నిజామాబాద్

‘న్యాక్’ గుర్తింపు దక్కినా.. నిధులు ఎండమావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 2: రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు సాధించిన యూనివర్శిటీగా ఘనతను దక్కించుకున్నప్పటికీ, నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిధుల లేమి సమస్య దూరం కాలేకపోతోంది. గత మూడేళ్ల క్రితమే న్యాక్ గ్రేడింగ్ దక్కడంతో నిధుల వరద పారుతుందని అంతా భావించగా, ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పటివరకు న్యాక్ గుర్తింపు ద్వారా ప్రత్యేకంగా సమకూరిన నిధులేవీ లేవని వర్శిటీ అధికార వర్గాలు ఉసూరుమంటున్నాయి. నిజానికి న్యాక్ గుర్తింపు కోసం అప్పట్లో ఇన్‌చార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయపరుస్తూ అహరహం శ్రమించారు. న్యాక్ ప్రతినిధి బృందాలను ఆకట్టుకునే రీతిలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను అమలు చేశారు. అప్పటికే యూనివర్శిటీ నిధుల కొరతతో సతమతం అవుతున్నప్పటికీ, ఎలాగైనా న్యాక్ గుర్తింపు దక్కించుకోవాలనే తాపత్రయంతో లక్షలాది రూపాయలను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించి తెలంగాణ యూనివర్శిటీకి న్యాక్ గ్రేడింగ్ దక్కడంతో, ఇక నిధులు వెల్లువెత్తుతాయని, తద్వారా వర్శిటీకి మహర్దశ పడుతుందని అంతా ఆశించారు. అయితే ఇప్పటివరకు న్యాక్ గుర్తింపు వల్ల నిధుల పరంగా ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనమంటూ ఏదీ లేకుండాపోయింది. నిజానికి ఇక్కడ వర్శిటీ ఏర్పాటైన నాటి నుండి కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నిధుల లేమితో సతమతం కావాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బడ్జెట్‌లో అరకొర నిధులనే కేటాయిస్తోంది. దీంతో వౌలిక సదుపాయాల లేమి వెంటాడుతోంది. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ వర్శిటీకి నిధుల మంజూరీలో వివక్షను ప్రదర్శించారంటూ ఆక్షేపిస్తూ వచ్చిన తెరాస పార్టీ, ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంలో రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చినప్పటికీ గడిచిన ఐదేళ్లుగా నిధుల కేటాయింపుల్లో అదే వైఖరిని అవలంభించడాన్ని విద్యార్థులు, విద్యావేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ తె.యుకు అరకొర నిధులతోనే సరిపెట్టుకున్నారు. వౌలిక వసతుల కల్పనకు కనీసం వంద కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రతిపాదనలు పంపగా, కేవలం పాతిక శాతం నిధులను మాత్రమే విదిల్చడం నిరాశపర్చింది.
అత్తెసరు నిధుల్లో సింహభాగం అధ్యాపకులు, సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. 2006వ సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ వర్శిటీ నిధుల లేమి వల్ల మొదటి మూడు సంవత్సరాల పాటు తాత్కాలికంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్శిటీ తరగతులను నిర్వహించారు. అనంతరం డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో కేటాయించిన స్థలంలో కొన్ని గదుల నిర్మాణాలను చేపట్టి 2009లో ఆదరాబాదరగా వర్శిటీని అక్కడికి తరలించారు. మొత్తం 18కోర్సులలో దాదాపు 3వేల మంది వరకు విద్యార్థిని, విద్యార్థులు చదువుకుంటుండగా, ఏ ఒక్క విభాగంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు సమకూరిన దాఖలాలు కనిపించడం లేదు. పుష్కర కాలం గడిచినా, వివిధ విభాగాల తరగతి గదుల కొరత దూరం కాలేకపోతోంది. సమీకృత భవన సముదాయం, ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిల్డింగ్‌లతో వివిధ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక భవనాలు, ప్రయోగశాలల నిర్మాణాలు జరగాల్సి ఉంది. 400పైచిలుకు ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిఉన్నప్పటికీ, వివిధ కోర్సులకు సంబంధించి భవన నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఇక్కట్లు దూరం కావాలంటే కనీసం వంద కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేయగా, కనీసం సగభాగమైనా నిధులు కేటాయించడం లేదు. కనీసం న్యాక్ గుర్తింపు దక్కించుకున్నందున యూజీసీతో పాటు ఇతర సంస్థల ద్వారా నిధులు సమకూరుతాయని ఆశించినప్పటికీ, అవి కూడా మంజూరైన జాడ కానరావడం లేదు.

అయిలాపూర్‌లో ‘కంటి వెలుగు’
వైద్య శిబిరం ప్రారంభం

నందిపేట్, జనవరి 2: నందిపేట మండలం అయిలాపూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు వైద్య శిబిరాన్ని స్థానిక మాజీ సర్పంచ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మీసాల సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ, అయిలాపూర్‌లో గ్రామంలో ప్రారంభించిన ‘కంటి వెలుగు’ శిబిరం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రామంలో 6వేల మంది జనాభా ఉందని, రోజుకు 300మందికి కంటి పరీక్షలు జరుపుతామని ఆయన తెలిపారు. తమ పరీక్షల్లో మోతిబిందు, కార్నియాగ్లాకోమా సమస్యలు ఉన్నవారిని గుర్తించి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. స్థానికులు తమ విధిగా శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సంతోష్‌కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్తామాలోజిస్టు వనిత, ఏఎన్‌ఎం రేణుక, సిబ్బంది రమణ, సురేందర్, రోషమ్మ, శైలజ, లావణ్య, అర్చన, ఆశ కార్యకర్తలు, స్థానిక నాయకులు గంగాధర్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు తిమ్మాపూర్ విద్యార్థుల ఎంపిక
మోర్తాడ్, జనవరి 2: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన శివాని, రవళిలు జాతీయస్థాయి బాల్‌బ్యాట్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాజేందర్, పీఇటీ శ్యామ్‌లు తెలిపారు. డిసెంబర్ 24నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో జరిగిన అండర్-17 విభాగంలో తమ పాఠశాలకు చెందిన శివాని, డిసెంబర్ 25నుండి వరంగల్‌లో జరిగిన అండర్-14 విభాగంలో మోహని రవళిలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారని వారు తెలిపారు. ఈ నెల 7నుండి 9వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తారని వారన్నారు. ఎంపికైన ఇద్దరు క్రీడాకారులను గ్రామాభివృద్ధితో పాటు ఉపాధ్యాయులు పురుషోత్తం, చరణ్, సయ్యద్‌బాబు, శ్యామలత, సోనియా, స్వర్ణలత తదితరులు అభినందించారు.

మోర్తాడ్ ఎంఈఓగా ఆంధ్రయ్య
మోర్తాడ్, జనవరి 2: మోర్తాడ్ మండల విద్యాధికారిగా ఆంధ్రయ్య బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇన్నాళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన పాలెం ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ పదవి విరమణ చెందడంతో కమ్మర్‌పల్లి ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆంధ్రయ్యకు మోర్తాడ్ మండల విద్యాశాఖాధిరిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదవి విరమణ పొందిన ఎంఈఓ రాజేశ్వర్ పూర్తి బాధ్యతలను, రికార్డులను నూతన ఎంఈఓ ఆంధ్రయ్యకు అందజేశారు. పదవి విరమణ పొందిన రాజేశ్వర్‌తో పాటు నూ తన ఎంఈఓ ఆంధ్రయ్యలను రెండు మండలాల వివిధ ఉపాధ్యాయ సం ఘాల బాధ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మో ర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలకు చెందిన వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభం
డిచ్‌పల్లి రూరల్, జనవరి 2: తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర శాఖలో బుధవారం రోజున న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థులకు, వారి పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ తరగతులను న్యాయశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లోసా మాట్లాడుతూ, దేశ, విదేశాలలో పిహెచ్.డి న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ శాస్త్రం దేశం మొత్తంలో కొన్ని విశ్వవిద్యాలయాలలో మాత్రమే న్యాయశాస్త్రంలో పరిశోధనలు జరుగుతున్నాయని, అటువంటి జాబితాలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉండటం ఈ ప్రాంతవాసుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. న్యాయశాస్త్ర పరిశోధనల ఆధారంగా చట్టాలు, రూల్స్, ఆర్డర్ల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. 2013-14బ్యాచ్‌కు చెందిన 17మంది న్యాయ పరిశోధక విద్యార్థులు, న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీయుద్దీన్, జి.నవీన్, బీ.రమేష్, బీ.సవిత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
కమ్మర్‌పల్లి, జనవరి 2: ఈ నెల 21వ తేదీన నిర్వహించే గ్రామ పంచాయతి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో శ్రీనివాస్ చెప్పారు. బుధవారం కమ్మర్‌పల్లిలోని స్ర్తిశక్తి భవన్‌లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని అన్నారు. గ్రామ పంచాయతి ఎన్నికలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ బాక్సులను వినియోగించడం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పేర్ ఎలా వేయాలని, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమన్వయకర్త రాజేశ్వర్‌గౌడ్ వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ ఆంధ్రయ్య, ఈఓపీఆర్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వంద అడుగుల రోడ్డును రద్దు చేయాలి

కంఠేశ్వర్, జనవరి 2: నగరంలోని వినాయక్‌నగర్ హౌసింగ్ బోర్డు గుండా భీంరాయ్‌గుడి వాగు మీదుగా గాయిత్రీనగర్, రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న ఆనంద్‌నగర్, నాగారం రోడ్డు వరకు నగర మాస్టర్ ప్లాన్-2018లో ప్రతిపాదించిన 100్ఫట్ల రోడ్డును రద్దు చేయాలని రింగ్‌రోడ్డు బాధితుల కమిటీ కన్వీనర్ రామ్మోహన్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45సంవత్సరాల తర్వాత నగరంలో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రభుత్వం ప్రజల ముందు కొన్ని ప్రతిపాదనలను ఉంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా 100్ఫట్ల రోడ్డుకు సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే సలహాలు, సూచనలు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. అలాగే అభ్యంతరాలుంటే మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో వినాయక్‌నగర్-2, హౌసింగ్ బోర్డుల మధ్యలో ఉన్న 100్ఫట్ల రోడ్డు గుండా భీంరాయ్‌గుడి దగ్గర ఉన్న వాగు మీదుగా గాయత్రీనగర్ శివారు ప్రాంతం గుండా రేడియోస్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతం నుండి, అలాగే పీఎఫ్ కార్యాలయం ప్రక్క నుండి ఆనంద్‌నగర్, నాగారం రోడ్డును కలుపుతూ 100్ఫట్ల రోడ్డును ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదన ప్రాంతంలో వాగు నుండి ఇలాంటి రోడ్డు ఇప్పటి వరకు లేదన్నారు. ఆ ప్రాంతమంతా ప్రైవేట్ వ్యక్తులు అంటే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు రూపాయి, రూపాయి కూడ బెట్టుకొని ప్లాట్లు, ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. ఇందులో అనేక మంది బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంల ద్వారా రెగ్యులరైజేషన్ కూడా చేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు 100్ఫట్ల రోడ్డులో కొంత భాగం బహుళ ప్రయోజనకారి పేరున వినియోగించడమంటే ఇప్పుడు ఉన్న ఇళ్లను కూలగొట్టి కోట్లాది రూపాయల విలువైన భూమిని తీసుకొని ప్రజలను మానసికంగా కృంగదీయడమేనన్నారు. అందుకని మాస్టర్ ప్లాన్‌లోని 100్ఫట్ల రోడ్డు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కమిటీ సభ్యులు ప్రభాకర్, రాజు, పండరీ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు
ఏర్పాట్లలో అధికారులు బిజీ
నందిపేట్, జనవరి 2: గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల నిర్వాహణకు నందిపేట మండలంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో 33 గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న జరుగనున్నాయి. ప్రభుత్వ ప్రకటన మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా జనవరి 7, 8, 9 తేదీలలో నామినేషన్ల స్వీకరణ, 10న స్కృట్నీ, 11న అప్పీల్, 13న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 5గంటలకు బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీఓ నాగవర్ధన్, ఈఓపీఆర్డీ లక్ష్మణ్‌లు తెలిపారు. మండలంలో 33గ్రామ పంచాయతీలలో సర్పంచ్, 312వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. అందుకు 312 పోలింగ్ స్టేషన్లకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, నామినేషన్ పత్రాలు సి ద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

పంచాయతీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలి
మోర్తాడ్, జనవరి 2: గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పటీష్టంగా నిర్వహించాలని మోర్తాడ్ ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో ఎంపిక చేయబడిన ఎన్నికల సిబ్బందికి బుధవారం మండల కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాల్లోని పాఠశాలల్లో ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, బ్యాలెట్ పద్దతిలో నిర్వహించే పోటీల్లో సర్పంచ్‌కు గులాబీ రంగులోనూ, వార్డు సభ్యుడికి తెలుపు రంగులోనూ బ్యాలెట్ పేపర్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు నియామక పత్రాలను అందజేయాలని, ఆ కాపీలను కూడా అదనంగా ఒక్కో దానిని రాసి మండల కార్యాలయానికి పంపించాలని ఆయన కోరారు. ఎన్నికల విధులను నిస్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన కోరారు. అనంతరం పీఓ, ఏపీఓలకు ఎన్నికల విధానాలను తెలిపే సమాచారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు, రెండు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇంకుడు గుంతల అడ్రస్ ఎక్కడ?
ఆరంభశూరత్వంగానే మిగిలిపోయిన అధికారుల ప్రయత్నాలు

కంఠేశ్వర్, జనవరి 2: నగరంలో నీటి ఇక్కట్లను నివారించాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ఇదివరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో నగరంలో ఎక్కడపడితే గుంతలను తవ్వించినప్పటికీ, వాటి నిర్మాణాలు మాత్రం చేపట్టలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో వేసవిలో దాహార్తి సమస్య తెరపైకి వచ్చే ఆస్కారం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజాప్రతినిధులు, అధికారులు నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వర్షాలు కురిస్తే ఒకలాగా, వర్షాలు కురియకపోతే మరోలా వ్యవహరించడం ప్రజాప్రతినిధులకు ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి గత రెండు సంవత్సరాల క్రితం వర్షాలు కురియకపోవడంతో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాగనీటి కోసం వందలాది మీటర్లు బోరుబావులు తవ్వించినా, దుమ్ము, ధూళి తప్ప చుక్క నీరు పైకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వర్షాకాలం చివరిలో ఒక మోస్తారుగా వానలు కురిసినప్పటికీ, నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల కారణంగా వర్షపు జలాలు భూమిలోకి ఇంకలేకపోయాయి. దీంతో నగర ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పలేదు. ఈసారి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితే పునరావృతం అయ్యే ప్రమాదం కనిపిస్తోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురియని సమయంలోనూ బోరుబావులు ఎత్తిపోకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి కనీసం ఒక ఇంకుడు గుంతతో పాటు జలాలు ఎక్కువగా వృధా అయ్యే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాల్సిన అధికారులు, చోద్యం చూస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. గత వేసవిలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాఠశాలల్లో, ఆయా సమావేశాల్లో ఇంకుడు గుంతలను ప్రతి ఇంటి యజమాని నిర్మించుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఉద్బోధించడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారు ఇంకుడు గుంతను నిర్మించుకుంటేనే గృహ నిర్మాణానికి అనుమతి ఇస్తామంటూ నిబంధనలు కూడా విధించారు. కానీ, ప్రస్తుతం ఇంకుడు గుంతల ఆవశ్యకతను మరిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు, భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతున్నా, ఆ సమస్యను అధిగమించేందుకు సరైన చర్యలు తీసుకోకపోవడం నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నగరంలోని ఖలీల్‌వాడి, వినాయక్‌నగర్, కంఠేశ్వర్, గాజుల్‌పేట్, పెద్దబజార్ తదితర డివిజన్లలో తాగునీటి సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇక నగర శివార్లలోని ధర్మపురి హిల్స్, వెంగళ్‌రావుకాలనీ, నాగారం తదితర డివిజన్లలో ఇప్పటికీ కనీసం కుళాయిలు ఏర్పాటు చేయకపోగా, బోరుబావులు కూడా కనిపించవు. దీంతో ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడి జీవనం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో ఇంకుడు గుంతలు అసలే కనిపించవు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ప్రజల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సమాధానం ఇస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా అలసత్వం వీడి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.