నిజామాబాద్

నూతన సచివాలయాలకు పక్కా భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 23: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల ద్వారా పల్లెల్లో పాలనపరమైన వ్యవహారాలు నిర్వహించేందుకు వీలుగా సచివాలయాలకు పక్కా భవనాలు, వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో కొత్తగా 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయని వివరించారు. వీటి ద్వారా కార్యకలాపాలు కొనసాగించేందుకు భవనాలు, వౌలిక వసతులు, కనీస సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పంచాయతీ పాలవకర్గాల పదవీకాలం గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్న దరిమిలా ఆ ఏర్పాట్లను కూడా చక్కబెట్టాల్సి ఉన్నదని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పంచాయతీలకు భవనాల గుర్తింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు ఏమిటీ, వాటిని ఎలా వినియోగించుకోవాలి, సదుపాయాలేవీ లేనిపక్షంలో వాటిని సమకూర్చుకోవడం ఎలా, సచివాలయాల కోసం ప్రైవేట్ భవనాలను గుర్తిస్తే ఎలాంటి సౌకర్యాలు ఉండాలి తదితర అన్ని అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఏర్పడకుండా మొదటి నుండే పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది బదిలీలకు సంబంధించి డేటా సేకరణ, ఎన్నికలకు సిబ్బంది కేటాయింపుపై సమగ్ర వివరాలతో కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మెరుగుపడాల్సిందేనని, ఇప్పటికే ఈ విషయమై ఎంపీడీఓలకు పదేపదే చెబుతున్నా పరిస్థితిలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదన్నారు. ప్రత్యేకించి డిచ్‌పల్లి, మాక్లూర్, ఎడపల్లి, నిజామాబాద్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, నర్గట్ల మండలాల్లో సానిటేషన్ పనులు ఆశాజనకంగా లేవని కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తూ, జనావాసాల మధ్య నుండి ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత ఎంపీడీఓలను ఆదేశించారు. సానిటేషన్ పనుల పట్ల ఎవరైనా అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు సైతం వెనుకాడబోమని కలెక్టర్ కటువుగానే హెచ్చరికలు చేశారు. కాగా, జిల్లాలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం ఎంతగానో మెరుగుపడి సంతృప్తికరంగా కొనసాగుతోందన్నారు. అయితే మృతి చెందిన వారిని గుర్తించి జాబితా నుండి వారి పేర్లను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, దీనివల్ల అర్హులైన కొత్త వారికి పెన్షన్లు సత్వరమే మంజూరు చేసేందుకు వీలువుతుందన్నారు. ఈ నెలాఖరు నాటికి ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని గడువు విధించారు. కొంతమంది వేలిముద్రలు సరిపోలని కారణణంగా వారికి నెలల తరబడి పెన్షన్లు రావడం లేదని, అనంతరం అవి నిలిచిపోతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విధంగా పెన్షనర్లు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వారికి పెన్షన్లు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు విడుదలయ్యాయని, శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 2.45కోట్ల రూపాయల వేతనాలు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన హరితహారం నర్సరీ డైరెక్టరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఎఫ్‌డీఓ వేణుబాబు, డీపీఓ కృష్ణమూర్తితో పాటు జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.