నిజామాబాద్

ఎంపీపీ దాష్టీకంపై వెల్లువెత్తిన నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 18: లక్షల రూపాయలు చెల్లించి తాను కొనుగోలు చేసిన ఇంటిని ఖాళీ చేయాలని కోరిన పాపానికి ఓ బాధిత మహిళపై అమానవీయరీతిలో దాడి చేసిన అధికార పార్టీకి చెందిన దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపీ వైఖరిని వ్యతిరేకిస్తూ పలుసంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నంవరకు ఆందోళనల తాకిడితో ఇందల్‌వాయి మండల కేంద్రం అట్టుడికింది. ప్రతిపక్ష పార్టీలు సహా ప్రజా సంఘాల నేతలు చేరుకుని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేశారు. పలువురు స్వచ్ఛందంగా దుకాణాలు మూసిఉంచగా, అక్కడక్కడా తెరిచి ఉంచిన వ్యాపార సముదాయాలను సైతం బంద్‌చేయించారు. కాంగ్రెస్, సీపీఎంలతో పాటు ఎంబీసీ, వడ్డెర జేఏసీ, గన్ను దెబ్బ తదితర సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు తరలివచ్చి స్థానికులతో కలిసి నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఎంపీపీకి, తెరాస పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఎంపీపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చాటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిజానికి బాధిత మహిళ ఒడ్డె రాజవ్వపై ఎంపీపీ గోపి ఆదివారం దాడి చేసిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజాసంఘాలు తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలకు తావులేకుండా ఆదివారం సాయంత్రం నుండే ఇందల్వాయిలో భారీ సంఖ్యలో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, శాంతిభద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. బాధితురాలికి న్యాయం జరిపించడంలో నెలల తరబడి తాత్సారం చేసిన పోలీసు అధికారులు, సోమవారం నాటి ఆందోళనల ధాటికి తలొగ్గి ఎంపీపీ ఇమ్మడి గోపీని అరెస్టు చేసి, సోమవారం రిమాండ్‌కు తరలించారు. అతనిపై మహిళ మీద దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, దూషించడం తదితర నేరాభియోగాలకు సంబంధించి ఐపీసీ 354, 323, 290, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఎంపీపీ గోపీని కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరిపించాలని వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, అధికారంలో ఉన్నామనే అహంభావంతో బడుగు వర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మహిళ అని కూడా చూడకుండా బాధితురాలిపై అమానుష రీతిలో దాడి చేసిన దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపీని తెరాస అధిష్ఠానం తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అతనిపై కఠిన చర్యల కోసం తెరాస ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 21న అన్ని సంఘాలు, అఖిలపక్ష నాయకులతో సమావేశమై పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో ఐద్వా నాయకురాలు సబ్బనిలత, వడ్డెర జేఏసీ నాయకుడు అనంతయ్య, సీపీఎం నాయకుడు పెద్ది వెంకట్రాములు, బీఎల్‌ఎఫ్ నాయకులు పాలడుగు భాస్కర్, రమేష్‌బాబు, కాంగ్రెస్ నాయకులు గుట్ట గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, జైపాల్, బీజేపీ నాయకుడు కేపీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.