క్రైమ్/లీగల్

నందిపేటలో గ్యాస్ సిలిండర్లు పేలి నాలుగు దుకాణాలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, సెప్టెంబర్ 4: నందిపేట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై గల ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ సిలెండర్ ఫిల్లింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించి, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాయంత్రం సమయంలో లింబాద్రి అనే వ్యక్తి తన దుకాణంలో 15కిలోలు ఉండే డొమెస్టిక్ సిలెండర్ నుండి 5కిలోల మినీ గ్యాస్ సిలెండర్‌లో ఫిల్లింగ్ చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. దుకాణానికి మంటలు అంటుకుని అందులో ఉన్న మిగతా ఎల్‌పీజీ సిలెండర్లు సైతం పేలాయి. దీంతో మంటలు భారీగా వ్యాపిస్తూ ఈ దుకాణానికి ఆనుకుని ఉన్న రాంబాబు అనే వ్యక్తికి చెందిన క్రిమిసంహారక మందు దుకాణం, నారాయణకు చెందిన కిరాణ దుకాణం, ఎండీ.జలాల్‌కు చెందిన వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకుని దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న స్థానికులు వందలాది మంది చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మధ్యమధ్యలో సిలెండర్లు భారీ శబ్దాలు చేస్తూ పేలడంతో దూరంగా పరుగులు పెట్టారు. కళ్లెదుటే దుకాణాలు కాలిపోతున్నప్పటికీ, అగ్నికీలలు ఎగిసిపడడంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చూస్తుండిపోయారు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని రప్పించి, ఇతర దుకాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కోకాలలో కొనసాగుతున్న దుకాణాలను పక్కకు తరలింపజేశారు. దీంతో అవి అగ్ని ప్రమాదం బారి నుండి కాపాడబడ్డాయి. ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కోటిగా దుకాణాలు కాలిపోతుండడాన్ని గమనించిన దుకాణదారులు తమ దుకాణంలోని సామాన్లను కాపాడుకునేందుకు రోడ్లపై తెచ్చి ఉంచారు. అప్పటికే స్థానికులు ఆర్మూర్, నిజామాబాద్ ఫైరింజన్‌లకు సమాచారం అందించడంతో ఆరున్నర గంటల సమయంలో ఆర్మూర్ అగ్నిమాపక శకటం నందిపేటకు చేరుకుని మంటలను అదుపు చేయడంలో నిమగ్నమైంది. రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మంటలను పూర్తిగా ఆర్పివేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ నుండి కూడా ఫైరింజన్ చేసుకుని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ స్థలంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకోవడం ఇది రెండవసారి. మెయిన్ రోడ్‌పై గత చాలాకాలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ దందా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు ఈ అక్రమ గ్యాస్ దందాపై దృష్టిసారించాలని కోరారు. కాగా, నాలుగు దుకాణాలు, అందులోని సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారడంతో భారీ మొత్తంలోనే ఆస్తినష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధికారులు పంచనామా నిర్వహించిన మీదట ఆస్తినష్టాన్ని పక్కాగా నిర్ధారించనున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.