నిజామాబాద్

రైతుబీమా వివరాల సేకరణలో అలసత్వం వహిస్తే.. కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 13: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి సంబంధించి అర్హులైన రైతులందరి నుండి సమగ్ర వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో అలసత్వానికి తావు కల్పించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా రైతుబీమా వివరాల సేకరణ, నమోదును పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ, స్థానికంగా మన జిల్లాలో ఈ ప్రక్రియను 16వ తేదీ నాటికే పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో శని, ఆదివారాల్లోనూ పని చేయాలని సూచించారు. ఇప్పటికే రైతుబీమా కార్యక్రమం చాలావరకు పూర్తి కావాల్సి ఉండేదని, క్షేత్ర స్థాయిలో చొరవ చూపని కారణంగా ఆలస్యం అవుతోందని కలెక్టర్ అధికారుల పనితీరుపై ఒకింత అసంతృప్తి వెళ్లగక్కారు. రైతుబంధు కింద కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులంతా బీమా పథకానికి వారి పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతు వారీగా సర్వే చేస్తూ, అర్హులైన వారి పేర్లు, ఇతర వివరాలను డేటా ఎంట్రీ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జిల్లాలో లక్షా 95వేల మందికి పట్టా పాస్‌బుక్కులు అందించగా, అందులో 1.25లక్షల మంది నిర్ణీత వయస్సుకు లోబడి ఉన్నారని, మరో 20వేల మంది కూడా వివిధ కారణాల వల్ల అనర్హులుగా పరిగణించబడుతున్నారని తెలిపారు. వీరిని మినహాయిస్తే కేవలం లక్షా 5వేల మంది రైతులకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎందుకింత జాప్యం జరుగుతోందని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఈ అలసత్వ వైఖరిని విడనాడి ఏ ఒక్క రైతు కూడా తప్పిపోకుండా ఈ నెల 16వ తేదీలోగా రైతుబీమా ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తొలివిడత పాస్‌బుక్కులు అందించిన రైతులతో పాటు రెండో విడతలో పాస్ బుక్కులు పొందిన రైతులు కూడా బీమా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబీమా వివరాల సేకరణ, నమోదులో వెనుకంజలో ఉన్న అధికారులను మండలాలవారీగా సమీక్ష జరుపుతూ వారిపై అసహనం వెళ్లగక్కారు. మండలాలు, క్లస్టర్, గ్రామాలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ఏ రోజు సేకరించిన వివరాలను అదే రోజున ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కాగా, రైతుబంధు చెక్కుల్లో పేర్లు తప్పుగా నమోదైన 1400 చెక్కులను సరిచేసి సత్వరమే సంబంధిత రైతులకు అందజేయాలన్నారు. మృతి చెందిన రైతుల వివరాలను సేకరించే బాధ్యతల్లో తహశీల్దార్లను సైతం భాగస్వామ్యం చేయాలని వ్యవసాయ అధికారులు కోరగా, ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు మార్కెట్‌కు రాకుండా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా రైతులకు అందుబాటులో ఉంటూ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సలహాలు, సూచనలు అందించాలని హితవు పలికారు. సేంద్రీయ సాగు, ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించే విధానాల గురించి అవగాహన కల్పించాలన్నారు. వర్షాలు సమృద్ధిగానే కురుస్తున్నందున హరితహారం కింద రైతులకు పెద్దఎత్తున మొక్కలు అందించి వారిచే నాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, సహాయ వ్యవసాయ సంచాలకులు వాజిద్‌హుస్సేన్, ఏ.ఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.