నిజామాబాద్

ప్రభుత్వ ఆసుపత్రి తీరు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 17: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన జిల్లా జనరల్ ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని, గర్భిణీలకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరమైతే వైద్యులే ప్రైవేటు ఆసుపత్రులకు చీటీలు రాసి పంపించడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్ర్తిలకు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అత్యావసర పరిస్థితుల్లో స్కానింగ్ అవసరమైతే ప్రభుత్వ వైద్యులే ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు, ఆసుపత్రులకు రెఫర్ చేయడం జరుగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో డాక్టర్లు, సిబ్బంది ఉండేవారు కాదని, తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల్లో కొందరు ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతుండగా, మరికొంతమంది డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడికి వచ్చే పేషెంట్లను వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్న సంఘటనలు ప్రతి రోజు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆసుపత్రిలో అవినీతి పెరిగిపోయిందని, డబ్బులు ఇచ్చిన వారికే వైద్యం అందించే పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఆర్మూర్, బోధన్ లాంటి ఏరియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉత్తమ సేవలు అందించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు
మోర్తాడ్, జూలై 17: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రతి అధికారికి నిజమైన గుర్తింపు లభిస్తుందని మోర్తాడ్ ఎంపీపీ కల్లెడ చిన్నయ్య అన్నారు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో పలు గ్రామాల నుండి బదిలీ, పదోన్నతులపై వెళ్లిన పలువురు కార్యదర్శులు, అధికారులకు మంగళవారం మండల కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి సన్మానించారు. ఎం.తిరుపతి, రమేష్, శివచరణ్, రామకృష్ణ, స్వప్న, ఇన్‌చార్జ్ ఈఓపీఆర్‌డీ కేశవనాథస్వామిలను ఎంపీపీ చిన్నయ్య పూలమాలలు, శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. పదోన్నతి పొంది మోర్తాడ్ ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను కూడా కార్యదర్శులు, ఎంపీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిన్నయ్య మాట్లాడుతూ, ఏ అధికారి అయినా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించినప్పుడే మంచి పేరు తెచ్చుకుంటారని, అలాంటి వారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి, మంచి గుర్తింపు పొందాలని ఎంపీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఇ విక్రం, ఏపీఓ శకుంతల తదితరులు పాల్గొన్నారు.