రహదారి గుండా ఆర్టీసీ బస్సులు గానీ, ఇతరాత్ర వాహనాలు వెళ్లాలన్నా చాలా కష్టంగా మారింది. దీంతో ఇదివరకు బల్దియా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. రైల్వే స్టేషన్ ఎదురుగా పోస్ట్ఫాస్ ప్రక్కనే ఉన్న షెడ్డులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగింపజేశారు. అలాగే పోస్ట్ఫాస్‌కు కొద్ది దూరంలో కొంతమంది రోడ్డును ఆక్రమించుకుని పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసుకోగా, వాటిలో కొన్నింటిని సైతం అధికారులు తొలగించడం జరిగింది. రెండున్నర సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించగా, వ్యాపారులు అడ్డుపడి, వారితో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమను దుకాణాలు వేసుకోవాలని సూచించడం జరిగిందని వ్యాపారులు చెప్పడం అధికారులకు ఆశ్చర్యానికి గురి చేసింది. అధికార పార్టీ నాయకులు సైతం వ్యాపారులకు మద్దతు పలుకుతుండటంతో ఆక్రమణల విషయంలో అధికారులు ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్తున్న సందర్భాలు సైతం చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించలేకపోతున్నామని కార్పొరేషన్‌కు చెందిన పలువురు అధికారులు నిస్సహాయతను వెలిబుచ్చుతున్నారు. నగరంలోని ఏ కాలనీలో చూసినా ఆక్రమణలే దర్శనమిస్తాయి. ముఖ్యంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు(రమాదేవి ఆసుపత్రి లైన్), ఖలీల్‌వాడీ ప్రాంతంలో మొన్నటికి మొన్న ఆక్రమణలను తొలగించారు. కొన్ని రోజులకే మళ్లీ యధాతథంగా ఆ ప్రాంతంలో తోపుడుబండ్లు దర్శనమిచ్చాయి. వీటికి తోడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా వీక్లీ మార్కెట్‌కు వెళ్లే రోడ్డును సైతం కొబ్బరిబొండాలు, వస్త్రా దుకాణదారులు ఆక్రమించుకుని తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకోవడంతో అనునిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇలా నగరంలోని అనేక ప్రాంతాలలో రోడ్లు ఆక్రమణలకు గురవుతుండటంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ జఠిలమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.