నిజామాబాద్

స్పెషలాఫీసర్ల నియామకానికి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 17: గ్రామ పంచాయతీలలో వచ్చే ఆగస్టు 1వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి స్పెషలాఫీసర్ల నియామకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయా కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీలను 252 క్లస్టర్లుగా ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించేందుకు కసరత్తులు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 126మంది సచివాలయ కార్యదర్శులు పని చేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలో 14గ్రామ పంచాయతీలను విలీనం చేయగా, అందులో 7సచివాలయాలు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నందున న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఎస్ దృష్టికి తెచ్చారు. కాగా, ప్రతీ గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని సీఎస్ జోషీ ఆదేశించారు. గెజిటెడ్ అధికారులు లేనిపక్షంలో నాన్ గెజిటెడ్ అఫికారులను సీనియారిటీ ప్రాతిపదికన నియమించవ్చని సూచించారు. గ్రామ పంచాయతీల నుండి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన వాటికి సంబంధిత మండల తహశీల్దార్‌ను కమిషనర్‌గా, ఆర్డీఓ లేదా జిల్లా స్థాయి అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. సంబంధిత నియోజకవర్గ ప్రజాప్రతినిధితో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అధికారుల నియామకం జాబితాను రెండు రోజుల్లోగా రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. కాగా, పాల డెయిరీలను బలోపేతం చేసి పాల ఉత్పత్తులను పెంచాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నందున ఈ దిశగా జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ విషయమై కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దఎత్తున ఆస్కారం ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సుమారు 3100మంది పాల ఉత్పత్తిదారులకు పాడి గేదెలను అందించాలని భావిస్తున్నామని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేసిన మీదట తదనుగుణంగా గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి వీలుగా జిల్లాలోని 680 చెరువులలో 4కోట్ల చేప పిల్లల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. వారికి ఆర్థిక సహాయంతో పాటు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఇసుక, కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీస్ శాఖ కృషి చేయాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో పోలీస్ శాఖ కూడా భాగస్వామ్యం కావాలని, అటవీ సంపదను పరిరక్షించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని హితవు పలికారు. పోస్టుమార్టం విచారణ నివేదికలు సత్వరమే వెలువడేలా కృషి చేయాలని, ఈ నివేదికలు సకాలంలో వెల్లడించని కారణంగా అనేక కేసుల విచారణ పెండింగ్‌లోనే ఉండిపోతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీ.పీ కార్తికేయ, జే.సీ రవీందర్‌రెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, డీఎఫ్‌ఓ ప్రసాద్, ఎఫ్‌డీఓ వేణుబాబు, మున్సిపల్ కమిషనర్ జాన్‌సాంసన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్
*రాబోయే రోజులు కాంగ్రెస్ పాలనవే * శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ
తాడ్వాయి, జూలై 17: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌షబ్బీర్‌అలీ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో మహాత్మగాంధీ, చాకలి ఐలమ్మల విగ్రహాలను ఆయన ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము అక్కడే ఏర్పాటు చేసిన విగ్రహాల ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్య పెడ్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి నియోజక వర్గానికి ఇద్దరు ముగ్గురికి భూమి ఇచ్చి చేతులు ఎత్తేసారని ఎద్దేవా చేశారు. రెండు పడకల గదులు మాటలకే పరిమితం అయ్యిందని, ఇలాంటి ఎన్నో పథకాలు అమలుకు నోచుకోక పోయినప్పటికీ ప్రచారంలో మాత్రం ముందున్నాయని అన్నారు. ఇకపై టీఆర్‌ఎస్ దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కేసీఆర్ గద్దెదిగే కాలం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకుంటారని అనుకుంటే, ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్లు అంటూ ప్రజలను మబ్య పెట్టి మళ్లీ ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, అల్లుడు, మామ, కొడుకు, కూతురు మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగాలు భర్తీ చేసుకుని హాయిగా ఉన్నారే తప్ప తెలంగాణ సాధనలో ముందున్న వారు మాత్రం రోడ్డుపై పడ్తున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మిషన్ కాకతీయ పేరుతో దోపిడి సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబీలోకి నెట్టేసి టీఆర్‌ఎస్ నేతలు జేబులు నింపుకుంటున్నారే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పైన పటారం లోనలోటారం అన్న చందంగా మారిందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్‌చార్జీ జాజాల సురేందర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు మదన్‌మోహన్‌రావు, సెగ్మెంట్ నాయకులు వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, పైలా కృష్ణారెడ్డి, మండల నాయకులు కందిశివరాం, వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణాగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.