నిజామాబాద్

కేంద్రం నిధులతోనే సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మే 16: రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతోందని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడు, బిజెపి రాష్ట్ర నాయకుడు బద్దం లింగారెడ్డి అన్నారు. మిగులు బడ్జెట్ కలిగి ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని ఆరోపించారు. దక్షిణ మధ్య రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడిగా నూతనంగా ఎంపికైన బద్దం లింగారెడ్డితో పాటు జిల్లా టెలికాం సలహా మండలి సభ్యుడిగా నియమితులైన పుప్పాల శివరాజ్‌కుమార్‌లను బిజెపి మండల నాయకులు మోర్తాడ్‌లో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లింగారెడ్డి మాట్లాడుతూ, రైల్వే శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరీ చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టులకు అనుమతించకుండా పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తి చేసేందుకే చర్యలు చేపడుతోందన్నారు. మాజీ ప్రధాని పివి.నర్సింహారావు ఆధ్వర్యంలో ప్రారంభానికి నోచుకున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్‌ను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయిస్తామన్నారు. ఇప్పటికే ఈ పథకానికి 136కోట్లు కేటాయించిన కేంద్రం అదనంగా మరో 40కోట్లు కేటాయించిందని తెలిపారు. పథకం పూర్తయితే రవాణా వ్యవస్థ పెరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నూతనంగా ప్రతిపాదించిన ఆర్మూర్-ఆదిలాబాద్, నిజామాబాద్-బీదర్ రైల్వేలైన్లను కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరీ చేయిస్తానని అన్నారు. రాష్ట్రంలోని తెరాస సర్కార్ ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగిస్తోందని ఆరోపించారు. డబుల్‌బెడ్‌రూమ్‌ల పథకానికి కేంద్రం ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా 50వేల రూపాయల వంతున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ శివార్లలో 450ఇండ్లను మాత్రమే నిర్మించి, వాటిని చూపే ప్రజలను మభ్యపెడుతోందే తప్పా, గడిచిన రెండేళ్లలో ఒక్క గ్రామంలో కూడా ఇండ్ల నిర్మించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని సగంమంది ప్రజలు ఈ పథకానికి అర్హులేనని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి హామీని ఎండమావులు చేస్తున్నారని, 50ఏళ్ల నాటికి పూర్తయ్యే కార్యక్రమాలను కూడా ఇప్పుడే చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రజలను మధ్యపెడుతోందని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తించిన ఎంపి కవిత, ఈ బోర్డు తమవల్లే ఏర్పడుతోందన్న నమ్మకాన్ని కలిగించేందుకు ఎమ్మెల్యేలను, రైతులను వెంటబెట్టుకుని ఢిల్లీబాట పట్టిందన్నారు. వాస్తవానికి పసుపు బోర్డు వాణిజ్య మంత్రి పరిధిలో ఉంటే, వీరేమో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మాట్లాడారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని, పోగాకు బోర్డుతో లాభాలు లేవని గుర్తించిన సర్కార్, పసుపు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. త్వరలోనే ఆర్మూర్‌లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించి, పసుపు రైతుల సదస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేల్పూర్‌లో ఏర్పాటు చేయదల్చిన స్పైసెస్ పార్కుకు కూడా కేంద్రం 25కోట్లు కేటాయిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా చూడాలని హితవు పలికారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నోముల ముత్యంరెడ్డి, ముత్యాల మనోహర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, బోగ దేవేందర్, ఒల్లెం సంతోష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్, రాజేందర్‌గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.