నిజామాబాద్

ఉద్రిక్తతకు దారితీసిన కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 13: పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతను రాజేసింది. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం నుండి కలెక్టరేట్‌కు ప్రదర్శనగా చేరుకున్నారు. జిల్లాలో 144సెక్షన్ అమలులో ఉన్నందున కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. కలెక్టరేట్‌కు చెందిన మెయిన్ గేట్లను మూసివేసి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ర్యాలీగా వచ్చిన బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొని తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, బస్వా లక్ష్మినర్సయ్య, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు ప్రధాన ద్వారం ఎదుటే బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్‌పీ, ఇతర అనుబంధ సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు కార్యకర్తలు, యువకులను చెదరగొట్టారు. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి నాల్గవటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మినారాయణ, డీ.అరవింద్‌లు మాట్లాడుతూ, తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిని అవమానించే రీతిలో మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి, స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించడం శోచనీయమన్నారు. తక్షణమే పీ.డీ యాక్టును తొలగించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఆడబిడ్డకు అండగా కేసీఆర్
కంఠేశ్వర్, ఆగస్టు 13: రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో కల్యాణలక్ష్మి పథకం కింద 204 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి రాగానే పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని భావించిన కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మొదట 51వేల రూపాయలు అందించగా, తన సొంత ఖర్చులతో దుస్తులు సమకూరుస్తున్నానని తెలిపారు. ఈ పథకంపై హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులను వివరణ కోరగా, స్పందన బాగుందని సీఎం కేసీఆర్‌కు చెప్పడం జరిగిందన్నారు. దీంతో ఈ పథకం కింద రెండవ పర్యాయం 75,100 రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ తమను పిలిపించి వివరణ కోరగా, పేద కుటుంబాల వారు ఎంతో సంతృప్తి చెందుతున్నారని తెలుపడంతో లక్షా 116 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. దీంతో పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లల వివాహాలు సులువయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద తాను వేల సంఖ్యలో చెక్కులను పంపిణీ చేశానన్నారు. ఇక ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు పెద్దఎత్తున పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు వేయి రూపాయల జీవన భృతిని పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు.