నిజామాబాద్

పోలింగ్‌కు వేళాయె..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 6: ప్రధాన రాజకీయ పక్షాలన్నీ హోరాహోరీగా తలపడిన శాసన సభ ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ఘట్టానికి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గడిచిన రెండు నెలల నుండి అభ్యర్థుల ఊకదంపుడు ప్రచారాన్ని ఆలకించడానికే పరిమితమైన ఓటర్లు తమ తీర్పుతో అభ్యర్థుల భవితవ్యాన్ని శుక్రవారం పోలింగ్ సందర్భంగా నిర్దేశించనున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్ జిల్లా యంత్రాంగం నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సైతం చక్కబెడుతోంది. ఈ సెగ్మెంట్‌లోని మూడు మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎలక్షన్ కమిషన్ ఇందూరు జిల్లా యంత్రాంగానికే అప్పగించింది. కామారెడ్డి జిల్లా యంత్రాంగం కామారెడ్డితో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17,75,837మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లో 2,41,438మంది, రూరల్‌లో 2,18,423, బాన్సువాడలో 1,73,230, ఆర్మూర్‌లో 1,77,446, బోధన్‌లో 1,95,206, బాల్కొండలో 1,94,242, కామారెడ్డిలో 2,04,380, ఎల్లారెడ్డిలో 1,94,596, జుక్కల్‌లో 1,76,876మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే వీరంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు స్లిప్పులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ త్రిముఖ పోటీ నెలకొని ఉన్నప్పటికీ, తెరాస అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తాజామాజీలకు, కాంగ్రెస్ అభ్యర్థులకు మధ్యే హోరాహోరీ పోరు నెలకొని ఉంది. ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ(కాంగ్రెస్), గంప గోవర్ధన్(టీఆర్‌ఎస్), వెంకటరమణారెడ్డి(బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగగా, నిజామాబాద్ అర్బన్‌లో బిగాల గణేష్‌గుప్తా(టీఆర్‌ఎస్), తాహెర్‌బిన్ హందాన్(కాంగ్రెస్), యెండల లక్ష్మినారాయణ(బీజేపీ)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్(టీఆర్‌ఎస్), ఎమ్మెల్సీ భూపతిరెడ్డి(కాంగ్రెస్), గడ్డం ఆనంద్‌రెడ్డి(బీజేపీ)లు నువ్వానేనా అన్న రీతిలో ప్రచార బరిలో తలపడగా, ఆర్మూర్‌లో ఆకుల లలిత(కాంగ్రెస్), ఆశన్నగారి జీవన్‌రెడ్డి(టీఆర్‌ఎస్), వినయ్‌రెడ్డి(బీజేపీ)ల మధ్య త్రిముఖ పోరు కొనసాగింది. బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి(టీఆర్‌ఎస్), ఈరవత్రి అనిల్(కాంగ్రెస్)ల మధ్య పోటీ నెలకొని ఉండగా, బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి(కాంగ్రెస్), షకీల్ ఆమిర్(టీఆర్‌ఎస్)లు పై చేయిని చాటుకునేందుకు ఎవరికివారు తాపత్రయం కనబర్చారు. బాన్సువాడలో ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(టీఆర్‌ఎస్), కాసుల బాల్‌రాజ్(కాంగ్రెస్)లు పోటీపడ్డారు. జుక్కల్‌లో హన్మంత్‌సింధే(టీఆర్‌ఎస్), సౌదాగర్ గంగారాం(కాంగ్రెస్), అరుణతార(బీజేపీ)లు బరిలో ఉండగా, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్‌రెడ్డి(కాంగ్రెస్), ఏనుగు రవీందర్‌రెడ్డి(టీఆర్‌ఎస్)లు ఎవరికివారు గెలుపుపై ధీమాతో ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఎవరెంత వరకు ఓటర్లను ఆకర్షించగలిగారన్నది నేటి పోలింగ్ సరళితో ఒకింత అవగాహన ఏర్పడనుంది. కాగా, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యామ్‌లతో పాటు అందరి కదలికలను పరిశీలించేందుకు వీలుగా వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1433పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 348కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో మొత్తం 740పోలింగ్ స్టేషన్లకు గాను 188కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఎన్నికల నిర్వహణ కోసం 6880మంది ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికే సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుని వివిధ వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు మధ్య తరలివెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కటుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరి బలగాలు జిల్లాకు వారం రోజుల ముందుగానే చేరుకుని శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతల్లో నిమగ్నమయ్యాయి. టాస్క్ఫోర్స్ బృందాలతో పాటు పెట్రోలింగ్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కనీసం 10 నుండి 15మంది వరకు సాయుధ సిబ్బంది పహారా ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అల్లర్లు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు సంబంధించి సిబ్బందికి దశల వారీగా శిక్షణ ఇచ్చి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రత్యేకించి ఈసారి కొత్తగా ఈవీఎంలకు అనుసంధానంగా ప్రవేశపెడుతున్న వీవీ.ప్యాట్ల పనితీరు గురించి ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందితో పాటు అటు ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించారు.