నిజామాబాద్

పైకి హంగామా.. లోలోపల అంతర్మథనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 16: పరిస్థితి అంతా తమకే అనుకూలంగా ఉందంటూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆయా సెగ్మెంట్లలో నెలకొని ఉన్న ప్రతికూలతలను చూసి లోలోపల అంతర్మథనం చెందుతున్నారని స్పష్టమవుతోంది. ఫలితంగానే మునుపెన్నడూ లేని రీతిలో ప్రచార పర్వంలో చెమటోడుస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో అమలైన వాటిని పదేపదే ప్రస్తావిస్తూ, అమలుకాని హామీలను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఒకటిరెండు సెగ్మెంట్లను మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ తాజామాజీల గెలుపు నల్లేరుపై నడ కేం కాదని స్థానిక పరిస్థితులు చాటుతున్నాయి. ప్రతికూలతలు తెరపైకి రాకుండా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు తెరాస అభ్యర్థులు హంగు, ఆర్భాటాలతో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న నాయకులు, సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఆయా కుల సంఘాల బాధ్యులు, చోటామోటా గల్లీ లీడర్లతో భేటీ అవుతూ వారిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. వాస్తవంగానే పరిస్థితులు అనుకూలంగా ఉంటే తెరాస అభ్యర్థులు ఇంతటి తీవ్ర స్థాయిలో కష్టపడాల్సిన పనే ఉండదని, ప్రతికూల పరిస్థితులతో ఎక్కడ నష్టం వాటిల్లుతుందోననే భయంతోనే అన్ని రకాలుగా శ్రమిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పలు సెగ్మెంట్లలో మహాకూటమి అభ్యర్థులు ఎవరనేది ఇంకా స్పష్టం కానప్పటికీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు ముందస్తుగానే ప్రచారపర్వంలో తుదికంటా తమ శక్తియుక్తులను ధారపోస్తున్నా రు. ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ సెగ్మెంట్‌లో గడిచిన వారంపది రోజుల నుండి సుడిగాలి పర్యటనలు జరుపుతూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయా మండలాల వారీగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీల్లో పాల్గొంటూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నారు. మహాకూటమి తరఫున ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారన్నది స్పష్టత రాకముందే పోచారం ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఇదే తరహాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ తెరాస అభ్యర్థుల హంగామా కనిపిస్తోంది. ఇక బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ సెగ్మెంట్ల నుండి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ ఆకుల లలితలు తమకే అభ్యర్థిత్వం ఖాయమనే ధీమాతో ప్రచారానికి శ్రీకారం చుట్టగా, వారికి దీటుగా తెరాస అభ్యర్థులు మరింత ఎక్కువ మోతాదులోనే హంగు ఆర్భాటాలతో ప్రచారంలో పై చేయిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని నూటికి నూరు శాతం విజయాలను నమోదు చేసిన తెరాసకు, ప్రస్తుతం తిరిగి అదే ఫీటును పునరావృతం చేయడం అంత సునాయాసం కాదని గులాబీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోం ది. ఈ నేపథ్యంలో ప్రతికూలతను అధిగమిస్తూ, ఎన్నికల నాటికి పరిస్థితులు అనుకూలంగా మల్చుకోవాలనే తాపత్రయంతో తెరాస అభ్యర్థులు ప్రచారబరిలో చెమటోడుస్తున్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గద్దల పాలు కావద్దు
* మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 16: అనేక ఆశయాలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కాకులు, గద్దల పాలు కావద్దనే సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతు ప్రకటిస్తున్నారని రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తమకు నచ్చిన తెరాస పాలననే తిరిగి తెచ్చుకోవాలనే సంకల్పం ప్రజల నుండి స్పష్టంగా వ్యక్తమవుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై, టీఆర్‌ఎస్ పార్టీ పనితీరుపై ప్రజల్లో అడుగడుగునా ఎనలేని నమ్మకం కనిపిస్తోందని, అందుకే తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పోచారం పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పోచారం పాల్గొన్నారు. కురుమ సంఘం ప్రతినిధులతో కలిసి డప్పు వాయిస్తూ, బుర్ర కథ కళాకారులతో కలిసి తంబూరా మీటుతూ పోచారం వారిని అలరింపజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ వెంటే ఉంటామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతుండడం అభినందనీయమని అన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో నెలకొని ఉన్న అచంచల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొని ఉండేవని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలు, కుల వృత్తులపై ఆధారపడిన వారు బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్న దైన్యస్థితి నెలకొని ఉండేదన్నారు. దీనిని గమనించిన తెరాస ప్రభుత్వం సాగు రంగాన్ని బాగు చేయడంతో పాటు, కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఆనాడే గుర్తించి ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టడం ద్వారా పరిస్థితులను మెరుగుపర్చిందని గుర్తు చేశారు. గొల్లకుర్మ యాదవులు గొర్రెలు పెంచుకునేందుకు ప్రతీ లబ్ధిదారుడికి 75శాతం సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొటేలును అందిస్తున్నామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 7.20లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని వివరించారు. రాష్ట్రంలో గొర్రెల సంపద రెండింతలు కావాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది 3.60లక్షల మందికి 64లక్షల గొర్రెలు అందించామని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 19,800మంది, కామారెడ్డి జిల్లాలో 17,600మంది లబ్ధిదారులను గుర్తించి, తొలి విడతగా యాభై శాతం మందికి గొర్రెల యూనిట్లు అందించామని తెలిపారు. గొల్లకుర్మలు, యాదవులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని, సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తామని అన్నారు.