నిజామాబాద్

ముస్తాబైన పరేడ్ గ్రౌండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం తరఫున అట్టహాసంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకలకు వేదికగా నిలువనున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పతాకావిష్కరణ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, వేడుకలను తిలకించేందుకు హాజరయ్యే సందర్శకుల కోసం పరేడ్ గ్రౌండ్‌లో షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నాటికే టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తూ, పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని చదును చేసి పంద్రాగస్టు పండుగ కోసం అన్ని విధాలుగా సిద్ధం చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో పాటు వివిధ శాఖల ప్రగతిని తెలియజేస్తూ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగించనున్నారు. వివిధ శాఖల్లో సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులను మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను బహూకరించనున్నారు. ఆయా శాఖల ప్రగతిని తెలుపుతూ హౌసింగ్, డ్వామా, వ్యవసాయ, పశు సంవర్ధక తదితర శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు. అన్నింటికి మించి పంద్రాగస్టు వేడుకలకు వారం రోజుల ముందు నుండే చిన్నారుల హడావుడి నెలకొంది. పరేడ్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఆయా పాఠశాలలకు చెందిన చిన్నారులు గత రెండుమూడు రోజుల నుండి ఉదయం, సాయంత్రం వేళల్లో పరేడ్‌గ్రౌండ్ మైదానానికి హాజరవుతూ రిహార్సల్స్ కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా, మంత్రి పోచారంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా, త్రివర్ణ పతాకాలు, మువ్వనె్నల జెండాలను సమకూర్చుకునేందుకు చిన్నారులు, ఆయా విద్యా సంస్థలు, వివిధ సంఘాల వారు బుక్‌స్టాళ్లు, జనరల్ స్టోర్ల వద్ద బారులు తీరారు.

బీమాతో రైతుకు ధీమా
నందిపేట, ఆగస్టు 14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంతో అన్నదాతలకు ఎంతో ధీమా ఏర్పడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నందిపేట మండలంలోని రత్నాపూర్, తొండాకూర్, శాపూర్, నందిపేట, ఐలాపూర్ గ్రామాల్లో మంగళవారం రైతులకు ఆయన బీమా బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఐలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు మృతి చెందితే, బీమా పథకం కింద బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందుతుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 21వేల మంది రైతులకు ఉచిత బీమా వర్తింపజేయడం జరిగిందని, మరో 24వేల మంది రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మీసాల సుదర్శన్, ఆయా గ్రామాల తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బీజేపీ శ్రేణుల సంబురాలు
కంఠేశ్వర్, ఆగస్టు 14: శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై పోలీసులు విధించిన నగర బహిష్కరణపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ, పరస్పరం మిఠాయిలు తినిపించుకుని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణలు మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టు తీర్పు తెరాస ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు హైదరాబాద్‌కు శ్రీపరిపూర్ణానంద వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే నెపంతో తెరాస ప్రభుత్వం ఆయనపై నగర బహిష్కరణ వేటు వేయించడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు అండగా నిలుస్తూ, హిందువులను అణగదొక్కాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎంఐఎంకు చెందిన ఒవైసీ సోదరులు హిందువులను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వారిపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, దాడులకు పాల్పడినా ఇంతవరకు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదన్నారు. హిందువులు మాత్రం తమ మనోభావాలు తెలియజేసేందుకు వస్తే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండాపోయిందని, పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. పోలీసులచే ఉద్యమాలను అణగదొక్కాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ వైఖరికి తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లేష్‌యాదవ్, గంగోని గంగాధర్, బీజేవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్ బొహ్రా, కరిపె రాజు తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లిలో....
డిచ్‌పల్లి రూరల్: కాగా, పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు విధించిన నగర బహిష్కరణ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ డిచ్‌పల్లిలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. రూరల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి గడ్డం ఆనంద్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచి పెట్టారు. పరిపూర్ణానంద స్వామిపై అప్రజాస్వామికంగా మోపిన నగర బహిష్కరణ వేటుపై హైకోర్టు స్టే విధించడం ప్రతి ఒక్కరికి ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. హిందువుల మనోభావాలను తెలిపేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిపై తెరాస ప్రభుత్వం కావాలనే పోలీసులచే పీ.డీ యాక్టును అమలు చేయించిందని ఆయన ఆరోపించారు.

సెగ్మెంట్‌ల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు నిర్మించడం ప్రథమం
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, ఆగస్టు 14: దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న ఆలోచన సీఎం. కేసీఆర్‌కు రావడం గొప్ప విషయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం అంటే ఒక ప్రభుత్వ కార్యాలయం అని అన్నారు. స్థానిక సమస్యలు ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు ప్రజలు విన్నవించుకునేందుకు ఒక వేదికే ఈ కార్యాలయం అని అన్నారు. జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. దేశంలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అన్నారు. 83 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు నీటిని తరలించి, నాగమడుగు ప్రాజెక్ట్ ద్వారా కరువుపీడిత ఈప్రాంతానికి సాగునీరు అందించి భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. దేశంలో రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయలు ఇస్తున్న రైతుకు 5 లక్షల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆగస్టు 15 నుండి ప్రజల్లో దృష్టిలోపం లేకుండా చేయడానికి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరు కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేసుకోవాలని, అవసరం ఉన్న వారికి 600 రూపాయల విలువైన కంటి అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చి దృష్టిలోపం లేకుండా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ. బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్‌షిండేతో పాటు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.