క్రైమ్/లీగల్

సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 16: లైంగిక వేధింపుల ఆరోపణలపై జ్యుడీషియల్ రిమాండ్ కింద జిల్లా జైలులో కాలం వెళ్లదీస్తున్న నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసును విచారణ జరుపుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం జడ్జి రమేష్, ఈ నెల 20వ తేదీన బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరైన సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, అదే రోజున అర్ధరాత్రి సమయంలో జడ్జి ఎదుట ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తరఫు న్యాయవాదులు జీవీ.కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేష్‌లు 13వ తేదీన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరుసటి రోజు ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించగా, పోలీసులు రిమాండ్ డైరీ సమర్పించని కారణంగా మరికొంత గడువు ఇవ్వాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశికిరణ్‌రెడ్డి అభ్యర్థించడంతో 16వ తేదీ నాటికి విచారణను వాయిదా వేశారు. ఇందులో భాగంగానే గురువారం సదరు న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సందర్భంగా అటు సంజయ్ తరఫు న్యాయవాదులు, ఇటు అదనపు పీ.పీ కూడా గట్టిగానే తమ వాదనలను వినిపించారు. తమ క్లయింట్‌పై మోపిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని, రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే అనవసర నిందలు మోపారని సంజయ్ తరఫు న్యాయవాదులు వాదించారు. సీఆర్‌పీసీ 41(ఏ) సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన మీదట తనంతట తానే విచారణకు హాజరైన తమ క్లయింట్‌ను పోలీసులు విచారణ ముగిసిన మీదట తిరిగి పంపించకుండా అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని ఆక్షేపించారు. సంజయ్‌పై నమోదైన ఆయా సెక్షన్‌లకు సంబంధించి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని, ఏడేళ్ల లోపు జైలు శిక్షతో కూడిన నేరారోపణ కేసుల్లో స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ తమ క్లయింట్‌కు మాత్రం బెయిల్ ఇవ్వకుండా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని, ఈ వైఖరిని బట్టి చూస్తే కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోందని బలంగా తమ వాదనలను వినిపించారు. మరోవైపు అదనపు పీ.పీ శశికిరణ్‌రెడ్డి కూడా సంజయ్ నేరారోపణలపై ఆయనకు వ్యతిరేకంగా గట్టిగానే వాదించినట్టు తెలిసింది. రాజకీయ పలుకుబడి కలిగి ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు ఆస్కారం ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని జడ్జిని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు.