నిజామాబాద్

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 1: ఆంగ్ల నామాది నూతన సంవత్సరానికి కోటి ఆశలతో ఇందూరు ప్రజలు స్వాగతం పలికారు. విభిన్న అనుభూతులతో ముగిసిపోయిన 2018 పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షిస్తూ ‘2019’ని సాదరంగా ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం నుండి మొదలుకుని అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా జిల్లా అంతటా ఎటుచూసినా న్యూ ఇయర్ సంబరాలు కొనసాగాయి. 10డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా నూతన సంవత్సర వేడుకలతో సందడి చేశారు. పట్టణ ప్రాంతాల్లోనైతే యువత హడావుడికి అంతే లేకుండాపోయింది. కొత్త సంవత్సరం వేడుకలకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు సరిగ్గా రాత్రి 12గంటలు కాగానే రోడ్లపైకి చేరుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎక్కడికక్కడ బాణాసంచా పేలుళ్లతో వీధులన్నీ దద్దరిల్లాయి. యువకులు బృందాలుగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో కొంతమంది విచ్చలవిడిగా మద్యం సేవించి, ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ బైక్‌లు అదుపుతప్పి చిన్నచిన్న ప్రమాదాలకు లోనయ్యారు. హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లోనూ నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. యువతీ, యువకులు ఎవరికి వారు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించి బృందాలుగా ఏర్పడి ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో మునిగితేలారు. డీజేలు, సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని సినీ గేయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకను ఆస్వాదించారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. తమతమ హోటళ్ల ముందు స్టేజీలను ఏర్పాటు చేసి, వాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో ఎంతో సుందరంగా అలంకరించి ఆర్కెస్ట్రా బృందాలతో యువతను ఆకర్షించారు. మరికొంత మంది 2019వ సంవత్సరానికి నాంది పలుకుతూ పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలకు ఊపు తెచ్చారు. ధాబాలు మొదలుకుని హోటళ్లు, స్వీట్‌షాపులు, బేకరీలు, పూల బొకేల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. అనేక మంది కేకులు, మిఠాయిలు కొని కుటుంబ సభ్యులు, బంధువుల సందడి నడుమ వేడుక నిర్వహించుకున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపార వర్గాల వారు ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మంచి పనులను తలపెడితే, ఏడాది కాలమంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొంత మంది ప్రతీఏటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ, తమ స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి షిరిడీ, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తూ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బృందాలను నియమించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కాగా, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సతీసమేతంగా బాలసదన్‌లో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆయనను చాంబర్‌లో కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి పోలీసు అధికారులతో కలిసి కేక్ కట్ చేసి న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జిల్లా జడ్జి సుజనను న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మారుతినగర్‌లో గల స్నేహా సొసైటీలో మానసిక, వికలాంగ బాలల మధ్య పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి వారికి ఆహ్లాదాన్ని పంచిపెట్టారు.

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా
పల్లెల్లో మరింతగా వేడెక్కనున్న కోలాహలం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 1: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ముందుగా గ్రామ పంచాయతీల ఎన్నికలతో స్థానిక సమరానికి శ్రీకారం చుడుతున్నారు. పంచాయతీ పోరుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ (ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వచ్చింది. కాగా, ఈ.సీ వెలువరించిన ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మరింతగా వేడెక్కనుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలకు నూతన కార్యవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల వాయిదాపడింది. ప్రస్తుతం అవరోధాలను అధిగమిస్తూ పల్లె సమరానికి ముహూర్తం ఖరారైన దరిమిలా, ఆశావహులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తాము కోరుకున్నట్టుగానే అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన చోట అభ్యర్థులు గత కొన్ని రోజుల నుండే ఒకింత హడావుడి చేస్తుండగా, రిజర్వేషన్లు అనుకూలించని అభ్యర్థులు మహిళలకు కేటాయించబడిన స్థానాల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలనే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 530గ్రామ పంచాయితీలు, 4932 వార్డు స్థానాలు ఉండగా, మొదటి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177సర్పంచ్‌లు, 1746వార్డు స్థానాలకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం 21వ తేదీన పోలింగ్ జరుపనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్‌ను నిర్వహించిన మీదట, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికైన వార్డు సభ్యులలో ఒకరిని చేతులెత్తే పద్ధతి ద్వారా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండవ విడతగా బోధన్ డివిజన్‌లోని 142గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, 1296 వార్డు స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కానుంది. 25వ తేదీన పోలింగ్ నిర్వహించి ఫలితాలను తేటతెల్లం చేయనున్నారు. చివరి విడతగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 211 గ్రామ పంచాయతీలు, 1890 వార్డు స్థానాలకు 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, 30వ తేదీన పోలింగ్, కౌంటింగ్‌ల పర్వంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ముగింపు పలుకనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ పోరుకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేసుకోవడం, ఓటరు జాబితా పరిశీలన, దాని ఆధారంగా సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉంది. జిల్లా వ్యాప్తంగా 7424 వార్డు స్థానాలుండగా, 7444 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 3వ తేదీన శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవడం తదితర ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు జిల్లా యంత్రాంగం పేర్కొంది. మరోవైపు ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నడుమ నిర్వహించేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ఇదిలాఉండగా, పంచాయితీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పకడ్బందీగా పావులు కదుపుతున్నాయి. తమతమ పార్టీల మద్దతుదారులను బరిలోకి దించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో అనుకూల వర్గానికి చెందిన వారు పదవుల్లో ఉంటే, పార్లమెంటు ఎన్నికల్లోనూ వారి తోడ్పాటుతో పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయమై కసరత్తులను ముమ్మరం చేయనున్నారు.

విదేశీ వలస పక్షిని కాపాడిన యువకులు
ఎల్లారెడ్డి, జనవరి 1: గగన తలంలో స్వేచ్ఛగా విహరిస్తూ...ఎతె్తైన నీలగిరి చెట్టుకు చుట్టుకుని ఉన్న గాలిపటం దారంకు చిక్కుకుని గాయపడిన విదేశ వలసపక్షిని (కొంగజాతికి చెందిన) రక్షించిన సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోచోటు చేసుకుంది. విదేశ వలస పక్షిని రక్షించిన యువకులు అనిల్, మణికంఠల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం స్థానిక పోస్ట్ఫాస్ ఆవరణంలోగల ఎతె్తైన నీలగిరి వృక్షంపై ఎదోపక్షి వేళాడుతన్నట్లు గుర్తించిన ఈ ఇద్దరు యువకులు పక్షిని రక్షించేందుకోసం దాదాపుగా గంటన్నర పాటు ప్రయత్నించారు. ఈలోగా ఫైర్, మున్సిపల్, అటవీశాఖ వారికి సమాచారం అందించగా. అంత ఎతె్తైన నిచ్చెన అందుబాటులో లేక పోవడంతోయువకులు యుక్తిగా దారానికి రాయిని కట్టి పక్షిరెక్కల్లో దారం ఇరుక్కుని వేళాడుతున్న పైబాగంలోరాయిని కట్టిన దారంతోపైకి విసిరి చివరకు పక్షిని సురక్షితంగా కిందికి దించారు. ఈలోగా పక్షి రెక్కల బాగంలో స్వల్పంగాగాయం కాగా యువకులు పక్షిని అటవీశాఖాధికారులకు అప్పగించగా, ఫారెస్ట్ డీఎఫ్‌ఆర్‌ఓ కృష్ణం రాజు, సిబ్బందితోకలిసి పక్షికి ప్రాథమిక చికిత్సలు అందజేసిన అనంతరం పక్షిని స్థానిక పెద్ద చెరువుప్రాంతంలోవదిలి వేయడం జరిగిందన్నారు. కొంగజాతికి చెందిన విదేశ వలస పక్షి (రెడ్‌నాప్‌డ్ ఐబీస్, సెడిబీస్ పాపిల్లోసా) ఐ ఉంటుందని డీఎఫ్‌ఆర్‌ఓ పేర్కొన్నారు. విదేశ వలస పక్షిని సమయస్ఫూర్థితోరక్షించిన యుకులకు అటవీ సిబ్బందితోపాటు స్థానికులు అభినందించారు.

కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
కామారెడ్డి, జనవరి 1: కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలను లకలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ దంపతులు, జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డితో పాటు జిల్లా కలెక్టరేట్‌లోని అధికారులు, ఉద్యోగ సిబ్బందితో పాటు చిన్నారి పిల్లల నడుమ ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పెద్దకేక్‌ను కలెక్టర్, ఎస్పీలు కలిసి కట్ చేశారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారి పిల్లలకు కలెక్టర్, ఎస్పీలు కలిసి కేక్ తినిపించడంతో పాటు తోటి ఉద్యోగులకు, అధికారులకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కలెక్టరేట్‌లోని అధికారులు, పట్టణంలోని పలుసంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, కలెక్టర్‌కు పూలచెట్లతో పాటు జ్ఞాపికలను అందచేస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ, నూతన 2019 సంవత్సరం అందరికీ శుభాలు కలుగజేయాలని, జిల్లాలో అనుకున్న అభివృద్ధిని సమష్టి కృషితో సాదిద్ధామని అన్నారు. నేరరహిత జిల్లాగా కామారెడ్డి జిల్లాను నిలుపుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని పలు శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.